సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ నాయకులనే టార్గెట్‌గా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే రైతాంగం పడుతున్న ఇబ్బందులు, ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, విశాఖలో తాగునీరు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను పచ్చ మీడియా చూపిస్తే ఆ సంస్థలపై ప్రజలకు గౌరవం పెరుగుతుందని హితవు పలికారు. శనివారం పార్టీ కార్యాలయంలో విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావుతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. మార్గదర్శిలో అవకతవకలపై ఈనాడులో ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. వెల్ఫేర్ సంస్థలో ఉన్న ప్రతి కస్టమర్‌కు న్యాయం జరిగిందని మళ్ల స్పష్టం చేశారు.
ప్రజల పక్షాన పోరాటం ఆగదు
ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ఎల్లో మీడియా వక్రీకరించి ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ నేతలపై వ్యక్తిగతంగా బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్ని తప్పుడు కథనాలు రాసినా ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను తగ్గించలేరని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల కోసం పనిచేయడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌పై కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లలో వ్యక్తిగత విషయాలను భూతద్దంలో చూపిస్తూ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు వైఎస్సార్ సీపీ భయపడేది లేదని స్పష్టం చేశారు. మళ్ల విజయప్రసాద్‌కు పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ పెద్దలందరి మద్దతు ఆయనకు ఉంటుందని తెలిపారు. రేపు నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి సమావేశంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని సమస్యలు, పార్టీ సంస్థాగత అంశాలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు.
కుటుంబాలను మనస్తాపానికి గురిచేయడం తగదు: మళ్ల విజయప్రసాద్
తనపై వస్తున్న నిరాధార వార్తల వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని మళ్ల విజయప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా ఎంతో కష్టపడి వెల్ఫేర్ సంస్థను అభివృద్ధి చేశానని, సంస్థలో ఉన్న ప్రతి కస్టమర్‌కు పూర్తి న్యాయం జరిగిందని స్పష్టం చేశారు. అధికారులు కోరిన సమాచారాన్ని అందించామని, ఈడీ దాడులను అడ్డంపెట్టుకుని తనపై బురద జల్లాలని చూస్తే సహించేది లేదన్నారు. తప్పు చేసేవాడినైతే ఈపాటికి పారిపోయి ఉండేవాడినని, చట్టపరమైన వ్యవస్థలపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. పేపర్లు, ఛానళ్లు ఉన్నాయని ఇష్టానుసారంగా రాస్తే ప్రజలు గమనిస్తున్నారని, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని అన్నారు. మహానేత వైఎస్సార్ ఆశీస్సులతో 2009లో ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో అడుగుపెట్టానని తెలిపారు. గత 20 ఏళ్లుగా స్వార్థం, స్వప్రయోజనం కోసం తాను ఏనాడూ పనిచేయలేదని, తాను చేసిన ప్రతి పని ద్వారా పదిమందికి మేలు కలిగేలా పనిచేశానని మళ్ల విజయప్రసాద్ అన్నారు.


