తాడేపల్లి : ‘సాక్షి’పై కేసుకు కూటమి ప్రభుత్వం జీవో జారీ చేయడంపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజాలు రాస్తే కేసులా? అంటూ పార్టీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ‘మీడియా గొంతు నొక్కాలని చూస్తారా?, సాక్షిపై కేసుకు జీవో జారీ చేయడం ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి. జీవోను వెంటనే ఉపసంహరించాలి. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా హరించి వేస్తుంది.
ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, అక్రమాలను వెలుగులోకి తెస్తే కేసులు పెడతారా?, మీడియా సంస్థల గొంతు నొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేయటం దుర్మార్గం. అద్విక ట్రేడింగ్ కంపెనీ డిపాజిట్ మోసం కేసులో విచారణ జరపాల్సింది పోయి పత్రికపై కేసు పెట్టటం ఏంటి?, సమాధానం చెప్పలేక కేసులతో బెదిరిస్తారా?, ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉంటే సాక్షి పత్రిక ప్రచురించిన వార్తలోని ఆర్థిక వ్యవహారంలో అసలు ఏం జరిగింది?, డిపాజిటర్ల ఫిర్యాదులు ఏమయ్యాయి?
దర్యాప్తు ఏ దశలో ఉంది?, నిందితులతో ఎవరైనా అనధికారికంగా చర్చలు జరిపారా?, కేసు వ్యవహారంలో అధికార దుర్వినియోగం జరిగిందా లేదా?, అనే విషయాలపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు.


