సాక్షి,శ్రీకాకుళం: పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు తరలివచ్చిన అశేష జనవాహినిని చూసి ఓర్వలేకే వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆముదాలవలస పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ప్రకటనను విడుదల చేశారు.
శ్రీకాకుళం జిల్లాకు జగన్‌మోహన్ రెడ్డి రావడంతో ఆయనను చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. ఆముదాలవలస నియోజకవర్గం నుంచే వేలాది మంది జగన్ అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ కార్యక్రమ అపూర్వ విజయాన్ని చూసి కూటమి ప్రభుత్వ పెద్దలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి, మరికొందరు మంత్రులు దీనిపై మీడియాలో లేనిపోని డిబేట్లు పెట్టి మాట్లాడుతున్నారు.
వైఎస్ జగన్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులను పోలీసులు భారీ గేట్లు పెట్టి మరీ ఆపారు. ఆ సమయంలో స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తల మధ్యలోకి బూర్జ మండలం ఎస్‌ఐ ప్రవళిక వచ్చారు. ఆమె నాకు ముందే బాగా పరిచయం. ఇటీవల ఆమె అనారోగ్యంతో కాస్త ఇబ్బంది కూడా పడ్డారు. వేలాది మంది జనం ఒక్కసారిగా ముందుకు వస్తుండటంతో, ప్రమాదం జరగకుండా ఆమెను పక్కకు వెళ్లమని నేను కేవలం రిక్వెస్ట్ చేశాను. ఆ సమయంలో జనం పెద్ద పెట్టున ‘జై జగన్’ అంటూ నినాదాలు చేయడంతో ఆమె చెవులు మూసుకున్నారు. దీంతో మేము ఆమెను చాలా జాగ్రత్తగా పక్కకు తీసుకెళ్లాం." అని రవికుమార్ ఆ ఘటనపై స్పష్టతనిచ్చారు.
ఈ విషయాన్ని ఏదో పెద్ద అపరాధంగా, షాకింగ్ ఉదంతంగా చూపిస్తూ నాపై 109, 189, 191, 221, 121, 74, 79, 351, 119 వంటి అనేక కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హత్యానేరం, కుట్రలతో పాటు ఇతర అక్రమ కేసులు పెట్టారు. నేను ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాను, ఎల్‌ఎల్‌బీ (న్యాయశాస్త్రం) కూడా చదివాను.
నాలాంటి ఉన్నత విద్యావంతుడికి, చట్టం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిపై ఇన్ని దారుణమైన కేసులు పెట్టడం శోచనీయం. నాలాంటి సామాన్యుడిపై కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తోంది." అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి అక్రమ కేసులకు నేను ఎంతమాత్రం భయపడను. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడిన వ్యక్తిని నేను. భవిష్యత్తులో ఆయన కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా. అసలు ఏం జరిగిందో ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికే ఈ వీడియో విడుదల చేస్తున్నాను’ అని చింతాడ రవికుమార్ స్పష్టం చేశారు.


