కుటుంబం మొత్తాన్ని ‘లేపేసి’.. తండ్రికి టీ ఇచ్చి.. | Jaipur Family Murder Father Accused of Killing Wife and Three Daughters | Sakshi
Sakshi News home page

కుటుంబం మొత్తాన్ని ‘లేపేసి’.. తండ్రికి టీ ఇచ్చి..

Sep 12 2026 11:03 AM | Updated on Sep 12 2026 11:03 AM

Jaipur Family Murder Father Accused of Killing Wife and Three Daughters

జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌ కర్ధని ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు కుమార్తెలను రాయితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఇంట్లో నాలుగు మృతదేహాలు కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యల అనంతరం నిందితుడు తన వృద్ధ తండ్రికి టీ ఇచ్చి ఇంటి నుంచి పరారైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

గోవింద్ వాటికలో నలుగురు హత్యకు గురైనట్లు శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని, ఇంటిని పరిశీలించారు. మొదటి అంతస్తులోని ఓ గదిలో రాహుల్ ఝా భార్య గీతా ఝా మృతదేహం కనిపించింది. అనంతరం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని రెండు వేర్వేరు గదుల్లో ముగ్గురు కుమార్తెల మృతదేహాలను గుర్తించారు.

మృతులను 23 ఏళ్ల నందిని, 18 ఏళ్ల రాధిక, 14 ఏళ్ల గౌరీగా గుర్తించారు. నలుగురూ నిద్రిస్తున్న సమయంలో ఘటన జరిగి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అనుమానం వ్యక్తమైంది. రాహుల్ ఝా రాయితో వారిపై దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుల తల, ముఖంపై తీవ్ర గాయాల గుర్తులు కనిపించాయి. ఘటనాస్థలంలో ఓ రాయి లభించగా, దానినే హత్యలకు ఉపయోగించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

హత్యల అనంతరం కూడా రాహుల్‌ సాధారణంగానే వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 7 గంటల సమయంలో పాల వ్యాపారి వద్దకు వెళ్లి పాలు తీసుకున్నాడు. అనంతరం ఇంటికి వచ్చి తన వృద్ధ తండ్రి లక్ష్మీనాథ్‌కు టీ తయారు చేసి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాహుల్‌ షేర్‌ ట్రేడింగ్‌ చేస్తాడని, కొద్ది రోజుల క్రితమే గుజరాత్‌ నుంచి జైపూర్‌కు తిరిగివచ్చాడని పోలీసులు తెలిపారు. గీతా ఝా ఇంటి మొదటి అంతస్తులో బుటిక్‌ నిర్వహిస్తుండగా, నందిని చదువుతోపాటు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నది.

ఘటనకు మూడు రోజుల ముందు రాహుల్‌ పొరుగున నివసించే ఓ మహిళ వద్ద రూ.25 వేలు అప్పుగా తీసుకున్నట్లు పోలీసులకు సమాచారం లభించింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ వివాదాలు, షేర్‌ ట్రేడింగ్‌లో నష్టం తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్యలకు అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. నిందితుడు రాహుల్‌ ఝా కోసం జైపూర్‌ పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం హతమైన మహిళ తిరిగి రావడంతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement