సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ కొట్టేయాలన్న చంద్రబాబు సర్కార్ తీరుపై వైఎస్సార్‌సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఎయిర్‌పోర్టుకు భూసేకరణ పూర్తి చేసి.. అనుమతులు తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. అయితే, చంద్రబాబుదే క్రెడిట్ అంటూ ఆంధ్రజ్యోతి రాతలపై కారుమూరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ తప్పుడు రాతలు దారుణమన్నారు.
‘భోగాపురం’ క్రెడిట్ కొట్టేయాలని చూస్తుందంటూ ఎల్లో మీడియా రాతలపై కారుమూరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తే 2019 కంటే ముందే మీరు కట్టేయొచ్చుగా అంటూ ఆయన మండిపడ్డారు. ‘‘విమానాశ్రయానికి సంబంధించి ఎన్నికలకు రెండు నెలలు ముందు చంద్రబాబు ఉత్తుత్తి శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు చేయటమే తప్ప ఏ ప్రాజెక్టుని పూర్తి చేసిన దాఖలాలు ఉండవు.. ఆ ప్రాజెక్టులను వదిలేస్తాడు. ఎవరైనా అన్ని అనుమతులు తీసుకొని వచ్చి శంకుస్థాపన చేస్తారా? ఏం అనుమతులు తీసుకురాకుండా కోర్టు కేసులు పెండింగ్ ఉండగా శంకుస్థాపన చేస్తారా? రాధాకృష్ణ సమాధానం చెప్పాలి కదా?
..2200 ఎకరాలలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ను భోగాపురంలో కట్టాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు అన్నిటిని పరిష్కరించి.. అక్కడ నాలుగు గ్రామాల్లో 404 కుటుంబాలు నిర్వాసితులను వేరే ప్రాంతాలకు తరలించి కాలనీలు నిర్మించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం భూసేకరణ చేసి.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసి తీసుకొచ్చింది. 2023 మే 3న వైఎస్ జగన్ భూమి పూజ చేశారు.
..విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు 77 మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుకు ప్రణాళిక సిద్ధం చేసి అప్పటి కేంద్ర మంత్రి గట్కారిని ఒప్పించారు. నేడు భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయిందంటే అది వైఎస్ జగన్ ముందు వల్లే.. ఆవిషయం గుర్తుపెట్టుకో రాధాకృష్ణ. మీరు ఎన్ని తప్పుడు రాతలు రాసిన ప్రజలకు వాస్తవాలు తెలుసు’’ అని కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు.


