ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో పద్మా నదిలో పడవ బోల్తా పడటంతో నదిలో కొట్టుకుపోయిన 10 మంది బంగ్లాదేశీయులను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) రక్షించింది. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. బంగ్లాదేశ్‌లోని చాపైనవాబ్‌గంజ్ జిల్లాకు చెందిన వీరంతా నదిలోని ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయారు. పద్మా నదిలో చిక్కుకున్న వారిని బీఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించి, వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల వద్దకు చేరుకుని వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చేందుకు లాల్గోలా పరిధిలోని తారానగర్ ప్రాంతం నుంచి స్పీడ్‌బోట్‌ను పంపించారు.
బాధితులను రక్షించిన అనంతరం వారిని ప్రాథమిక చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని నిర్ధారించిన తర్వాత, వారిని సురక్షితంగా బంగ్లాదేశ్‌కు తిరిగి పంపే ఏర్పాట్లను బీఎస్ఎఫ్ చేసింది. బంగ్లాదేశ్‌లో గత 24 గంటల్లో పద్మా నది నీటిమట్టం 3 సెంటీమీటర్లు పెరిగింది. హార్డింజ్ బ్రిడ్జి పాయింట్ వద్ద ప్రమాదకర స్థాయికి కేవలం 75 సెంటీమీటర్ల దిగువన నది ప్రవహించింది. పబ్నా వాటర్ డెవలప్‌మెంట్ బోర్డు (పీడబ్ల్యూడీబీ) హైడ్రాలజీ విభాగం ప్రకారం ఉదయం 9 గంటలకు నీటిమట్టం 13.05 మీటర్లుగా నమోదైంది. ప్రమాద స్థాయి 13.80 మీటర్లు కాగా, శుక్రవారం ఇదే సమయానికి 13.02 మీటర్లుగా ఉంది.
ఇదీ చదవండి: ట్రంప్ చిన్ననాటి ఇంటికి భారీ ధర!


