గణపతి ఉత్సవాలకు కార్పొరేట్‌ హంగులు | Corporate Backing Transforms Mumbai's Ganpati Festival | Sakshi
Sakshi News home page

గణపతి ఉత్సవాలకు కార్పొరేట్‌ హంగులు

Sep 12 2026 1:50 PM | Updated on Sep 12 2026 1:55 PM

Corporate Backing Transforms Mumbai's Ganpati Festival

ముంబై: మహానగరం ముంబైలోని ప్రముఖ గణపతి మండపాలకు కార్పొరేట్ సంస్థల సహకారం అంతకంతకు పెరుగుతోంది. ముంబయిలో ప్రసిద్ధి చెందిన లాల్‌బాగ్చా రాజా, చించ్‌పోక్లీచా చింతామణి మండపాలు  ఈ వరుసలో ముందున్నాయి. ఈ ఏడాది చించ్‌పోక్లీచా చింతామణికి అదానీ గ్రూప్ సహకారం అందిస్తున్నది. గత ఏడాది అనంత్ అంబానీ లాల్‌బాగ్చా రాజా మండలిలో అధికారికంగా చేరారు. ప్రముఖ మండపాలతో అనుబంధం ద్వారా కార్పొరేట్‌ కంపెనీలు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి.

లాల్‌బాగ్చా రాజా మండపానికి ఉన్న విస్తృత ప్రజాదరణ, ప్రముఖుల సందర్శనలను తమ ప్రచారానికి అనువుగా కార్పొరేట్‌ కంపెనీలు మలచుకుంటున్నాయి. 
అదానీ గ్రూప్ నుంచి రూ.3.5 కోట్లు పొందిన చింతామణి మండపం మరింత వ్యవస్థీకృత విధానాన్ని అనుసరిస్తోంది. అర కిలోమీటరు పొడవైన ప్రత్యేక ప్రచార ప్రాంతాన్ని ఏర్పాటు చేసి, సొంత మార్కెటింగ్‌ బృందాన్ని నియమించింది. తొలిసారిగా ఎల్‌ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేసింది. ఉత్సవానికి ముందే చింతామణి విగ్రహం ఆగమన్‌కు పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రచారం చేయడంతో భారీగా జనం తరలివచ్చారు.

లాల్‌బాగ్చా రాజా వద్ద సర్దార్‌ హోటల్‌ నుంచి కాలాచౌకీ పోలీస్‌ స్టేషన్‌ వరకు ప్రధాన రహదారులపై బ్రాండింగ్‌ కేంద్రీకృతమైంది. భారీగా భక్తులు వచ్చే ప్రాంతాల్లో స్పాన్సర్ల బ్రాండింగ్‌ను ఏర్పాటు చేశారు. చింతామణి మండపంలో నిర్వాహకులే ప్రచార సందేశాలు, కంటెంట్‌ను నిర్వహిస్తూ భక్తుల భాగస్వామ్యం, స్పాన్సర్లకు కనిపించే స్థాయికి ప్రాధాన్యమిస్తున్నారు. చింతామణితో అనుబంధం తమకు గౌరవప్రదంగా ఉందని అదానీ ప్రతినిధి తెలిపారు. భక్తుల భద్రత, జనసమూహాల నిర్వహణపైనే తమ దృష్టి ఉందని, అదే సమయంలో చింతామణి సంప్రదాయాలను గౌరవిస్తూ, పరిరక్షిస్తున్నామని చెప్పారు.

విగ్రహాల వద్దకు వెళ్లే రహదారులు, సందులు కూడా  ప్రకటనల స్థలాలుగా మారుతున్నాయి. గణేశోత్సవ సమయంలో లక్షలాది భక్తుల కోసం ప్రత్యేక దర్శన మార్గాలు, బ్యారికేడ్లు, ప్రజలకు అందుబాటులో ఉండే మార్గాలకు అనుమతులు తీసుకుంటారు. ఈ మార్గాల్లోని బ్యారికేడ్లు, స్వాగత తోరణాలు, బ్యానర్లు, దిశానిర్దేశక బోర్డులు తదితరాలు స్పాన్సర్‌షిప్‌లో భాగమవుతున్నాయి. క్యూల్లో గంటల తరబడి వేచి ఉండే భక్తులు ప్రకటనదారులకు ఒకే చోట లభించే వినియోగదారులుగా మారుతున్నారని, జనసందోహం పెరిగే కొద్దీ ఈ ప్రాంతాల వాణిజ్య విలువ కూడా పెరుగుతోందని స్పాన్సర్‌షిప్‌తో సంబంధం ఉన్న వ్యక్తి తెలిపారు.

స్పాన్సర్ల ప్రాధాన్యం పెరుగుతుండటంపై ఉత్సవ నిర్వాహకుల్లో చర్చ మొదలైంది. వాణిజ్య భాగస్వామ్యం ఉత్సవ స్వభావాన్ని మార్చడం లేదని, భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించేందుకు పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కొనేందుకు ఇది అవసరమని నిర్వాహకులు చెబుతున్నారు. అయినప్పటికీ సంప్రదాయానికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని, ఆచారాలు, పూజా విధానాలు, ఉత్సవ నిర్ణయాలు సంప్రదాయాలు, విలువల ప్రకారమే కొనసాగుతాయని తెలిపారు.

ఇదీ చదవండి: నీమ్‌ కరోలీ బాబా: ఈ నాలుగు బోధనలతో జీవితం ప్రశాంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement