breaking news
SGP
-
తీర్పు అభిప్రాయాల వినియోగంపై ఆంక్షలు విధించలేం
సాక్షి, అమరావతి: కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయల భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్ని, కోర్టునే తప్పుదోవ పట్టించిన వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ తీర్పునిచ్చిన సింగిల్ జడ్జి, ఆ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రజా బాహుళ్యంలో ఎవరూ, ఏ రకంగా వాడకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి తీర్పులోని అభిప్రాయాలను పలువురు పలు రకాలుగా వ్యాప్తి చేస్తున్నారని, ఇది ప్రణతి ప్రతిష్టకు విఘాతం కలిగిస్తోందన్న ఆమె తరఫు సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఆ తీర్పు కాపీ పబ్లిక్ డాక్యుమెంట్ అని, అది ఇప్పటికే ప్రజా బాహుళ్యం (పబ్లిక్ డొమైన్)లో ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. అందువల్ల ఆ తీర్పును ఏ రకంగా ఉపయోగించకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సింగిల్ జడ్జి తన తీర్పులో ప్రణతి విషయంలో వ్యక్తం చేసిన అభిప్రాయాల అమలును తదుపరి విచారణ వరకు మాత్రమే ధర్మాసనం నిలుపుదల చేసింది. అలాగే ప్రణతిపై ఏసీబీ విచారణను సైతం తదుపరి విచారణ వరకు నిలిపేసింది. సింగిల్ జడ్జి తీర్పుపై ప్రణతి దాఖలు చేసిన అప్పీల్లో ప్రతివాదులుగా ఉన్న జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘానికి, పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
‘రాజధాని’లో 5 శాతం పేదలకు
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతం మొత్తం విస్తీర్ణంలో 5 శాతాన్ని నిరుపేదల నివాసాల కోసం కేటాయిస్తామని గురువారం హైకోర్టుకు సీఆర్డీఏ కమిషనర్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) డి.రమేశ్ హామీ ఇచ్చారు. సీఆర్డీఏ పరిధిలో నిర్మాణాలన్నీ పూర్తయి, ల్యాండ్ పూలింగ్ కింద భూ యజమానులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చిన తరువాత చట్ట ప్రకారం 5 శాతాన్ని నిరుపేదల నివాసాల కోసం ఇస్తామని ఆయన తెలిపారు. ఈ హామీని న్యాయస్థానం నమోదు చేసుకుంది. తదుపరి విచారణను వచ్చే నెల 25కు వాయిదా వేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని సీఆర్డీఏ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాజధాని ప్రాంతం మొత్తం విస్తీర్ణంలో 5 శాతాన్ని నిరుపేదల నివాసాల కోసం కేటాయించాలని, అయితే ఆ దిశగా సీఆర్డీఏ అధికారులు ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని, ఆ విస్తీర్ణాన్ని గుర్తించి దానికి కంచె వేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తుళ్లూరు మండలం, రాయపూడి గ్రామానికి చెందిన పెద్దమాను కోటమ్మ, మరో 373 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారించారు. జాతీయస్థాయి మార్గదర్శకాల ప్రకారం మొత్తం విస్తీర్ణంలో 10 శాతాన్ని నిరుపేదల నివాసాల కోసం కేటాయించాల్సి ఉందని పిటిషనర్లు తెలిపారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం 5 శాతం కేటాయించాలన్నారు. అయితే ప్రభుత్వం తుది మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్లలో కేవలం 3 శాతాన్ని మాత్రమే చూపిందని, ఇందులో ఎంత విస్తీర్ణాన్ని నిరుపేదల నివాసాల కోసం ఇస్తారో ఎక్కడా స్పష్టం చేయలేదని వివరించారు.


