విశాఖ: భోగాపురం ఎయిర్‌పోర్ట్ రావడానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో పాటు, ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే కారణమని, వారు చేసిన కృషి వల్లే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఇవాళ తుదిరూపు దిద్దుకుందని పార్టీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తిగా చెప్తున్నానని, విశాఖ ఎయిర్ పోర్ట్ విస్తరణ ప్రత్తిపాధన వచ్చినప్పుడు భోగాపురం, యలమంచిలి వద్ద స్థలాలు చూసామన్నారు. ఈ విషయాలు చంద్రబాబుకి, అశోక్ గజపతిరాజుకి సైతం తెలుసని బొత్స తేల్చిచెప్పారు.
ఈరోజు(శుక్రవారం, జూలై 31వ తేదీ) విశాఖపట్నం నుంచి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన బొత్స.. అసలు భోగాపురం ఎయిర్‌పోర్ట్ కోసం భూసేకరణ ఎవరు చేశారు? ఎవరు పరిహారం ఇచ్చారో లెక్కలు తీయమని సవాల్ విసిరారు. కొత్త ఎయిర్ పోర్ట్ ఆలోచన చంద్రబాబుది అని ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నించారు బొత్స. ఆయన హయాంలో ఒక్క ఎకరా భూమిని కూడా సేకరించలేదని, అటువంటప్పుడు ఆలోచన ఆయనది ఎలా అవుతుందన్నారు.
‘2019 వరకు భూ సేకరణ ఎక్కడ జరిగింది..?, 15 వేల ఎకరాలు కావాలని చెప్పిన చంద్రబాబు.. ఒక్క ఎకరమైనా సేకరించారా..?, భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం భూ సేకరణ ఎవరు చేశారు..?, పరిహారం ఎవరు ఇచ్చారు..? , లెక్కలు తియ్యండి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కోసం భూసేకరణ నుంచి నిర్మాణం వరకూ మా నాయకుడు వైఎస్ జగనే చేశారు’ అని స్పష్టం చేశారు.


