రాష్ట్ర రాజకీయాలలోనే కాదు.. దేశ రాజకీయాలలో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్‌గా ఉన్నారు. ఆ విషయం ఆయన కూడా పలుమార్లు చెప్పుకుంటారు. ఆ సీనియారిటీని ఆయన సమాజ హితవు కోసం, వివిధ వర్గాల ఐక్యత కోసం ఉపయోగించాలని ఎవరైనా కోరుకుంటారు. దురదృష్టవశాత్తు ఈ వయసులో కూడా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు.
కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే, కాపు వర్గ నేత బోండా ఉమామహేశ్వరరావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాని, వైఎస్సార్‌సీపీని పదేపదే అనుచిత భాషతో ప్రస్తావించడం కాని, సామాజిక కార్యక్రమాలలో సైతం ఆయా పార్టీలవారు శత్రువుల మాదిరిగా చూసుకోవాలన్నట్లుగా చేస్తున్న సూచనలు కాని ఏ మాత్రం సమంజసమైనవని అనిపించవు. బోండా ఉమా పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తుంటే పిలిచి మాట్లాడవచ్చు. అలాకాకుండా పార్టీలోని ఇతర నేతలకు కూడా ఒక సంకేతం వెళ్లేలా చంద్రబాబు ఇచ్చిన డైరెక్షన్ టీడీపీలోనే చర్చనీయాంశం అయింది.
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణించిన తర్వాత వివిధ పార్టీలకు చెందినవారు ఆయన స్వస్థలం కిర్లంపూడి వెళ్లి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముద్రగడకు కాపు సామాజికవర్గంలో ఉన్న గుర్తింపు రీత్యా వివిధ ప్రాంతాలలో సంతాప సభలు జరిగాయి. ఇవి పార్టీలకు అతీతంగా జరగడం గమనించదగ్గ అంశం. ఆ సభలు పెద్దగా రాజకీయ ప్రస్తావన లేకుండానే సాగాయి. ఒక సంతాప సభలో బోండా ఉమా, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఈ ఘట్టాన్ని వైఎస్సార్‌సీపీ నాయకత్వం సీరియస్‌గా తీసుకోలేదు. అంబటిని కాని మరెవ్వరిని కాని తప్పు పట్టలేదు. కాని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం బోండా ఉమాపై సీరియస్ అయినట్లు తెలుగుదేశం పత్రికలలో ప్రముఖంగా వార్తా కథనాలు వచ్చాయి.
ఈ సందర్భంగా గొడ్డలి పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దని చంద్రబాబు చెప్పారని ఎల్లో మీడియాలో ఒకటైన ఈనాడు పత్రిక మొదటి పేజీలో ప్రచురించింది. చంద్రబాబు ఎప్పుడైనా విమర్శల కోసం ఒకసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే అదో తరహా. కాని నిత్యం గొడ్డలి అని అభ్యంతరకర పదం వాడుతున్నారంటే ఏమని అనుకోవాలి? గొడ్డలితో హత్య చేసింది ఎవరు? అతను ఎల్లో మీడియాలో కూర్చుని డిబేట్లలో ఎలా పాల్గొన్నారు. ఆయనకు లాయర్‌ను పెట్టిందెవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నప్పటికీ, చంద్రబాబు మాత్రం గొడ్డలి పదాన్ని వాడడం మానడం లేదు. ఆ కేసులో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ చెప్పినా అదే దుష్ప్రచారం చేయడం కూడా సీనియర్ రాజకీయ నేతకు తగిన విషయమేనా? ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా వైఎస్సార్‌సీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దని చెప్పడం అంటే మరీ అతిగా లేదా?
పెళ్ళిళ్లు, పబ్బాలు, చావులు, సంతాప సభలలో వివిధ రాజకీయ పక్షాలవారు కలవకుండా ఉంటారా? వారు మాట్లాడుకోకుండా ఉంటారా? అది కూడా తప్పే అవుతుందా? ముద్రగడ చనిపోయే సమయానికి వైఎస్సార్‌సీపీలో ఉన్నా, ఆయన కాపు ఉద్యమ నేతగానే జనంలో నిలిచారు. ఆయన ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు వద్దని అంతిమ లేఖలో చెప్పి ఉండవచ్చు. అందువల్లే ఆయన సంతాప సభలలో పాల్గొన్న టీడీపీ నేతలను తప్పుపట్టవచ్చా? కాపులంతా ఒక చోట సమావేశం అవుతుంటే, అలాంటి వేదికలను ఆ వర్గానికి చెందిన ఆయా పార్టీ నేతలు ఎలా పంచుకోకుండా ఉంటారు. అలా చేస్తే కులానికి దూరం అవుతామోమో అన్న భయం వారిలో ఉండవచ్చు.
ఇంకో విషయం చెపాలి. ఈ మధ్య ఒక సదస్సులో అంబటి రాంబాబు, టీడీపీకి గతంలో పెద్ద మద్దతుదారు అన్న పేరున్న మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అంత మాత్రాన వారిద్దరూ ఒకటైపోయినట్లవుతుందా? కొద్ది సంవత్సరాల క్రితం ఒక సందర్భంలో అప్పటి వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డి, చంద్రబాబు పక్కపక్కన కూర్చుని మాట్లాడుకున్నారే! ఒకప్పుడు చంద్రబాబు ఏమని ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. మిగిలిన సమయం అంతా అభివృద్ది, పాలనపైనే దృష్టి పెట్టాలని అనేవారు. అలా చేసినా, చేయకపోయినా కనీసం మాటవరసకైనా ప్రసంగించేవారు. కాని ఇప్పుడేమో వైఎస్సార్‌సీపీవారికి ఏమి చేయవద్దు.. వైఎస్సార్‌సీపీవారితో కలవవద్దు, వేదికలు పంచుకోవద్దని అంటున్నారు. తద్వారా చంద్రబాబు సీనియారిటీకే అప్రతిష్ట అవుతుంది తప్ప మరొకటి కాదు.
రాజకీయాల కోసం బంధుత్వాలు, స్పేహాలు కూడా వదలుకోవాలా! అన్నప్రశ్న రాదా? సంతాప సభలో ఉమా ప్రసంగిస్తూ కాపులలో అలజడి ఆరంభమైందని వ్యాఖ్యానించారు. కాపులను పట్టించుకోవాలని, వారి డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని ఆయన పేర్కొన్నారు. కాపు ఉద్యమం చేస్తున్న తరుణంలో ముద్రగడను నిర్లక్ష్యం చేయడం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. బహుశా మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో బోండా ఉమా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చన్న సందేహం చంద్రబాబుకు కలిగి ఉండవచ్చు. అయినా ఇంత ఓపెన్‌గా టెలికాన్ఫరెన్స్‌లో వైఎస్సార్‌సీపీ నేతలతో వేదిక పంచుకోవద్దని అనడం ద్వారా చంద్రబాబు వ్యక్తిత్వానికే నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో ఏర్పడింది. దీనికి ప్రతిగా బోండా ఉమా మరో వాదన తెరపైకి తీసుకువచ్చారు.
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏర్పాటు చేసిన సంతాప సభకు టీడీపీ నేతలు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వంటివారు వెళ్లినప్పుడు లేని అభ్యంతరం తను వెళితేనే వచ్చిందా అన్నది ఆయన ప్రశ్నగా ఉంది. బొత్స, తోట త్రిమూర్తులు వంటి వైఎస్సార్‌సీపీ నేతలతో కూడా టీడీపీ నేతలు ఆ కార్యక్రమాలలో సన్నిహితంగా మెలిగారు కదా అని ఉమా ఎత్తిచూపారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, బీజేపీ నేత సోము వీర్రాజు వంటివారు కూడా ఆ సభలో పాల్గొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారట. తాను వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లలేదని, కాపు నేత దాసరి రాము నిర్వహించిన సభకు వెళ్లానని, అక్కడ అంబటి రాంబాబు కలిసి పలకరిస్తే, సంస్కారంగా తాను కూడా మాట్లాడానని, తానేమీ పార్టీని ఇబ్బంది పెట్టలేదన్నది ఆయన అభిప్రాయంగా ఉంది.
ఈ నేపథ్యంలో బోండా ఉమాను పిలవడానికి ఒక కమిటీనే చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వద్దకు వెళ్లిన బోండా ఆ తర్వాత కాస్త తగ్గి మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఇకపై వైఎస్సార్‌సీపీవారితో వేదిక పంచుకోనని ఆయన అన్నారని వార్తలు వచ్చాయి. అంటే ఇది ఉమా తన వ్యక్తిత్వాన్ని తానే కించపరచుకోవడమే అవ్వదా! మొత్తం మీద ఏదో రకంగా ఉమాను భయపెట్టి ఉండాలి. జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధాల జోలికి పార్టీ అధిష్టానం ఎందుకు వెళ్లలేదో తెలియదు.
ఈ మధ్యకాలంలో కాపులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విశ్వాసం సడలుతోంది. ఆ వర్గంలో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడుతోందన్న ప్రచారం జరుగుతుండడానికి తోడు ఇలాంటి వివాదాల వల్ల తెలుగుదేశం పార్టీ మరింత ఇరుకున పడే అవకాశం ఉంటుంది. అది ఎలా ఉన్నా సామాజిక కార్యక్రమాలలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతలు కలిసినంతమాత్రాన ఏదో జరిగిపోతుందని భయపడి వాటిపై ఆంక్షలు పెట్టడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరీ సంకుచిత స్థాయికి చంద్రబాబు తీసుకువెళ్లినట్లు అవుతుందని చెప్పాలి. గతంలో ఇలాంటి వాతావరణం ఎన్నడూ లేదు. ఇది అత్యంత దురదృష్టకరం.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


