సబ్సిడీ గ్యాస్‌కు కొత్త నిబంధనలు
పీఎన్‌జీ ప్రాంతాల్లో ఎల్పీజీ కనెక్షన్ సరెండర్ చేయాల్సిందే
మూడు నెలల్లో ‘ఎల్పీజీ–ఫ్రీ’ ప్రాంతాలే లక్ష్యం
ఒకసారి పీఎన్‌జీకి మారితే ఎల్పీజీకి అవకాశం ఉండదు
సాక్షి, అమరావతి: దీపం–2 పథకం ద్వారా పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్‌జీ) వినియోగదారులకు సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, అదే సమయంలో ఎల్పీజీ వినియోగదారులపై కఠిన నిబంధనలు విధించింది. పీఎన్‌జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఇకపై ఎల్పీజీ కనెక్షన్ కొనసాగించే అవకాశం లేకుండా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీఓ ఎంఎస్ నంబర్ 11 జారీ చేసింది.
పీఎన్‌జీలోకి మారాల్సిందే..
దీపం–2 పథకం పరిధిని పీఎన్‌జీ వినియోగదారులకు విస్తరించగా, ఇప్పుడు ‘ఆంధ్రప్రదేశ్ పీఎన్‌జీ సబ్వెన్షన్ స్కీమ్‘ అమలు కోసం పాటించాల్సిన విధివిధానాలను అధికారులు ఖరారు చేశారు. ఈ నిబంధనల మేరకు పీఎన్‌జీ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎల్పీజీ వినియోగ దారులు పీఎన్‌జీకి మారడంతోపాటు అదే సమయంలో తమ వద్ద ఉన్న ఎల్పీజీ కనెక్షన్‌ను 30 రోజుల్లో తప్పనిసరిగా సరెండర్ చేయాలి. లేదా భవిష్యత్తులో పీఎన్‌జీ లేని ప్రాంతానికి మారితే ఉపయోగించుకునేందుకు ట్రాన్స్‌ఫర్ ఓచర్ తీసుకోవాలి.
అలాగే పీఎన్‌జీ అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లోని ఎల్పీజీ వినియోగదారులకు ప్రత్యేక నోటీసులు జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా ఎల్పీజీ నుంచి పీఎన్‌జీకి మార్చుకునేలా ఒత్తిడి తీసుకురావాలి. ఒకసారి పీఎన్‌జీ కనెక్షన్ పొందిన, మారిన తర్వాత ఇక భవిష్యత్‌లో ఎల్పీజీ సిలిండర్ తీసుకోడానికి వీలుండదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం, మున్సిపాలిటీలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
3 నెలల్లో ఎల్పీజీ ఫ్రీ జోన్‌గా..
పీఎన్‌జీ వినియోగదారుల ఆధార్ వివరాలు సేకరించి దీపం–2 డేటాబేస్‌తో అనుసంధానం చేస్తారు. అర్హులను గుర్తించి సబ్సిడీ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు ఏర్పాటు చేస్తారు.. ఇప్పటికే పీఎన్‌జీ ఉన్న వారికి, పీఎన్‌జీ మౌలిక వసతులు ఉన్న ప్రాంతాలను రానున్న మూడు నెలల్లో ‘ఎల్పీజీ–ఫ్రీ ప్రాంతాలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నగర పాలక, పురపాలక సంఘాలతో కలిసి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.. మరొక వైపు పీఎన్‌జీ మౌలిక వసతులను మరింత విస్తరించడంతో పాటు పైప్‌లైన్, పీఎన్‌జీ, సీఎన్‌జీ స్టేషన్లకు అవసరమైన అనుమతులు వేగంగా మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అలాగే పీఎన్‌జీ గ్యాస్ కనెక్షన్ల కోసం పెండింగ్ దరఖాస్తులను సమీక్షించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పీఎన్‌జీ కనెక్షన్లు, వినియోగంలో లేని కనెక్షన్ల పునరుద్ధరణ, ఎల్పీజీ–ఫ్రీ జోన్ల అమలును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.అర్హుల ఎంపిక, డేటా అనుసంధానం, సబ్సిడీ నిధులను ఎస్‌జీఎస్ డబ్ల్యూకు ముందస్తుగా విడుదల చేసే బాధ్యతను సివిల్‌సప్లయిస్‌కు అప్పగించారు.
వినియోగదారుల్లో ఆందోళన
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై గ్యాస్ వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పీఎన్‌జీ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఎంపిక చేసుకునే స్వేచ్ఛపై పరిమితులు విధించడం సరికాదని వినియోగదారుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.అన్ని ప్రాంతాల్లోనూ పీఎన్‌జీ సేవలు ఒకే స్థాయిలో అందుబాటులో లేవని, ఇలాంటి సందర్భంలో పీఎన్‌జీ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా ఎల్పీజీ వినియోగించే అవకాశం లేకపోవడం దారుణమని పేర్కొంటున్నారు. పీఎన్‌జీ టారిఫ్‌లు భవిష్యత్తులో పెరిగితే వినియోగదారులకు ప్రత్యామ్నాయం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడు తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సబ్సిడీ ప్రకటిస్తూనే, మరోవైపు ఎల్పీజీ కనెక్షన్‌ను తప్పని సరిగా వదులుకోవాల్సిన నిబంధన విధించడంపై మండిపడుతున్నారు.


