తాడేపల్లి :ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టాలని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఇందుకోసం సోషల్ మీడియాను గ్రామస్థాయి నుంచి విస్తృతంగా వాడుకోవాలన్నారు. ఈరోజు(శుక్రవారం, జూలై 31వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా విభాగం సమావేశం నిర్వహించారు సజ్జల. దీనికి రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ, నగర అధ్యక్షులు హాజరయ్యారు.
దీనిలోభాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ అసభ్య పదజాలం, మార్ఫింగ్ కంటెంట్‌కు తావివ్వకూడదు. ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టండి. గ్రామస్థాయి నుంచి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలి. అక్రమ కేసులు, వేధింపులన్నీ ‘డిజిటల్ డైరీ’ లో నమోదు చేయాలి. ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. వివరణలు ఇచ్చే పరిస్థితి నుంచి అటాకింగ్ మోడ్‌లోకి రావాలి. సోషల్ మీడియా కార్యకర్తలు ఒక వన్ మ్యాన్ ఆర్మీలా పని చేయాలి.
పదునైన కంటెంట్‌తో నిజాన్ని పదిమందికి చేరవేయాలి. ప్రజల గొంతుకగా, క్రమశిక్షణతో కూడిన బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రతినిధులుగా పని చేయాలి. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా, సిద్ధాంతాలను, లైన్ ఆఫ్ థింకింగ్‌ను వదులుకోకుండా నిలబడాలి. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగాన్ని తొలిసారిగా ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థగా గ్రామ స్థాయి వరకు బలోపేతం చేశాం.
చంద్రబాబుకు ప్రజాబలం లేదు.. కేవలం భ్రమలు కల్పించే మీడియా వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం, కుట్రలతో అధికారం చలాయిస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న మనపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను తీవ్ర అప్పుల ఊబిలోకి నెట్టి, అబద్ధాలతో స్వర్గం చూపిస్తున్నది.
పాలనలో విఫలమై, ప్రశ్నించే వారిపై వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల ఆకాంక్షలే శ్రీరామరక్షగా మన పార్టీ ధృఢంగా నిలబడింది.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేయడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. నాయకత్వ నిబద్ధత, కార్యకర్తల కృషితో 2029లోభారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం’ అని స్పష్టం చేశారు.


