సాక్షి, విశాఖపట్నం: విశాఖలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని, ప్రజలకు గుక్కెడు నీరు కూడా అందించలేని స్థితి నెలకొందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాటల్లో భారీ ప్రచారం చేసుకుంటోందని, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. విశాఖను గతంలో వైఎస్ జగన్ విశ్వనగరంగా తీర్చిదిద్దితే.. కూటమి పాలకులు వినాశన నగరంగా మార్చారని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు అందడం లేదు. పోలవరం నీళ్లు తీసుకొచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే.. నగరంలో తాగునీటి కోసం ప్రజలు రోడ్లపై ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గ్రావిటీతో నీరు రాకపోయినా, పురుషోత్తపట్నం నుంచి పాత పంపులు, మోటార్లతో నీటిని తరలించి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.
విశాఖలో వందల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే కట్టబెడుతున్నారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. “99 పైసలకు పిల్లాడికి కనీసం చాక్లెట్ వస్తుందా? అలాంటిది వేల కోట్ల విలువైన భూములను ఎలా ఇస్తారు?” అని ప్రశ్నించారు. చంద్రబాబు వాటర్ మ్యాన్ కాదు.. ‘వెన్నుపోటు మ్యాన్’, ‘మోసాల మ్యాన్’ అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖలో నీటి సమస్య మరింత తీవ్రమైందని, నీటి సరఫరాలో కనీస ప్రణాళిక, భవిష్యత్ అవసరాలపై ముందుచూపు కనిపించడం లేదని విమర్శించారు. నీటి సమస్యపై ముందస్తు ప్రణాళిక ఉన్నప్పటికీ అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు. డబ్బులు చెల్లించినా ట్యాంకర్లు సకాలంలో రాని పరిస్థితి ఉందని, విశాఖలో మట్టి మాఫియాను మించి ‘నీటి మాఫియా’ తయారైందని ఆరోపించారు.
పోర్టు కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమైన అధికారులు ‘ఆపరేషన్ లంగ్స్’ పేరుతో చిరు వ్యాపారులు, తోపుడు బండ్లపై ప్రతాపం చూపుతున్నారని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్ కార్మికులను రోడ్డున పడేసి ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని అన్నారు. విశాఖలోని సుమారు 20 లక్షల మంది ప్రజల నీటి అవసరాలను తీర్చలేని పాలకులు మాటల్లో మాత్రం కోటలు దాటుతున్నారని అన్నారు. స్థానిక ఎంపీకి ప్రజల నీటి కష్టాల కంటే బీచ్ షాక్స్, భూములపైనే ఆసక్తి ఉందంటూ విమర్శించారు. నీటి సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించకపోతే విశాఖ ప్రజలతో కలిసి మహా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రెడ్‌బుక్ రాజకీయాలు, కక్ష సాధింపులు పక్కనపెట్టి ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పాలకులకు ప్రజలు తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్


