సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీకి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలే బలమని, మిగతా వారంతా పార్టీలోకి వస్తుంటారు.. పోతుంటారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. భీమిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షతన శనివారం జరిగింది. ప్రభుత్వ తీరుపై వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయ చరిత్రలో చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారుడు ప్రపంచంలోనే ఎవరూ ఉండరని, ఆ మాట స్వయంగా ఆయనకు పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్ చెప్పారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన టీడీపీని ‘వెన్నుపోటు పార్టీ’గా నామకరణం చేసి, ఆ పార్టీ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తల ధైర్యం జగన్ : కురసాల కన్నబాబు మాట్లాడుతూ కార్యకర్తలకు ధైర్యం కల్పించే ఏకై క నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో సోనియా గాంధీ నుంచి చంద్రబాబు వరకు ఎంతో మంది ఒత్తిళ్లు తెచ్చినా ఎక్కడా బెదరలేదని తేల్చిచెప్పారు. 15 ఏళ్ల పార్టీ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని, నాయకులు వస్తుంటారు.. పోతుంటారు కానీ కార్యకర్త ఎప్పటికీ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూ.. పెన్షన్ డబ్బులు ఇస్తే సాయంత్రానికి తాగుతున్నారని చంద్రబాబు అనడం హాస్యాస్పదమని కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తాగుడు పెరగడానికి కారణం చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. జొమాటో, స్విగ్గీలో ఫుడ్ డెలివరీ చేసినట్లుగా రాష్ట్రంలో మద్యం డోర్ డెలివరీ చేస్తున్న ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు. విశాఖలో మూడు రోజులకు ఒకసారి మంచినీళ్లు ఇవ్వలేని అసమర్థతలో ఉంటూ, అధికారులతో సమావేశాలు పెట్టి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులకు ఎలాంటి పనులు చేయొద్దంటూ అక్రమ ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత తమ ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించామని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో అన్ని హామీలు గుప్పించి, ఇప్పుడు ‘ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భీమిలిలో లోకేష్ తోడల్లుడుకు రూ.వేల కోట్ల విలువైన 54 ఎకరాల ప్రభుత్వ భూములను కట్టబెట్టారని ఆరోపించారు. అదేవిధంగా పెట్టుబడుల పేరుతో తన బినామీలకు, బంధువులకు, పేరు ఊరు లేని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎకరా 99 పైసలకే ప్రభుత్వ భూములు కట్టబెట్టారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు తానే కొబ్బరికాయ, గుమ్మడికాయ కొట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు.. మరి దానికి మధ్యలో పనిచేసిందెవరని ప్రశ్నించారు. కేవలం పచ్చి పబ్లిసిటీతోనే ఆ పార్టీ బతుకుతోందని, సమీక్షలు, సాష్టాంగ నమస్కారాలు చేయడం మానేసి ప్రజలకు ఫలితాలు చూపించాలని హితవు పలికారు.
డీఎస్సీపై సీబీఐ విచారణ వేయాల్సిందే: గుడివాడ అమర్‌నాథ్, కేకే రాజు
డీఎస్సీ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ వేసి తీరాల్సిందేనని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, కేకే రాజు డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో కనీసం ఆటలు రాని వారికి కూడా ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. హర్యానాలో సీఎం, ఆయన కుమారుడు ఇదే తరహా అక్రమాలకు పాల్పడితే న్యాయస్థానం జైలు శిక్ష విధించిందని గుర్తుచేశారు. భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పటికి చంద్రబాబు వయస్సు 70 ఏళ్లు దాటుతుందని, ఆయన కుమారుడిని జైలుకు పంపించడం వందశాతం ఖాయమని హెచ్చరించారు.


