ఏపీవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో వైఎస్సార్‌సీపీ వినతి పత్రాలు | Ysrcp Petitions In District Collectors Across Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో వైఎస్సార్‌సీపీ వినతి పత్రాలు

Jul 31 2026 12:44 PM | Updated on Jul 31 2026 1:19 PM

Ysrcp Petitions In District Collectors Across Andhra Pradesh

సాక్షి, కృష్ణా జిల్లా: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్‌ చేశారు. డీఎస్సీలో అవకతవకలపై విచారణ జరిపించాలని కోరుతూ.. ఏపీవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో వైఎస్సార్‌సీపీ వినతి పత్రాలు సమర్పించింది.

ఈ సందర్భంగా మచిలీపట్నంలో పేర్ని నాని మాట్లాడుతూ.. డీఎస్సీలో అనర్హులలకు ఉద్యోగాలు ఇచ్చారని... లోకేష్‌ రికమండ్‌తో కొంత మంది ఉద్యోగం పొందారని.. నిజాయితీగా కష్టపడి చదువుకున్న వారి పరిస్థితి ఏంటి? అంటూ ఆయన నిలదీశారు. స్పోర్ట్స్‌ కోటా పేరుతో ఉద్యోగాలు లూటీ చేశారన్న పేర్ని నాని.. 16 వేల మందిలో దొంగ టీచర్లు కూడా ఉన్నారన్నారు.

అన్నమయ్య జిల్లా: డీఎస్సీలో జరిగిన అక్రమాలను సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ నిరసనలు చేపట్టింది. లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. మదనపల్లి జాయింట్ కలెక్టర్‌కు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, నిస్సార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘‘డీఎస్సీలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. స్పోర్ట్స్‌ కోటా పేరుతో ఉద్యోగాలు కావలసిన వారికి ఇచ్చుకున్నారు. అది కూడా యూనివర్సిటీ, కాలేజీ స్థాయిలో ఆడిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఆడిన వారిని పక్కన పెట్టారు. మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 3 లక్షల మంది అభ్యర్థులు హాజరైన పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది’’ అని ఆయన మండిపడ్డారు.

అనంతపురం జిల్లా: డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాల్సిందేనని వైఎస్సార్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలన్నీ టీడీపీ నేతలు అమ్ముకున్నారని.. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న మంత్రి నారా లోకేష్‌కు పదవిలో కొనసాగేందుకు ఒక్క క్షణం కూడా అర్హత లేదని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు.

వైఎస్సార్‌ జిల్లా: కడపలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ కలెక్టర్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తోందని రవీంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. సాక్ష్యాలు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీపై పూర్తి స్థాయి సీబీఐ విచారణ జరపాలి. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగితో ప్రశ్నపత్రాల అప్లోడ్ చేయించడం అక్రమాలకు నిదర్శనం. డబ్బులు ఇచ్చిన వారికే డీఎస్సీ ఉద్యోగాలు వచ్చాయని వైఎస్సార్‌సీపీ నిలదీసింది. లక్షలాది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడిందని మండిపడ్డారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement