భోపాల్: మధ్యప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. భారీ వరదల కారణంగా కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అగర్ మాల్వా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నల్ఖేడా బగళాముఖి మాత ఆలయ సమీపంలో ఈ విషాదం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. నల్ఖేడా ప్రాంతంలో భారీ వానల కారణంగా వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నాలాపై ఉన్న వంతెన పైనుంచి నీరు ఉధృతంగా పారుతున్నప్పటికీ, డ్రెవర్ కారును కల్వర్టుపైనుంచి నడిపారు. దీంతో కారుని వరద నీరు ముంచెత్తడంతో కారు అదుపుతప్పి నాలాలో పడిపోయింది. వరదఉధృతి భయంకరంగా ఉండటంతో కారు క్షణాల్లోనే నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కారును ఎట్టకేలకు వెలిక్కితీశారు. అయితే అప్పటికే అందులో ఉన్న ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మృతులంతా ఒడిస్సాకు చెందిన వారిగా తెలుస్తోంది.ఈ ప్రమాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాగా గత కొద్దిరోజులుగా మధ్యప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.


