ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్త మొదటి భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడనే ఆగ్రహంతో తన ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య ఉదంతం కలకలం రేపింది. రామ్‌కిశోర్ వాల్మీకిగా గుర్తించిన బాధితుడి మృతదేహం సెప్టెంబర్ 17న భావఖేడ కాలువ సమీపంలోని ఒక బాక్సు (ట్రంక్)లో లభ్యం కావడంతో ఈ విషయం వెలుగు చూసింది.
నిందితురాలు సుఫియా బానోకు రామ్‌కిశోర్‌తో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లైన రామ్‌కిశోర్ భార్యకు దూరంగా ఉంటున్నాడు. దీంతో రెండేళ్ల క్రితం ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సుఫియాకు మున్నా అలియాస్ ముచ్ఛద్ (52) అనే వ్యక్తితో సంబంధం ఉన్నట్లు రామ్‌కిశోర్‌కు తెలిసిపోయింది. దీనిపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీనికితోడు రామ్‌కిశోర్ తన మొదటి భార్య కవితా దేవిని మళ్లీ కలుసుకోవడం, ఆర్థిక సాయం చేయడం మొదలుపెట్టాడు. దీన్ని సుఫియా వ్యతిరేకించింది. ఫలితంగా వివాదం మరింత ముదిరింది.
హత్యకు పథకం
మొదటి భార్యతో రామ్‌కిశోర్ సాన్నిహిత్యాన్ని సహించలేని సుఫియా.. తన ప్రియుడు మున్నా, అతని సహచరుడు ఇక్బాల్‌తో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. సెప్టెంబర్ 14-15 మధ్య రాత్రి సమయంలో తన ప్రియుడు మున్నాను, అతని సహచరుడు ఇక్బాల్‌ను తన ఇంటికి ఆహ్వానించి, తలుపు గడియ పెట్టకుండా వదిలేసింది. నిద్రపోతున్న రామ్‌కిశోర్‌పైకి ఎటాక్ చేసిన దుండగులు అతనిని కత్తితో పొడిచి చంపారు.
హత్య తర్వాత నేల మీద అంటిన రక్తపు మరకలను ప్లాస్టరింగ్ చేసి, రక్తంతో ఉన్న చీపురు, బాధితుడి దుస్తులు, కత్తిని దాచిపెట్టారు. ఆ తర్వాత తన 16 ఏళ్ల కుమారుడి సహాయంతో మృతదేహాన్ని మంచం కింద ఉన్న చెక్క పెట్టెలో దాచారు. మరుసటి రోజు రాత్రి ఆ మృతదేహాన్ని ఈ-రిక్షాలో తీసుకెళ్లి కాలువ వంతెన కింద పడవేశారు.
ఇదీ చదవండి: పూణె వ్యాపారి కిడ్నాప్ కేసు ట్విస్ట్ : మలేషియా ట్రిప్ అని చెప్పి!
సెప్టెంబర్ 17న రామ్‌కిశోర్ మొదటి భార్య కవితా దేవి మోహన్‌లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అదే రోజు మృతదేహాన్ని కనుగొన్నారు. సుమారు 180 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఈ-రిక్షా ఆధారంగా కేసు చేధించారు.నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.


