తీర్పు అభిప్రాయాల వినియోగంపై ఆంక్షలు విధించలేం | Restrictions cannot be imposed on the use of judgment opinions says high court | Sakshi
Sakshi News home page

తీర్పు అభిప్రాయాల వినియోగంపై ఆంక్షలు విధించలేం

Aug 1 2026 5:06 AM | Updated on Aug 1 2026 5:06 AM

Restrictions cannot be imposed on the use of judgment opinions says high court

ఎస్‌జీపీ సింగమనేని ప్రణతి అప్పీల్‌పై ధర్మాసనం స్పష్టీకరణ

‘కాకినాడ’ భూ కుంభకోణం వ్యవహారంలో ఏసీబీ విచారణ నిలుపుదల

సాక్షి, అమరావతి: కాకినాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కోట్ల రూపాయల భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్ని, కోర్టునే తప్పుదోవ పట్టించిన వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ తీర్పునిచ్చిన సింగిల్‌ జడ్జి, ఆ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రజా బాహుళ్యంలో ఎవరూ, ఏ రకంగా వాడకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్‌ జడ్జి తీర్పులోని అభిప్రాయాలను పలువురు పలు రకాలుగా వ్యాప్తి చేస్తున్నారని, ఇది ప్రణతి ప్రతిష్టకు విఘాతం కలిగిస్తోందన్న ఆమె తరఫు సీనియర్‌ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. 

ఆ తీర్పు కాపీ పబ్లిక్‌ డాక్యుమెంట్‌ అని, అది ఇప్పటికే ప్రజా బాహుళ్యం (పబ్లిక్‌ డొమైన్‌)లో ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. అందువల్ల ఆ తీర్పును ఏ రకంగా ఉపయోగించకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సింగిల్‌ జడ్జి తన తీర్పులో ప్రణతి విషయంలో వ్యక్తం చేసిన అభిప్రాయాల అమలును తదుపరి విచారణ వరకు మాత్రమే ధర్మాసనం నిలుపుదల చేసింది. అలాగే ప్రణతిపై ఏసీబీ విచారణను సైతం తదుపరి విచారణ వరకు నిలిపేసింది.

 సింగిల్‌ జడ్జి తీర్పుపై ప్రణతి దాఖలు చేసిన అప్పీల్‌లో ప్రతివాదులుగా ఉన్న జయేంద్రనగర్‌ నివాసితుల సంక్షేమ సంఘానికి, పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement