మచిలీపట్నం: కూటమి ప్రభుత్వంలో చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో స్పోర్ట్స్ కోటా పేరిట అనర్హులకు, పచ్చ చొక్కాల అనుచరులకు అడ్డదారిలో ఉద్యోగాలు కట్టబెడుతూ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీఎస్సీలో అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు నియామాకల్లో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం తక్షణమే సీబీఐ తో విచారణ జరిపించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...
జీవోల రద్దు – అడ్డదారిలో సరికొత్త 'పచ్చ' క్రీడలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనాదిగా అమలవుతున్న జీవో నెంబర్ 74, 75 ల ప్రకారం ఉద్యోగ నియామకాలలో 2% స్పోర్ట్స్ కోటా అమలు జరిగేది. కానీ, సరిగ్గా డిఎస్సీ ప్రకటన వెలువడే ఏప్రిల్ 19వ తేదీన ఆ పాత జీవోలను రద్దు చేసి, స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా జీవో నెంబర్ 4, జఏడీ ద్వారా జీవో నెంబర్ 47 తీసుకొచ్చారు. ఈ రెండు జీవోల ముఖ్య సారాంశం ఏంటంటే... స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం రావడానికి ఎలాంటి డిగ్రీ చదవక్కర్లేదు, టెట్ (TET) రాయక్కర్లేదు, ఆఖరికిడీఎస్సీ పరీక్ష కూడా రాయాల్సిన అవసరం లేదు.
టీడీపీ నాయకుల చేతుల్లో క్రీడా సంఘాలు – సర్టిఫికెట్ల విక్రయం
ఈ జీవోల ప్రకారం క్రీడల్లో పాల్గొన్నట్లు ఇచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటే చాలు ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టేస్తున్నారు. ఇలా మొత్తం 400 చిల్లర పోస్టుల్లో ఇప్పటికే 380 కి పైగా ఉద్యోగాలను నియామకం చేశారు. ఈ సర్టిఫికెట్లు ఇచ్చే క్రీడా సంఘాలు, అసోసియేషన్ల అధ్యక్షులుగా ఉన్నది ఎవరయ్యా అంటే... కూటమి ప్రభుత్వంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, లోకేష్ గారి అనుచరులు, టీడీపీ జెండాలు మోసిన నాయకులే! జూడో, సాఫ్ట్ బాల్ వంటి క్రీడా సంఘాల నుంచి ఒక్కో దానికి 38, 39 చొప్పున సర్టిఫికెట్లు ఇప్పించుకుని తమ సొంత మనుషులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు.
అంతర్జాతీయ మెడలిస్టులకు సున్నా
మన దేశం, రాష్ట్రం గర్వపడేలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇస్తే ఏమాత్రం తప్పులేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? అసలు గ్రౌండ్‌లో అడుగుపెట్టకుండా, కేవలం నాలుగు కాలేజీలు కలిసి ఆడుకున్న ఆటల్లో బయట కూర్చుని నీళ్ల సీసాలు, బాల్స్ అందించిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటే చాలు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు ఉద్యోగం రాక కన్నీళ్లు పెట్టుకుంటుంటే, అడ్డదారిలో వచ్చిన కూటమి కార్యకర్తలకు మాత్రం ఉద్యోగాలు పంచిపెట్టడం అత్యంత దారుణం.
ద్వంద్వ నీతి..
30-35 ఏళ్లుగా విద్యార్థులకు పాఠాలు చెప్పి, మరో రెండేళ్లలో రిటైర్ అయ్యే 60 ఏళ్ల వయసున్న ఉపాధ్యాయులను మాత్రం నైపుణ్య పరీక్షల పేరిట 'టెట్ రాయండి' అని వేధిస్తున్నారు. మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు గారు మాత్రం తన కంటి సైగలతో డిఎస్సీలో 400 చిల్లర మందికి టెట్ లేదు, డిఎస్సీ పరీక్షా లేదు అని అడ్డదారి ఉద్యోగాలు ఎలా ఇస్తారు? ఇది నిరుద్యోగ యువతను, కష్టపడి చదివిన అభ్యర్థులను తీవ్రంగా మోసం చేయడమే. దొడ్డిదోవన పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో పొందిన 380కి పైగా నియామకాలను వెంటనే రద్దు చేసి, అర్హులైన ప్రతిభావంతులకు, నిజమైన క్రీడాకారులకు న్యాయం చేయాలి.
వైఎస్సార్సీపీ డిమాండ్లివే...
ఈ నేపధ్యంలో జీవో నెంబర్ 4, 47 ల మరుగున జరిగిన ఉపాధ్యాయ నియామకాల అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించడంతో పాటు.. విద్యావ్యవస్థను, నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసినందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.


