సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాతావరణ శాఖ రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, మెదక్, మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షాలు పడే సూచనలున్నాయి. మరోవైపు మరో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
రాత్రి దంచి కొట్టిన వాన
తెలంగాణ అంతటా గత రాత్రి భారీ వర్షాలు దంచి కొట్టాయి. హైదరాబాద్ సహా జనగామ, భద్రాద్రి, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలను ముంచెత్తాయి. కొడకంట్లలో 12 సెం.మీ, పాల్వంచలో 11.7 సెం.మీ. రామన్నపేట, దేవురుప్పలలో 10.8 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్‌లోనూ ఈ వేకువ జాము నుంచి ఎడతెరిపి లేకుండా రెండు గంటల సేపు గట్టి వాన పడడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.


