గణేశ్ చతుర్థి వచ్చిందంటే చాలు.. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పాటు డీజేల్లో మారుమోగే కొన్ని పాటలు పండగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మారుస్తాయి. అలాంటి పాటల్లో నాలుగున్నర దశాబ్దాలుగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పాట ‘దేవా హో దేవా గణపతి దేవా’. 1981లో విడుదలైన ఈ పాట ఇప్పటికీ గణేశ్ చతుర్థి వేడుకల్లో నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. అంతేకాదు.. ఒకే పాటకు ఆరుగురు ప్రముఖ గాయకులు తమ గాత్రాన్ని అందించడం ఈ పాటకున్న ప్రత్యేకత.
45 ఏళ్లుగా అదే జోష్
గణేశ్ చతుర్థిని పురస్కరించుకుని హిందీ చిత్రసీమలో ఎన్నో గణపతి పాటలు వచ్చాయి. అయితే వాటిలో ‘దేవా హో దేవా గణపతి దేవా’ పాటకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. సుమారు 45 ఏళ్ల క్రితం విడుదలైన ఈ గీతం ఇప్పటికీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సందడి చేస్తుంటుంది. పండగ సమయంలో డీజేలు, ఇతర వేడుకల్లో ఈ పాట వినిపించడం సర్వ సాధారణంగా మారింది.
‘హమ్ సే బఢ్కర్ కౌన్’తో అనుబంధం
ఈ పాట 1981లో విడుదలైన ‘హమ్ సే బఢ్కర్ కౌన్’ అనే హిందీ చిత్రంలోనిది. ప్రముఖ దర్శకుడు దీపక్ బహ్రీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నటుడు అమ్జద్ ఖాన్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో కనిపించారు. ఈ చిత్రంలోని ‘దేవా హో దేవా గణపతి దేవా’ పాట 1980లలో భక్తి గీతంగా విశేష ప్రజాదరణ పొందింది.
సినిమాను మించిన హిట్
సినిమాలో భాగమైనప్పటికీ ఈ పాటకు వచ్చిన ఆదరణ ప్రత్యేకంగా నిలిచింది. అమ్జద్ ఖాన్, మిథున్ చక్రవర్తి, డ్యానీ డెంజోంగ్పా, రంజితా కౌర్, నీతా మెహతా తదితరులపై ఈ పాటను చిత్రీకరించారు. అయితే సినిమా కంటే ఈ పాటకే ఎక్కువ గుర్తింపు లభించిందని చెబుతుంటారు. నాలుగు దశాబ్దాలకు పైగా గడిచినా గణేశ్ చతుర్థి సందర్భంగా ఈ పాటకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
ఆరుగురు దిగ్గజాల స్వరాలు
ఈ పాటకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒకే పాట కోసం హిందీ సంగీత ప్రపంచానికి చెందిన ఆరుగురు గాయకులు కలిసి తమ గాత్రాన్ని అందించారు. వారిలో మొహమ్మద్ రఫీ, ఆశా భోస్లే, శైలేంద్ర సింగ్, భూపేంద్ర, రామ్‌లక్ష్మణ్, సప్నా చక్రవర్తి ఉన్నారు. ఇంతమంది ప్రముఖ గాయకుల స్వరాలు కలవడం ఈ పాటకు మరింత ప్రత్యేకతను తీసుకువచ్చింది.
గణపతి వేడుకల్లో ఇప్పటికీ మార్మోగుతూ..
1981లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాటకు 45 ఏళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ ప్రతి గణేష్ చతుర్థి సమయంలో ఈ పాట వినిపిస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటుంది. తరాలు మారినా గణపతి వేడుకల్లో ఈ పాటకు ఆదరణ కొనసాగుతుండటం దీని ప్రత్యేకతను తెలియజేస్తున్నది.
ఇదీ చదవండి: ఒక చేతిలో ‘బ్రహ్మోస్’.. మరో చేతిలో సెమీకండక్టర్ చిప్..


