చంద్రబాబే మొత్తం భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం చేసినట్లు ఎల్లో గ్యాంగ్ తెగ బిల్డప్ ఇస్తోంది. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిందేమిటో రికార్డుపరంగా ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రజల దృష్టిని మరల్చేందుకు కూటమి నేతలు నానా పాట్లు పడుతున్నారు. వైఎస్ జగన్ పడిన కష్టమేంటి?. ఆయన శ్రమ ఎలా ఫలించింది? అసలు వాస్తవం ఏంటో? పరిశీలిస్తే..
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కార్యరూపం తీసుకొచ్చేందుకు నడుంబిగించారు. 2023 మే 3న భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. దాని వెనుక వైఎస్ జగన్ పడిన శ్రమను గుర్తుచేసుకుంటే.. ఇక్కడ 2,751 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయించారు. మరో వైపు, రైతులకు తగిన నష్టపరిహారం, నిర్వాసితులకు పునరావాసం విషయంలో తన ఉదారతను చాటుతూ వారిని ఒప్పించారు.
హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లన్నీ పరిష్కారమయ్యేలా చొరవ చూపించారు. విమానాశ్రయానికి అవసరమైన అనుమతుల కోసం వైఎస్ జగన్.. ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరో వైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని నిర్ణయించారు. పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ అందించారు. అసైన్డ్ భూములకు కూడా జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు.
ఇదే క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు జరిపిన చర్చలతో చాలామంది రైతులు సానుకూలంగా స్పందించారు. కోర్టుల్లో పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ పరిష్కరించాయి. నిర్వాసితులైన నాలుగు గ్రామాల్లోని 404 కుటుంబాలకు అత్యుత్తమమైన పునరావాసప్యాకేజీని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించింది. దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో టౌన్‌షిప్‌లను తలదన్నేలా రెండు కాలనీలను వారి కోసం నిర్మించింది.


