క్విక్‌ కామర్స్‌ సంస్థలపై దాడులు.. సంచలన విషయాలు? | jaipur food safety team finds expired food storage violations | Sakshi
Sakshi News home page

క్విక్‌ కామర్స్‌ సంస్థలపై దాడులు.. సంచలన విషయాలు?

Sep 11 2026 8:06 AM | Updated on Sep 11 2026 8:24 AM

jaipur food safety team finds expired food storage violations

జైపూర్‌: రాజస్థాన్‌లోని క్విక్‌ కామర్స్‌ సంస్థలపై ఆహరభద్రత అధికారులు చేసిన తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ ఈ క్విక్-కామర్స్ సంస్థలైన బ్లింకిట్‌, జెప్టో సంస్థలు నిర్వహిస్తున్న డార్క్ స్టోర్లపై ఆహార భద్రత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, దెబ్బతిన్న ఉత్పత్తులు, సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయని పాల ఉత్పత్తులు పెద్ద మొత్తంలో గుర్తించారు. దీంతో వాటిని సీజ్‌ చేసి తనిఖీల నిమిత్తం ‍ల్యాబ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.  

జగత్‌పురాలోని Zepto డార్క్ స్టోర్లో సుమారు 1,550 పాల ఉత్పత్తుల ప్యాకెట్లు సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం లేదని అధికారులు గుర్తించారు. పాలు, పెరుగు, మజ్జిగ వంటి డెయిరీ ఉత్పత్తులను నిర్దేశిత తక్కువ ఉష్ణోగ్రతల్లోనే ఉంచాలి. అయితే అక్కడి రిఫ్రిజరేషన్ యూనిట్లలో ఉష్ణోగ్రత 6 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. దీంతో అక్కడ నిల్వ ఉంచిన సుమారు 1,550 ప్యాకెట్లను అధికారులు ధ్వంసం చేసినట్లు తెలిపారు.అదే స్టోర్‌లో  గడువు ముగిసిన సుమారు 7 కిలోల ఆహార పదార్థాలు కూడా బయటపడ్డాయని వాటిని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.

అనంతరం జైపూర్‌లోని ఆదర్శ్ నగర్‌లో ఉన్న Blinkit డార్క్ స్టోర్ను తనిఖీ చేశారు. అక్కడ సుమారు 800 పాల ఉత్పత్తుల ప్యాకెట్లతో పాటు మరికొన్ని గడువు ముగిసిన  దెబ్బతిన్న ఆహార పదార్థాలు సైతం గణనీయమైన పరిమాణంలో ఉన్నట్లు గుర్తించారు. అవన్నీ అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అంతేకాకుండా పాలు, ఫుడ్-గ్రేడ్ నెయ్యి, Paper Boat కార్బొనేటెడ్ వాటర్ నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల నివేదికల ద్వారా ఆ ఉత్పత్తుల నాణ్యతపై మరింత స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.

ఈ తనిఖీలపై ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అవిచల్ చతుర్వేది మాట్లాడుతూ, ఆహార పదార్థాల నిల్వలో నిర్దేశిత ఉష్ణోగ్రతలు, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. గడువు ముగిసిన, పాడైన ఉత్పత్తులను వెంటనే తొలగించి ధ్వంసం చేయాలని సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే డార్క్ స్టోర్లలో పరిశుభ్రత, కోల్డ్-చైన్ నిర్వహణ, ఆహార నిల్వ విధానాల్లో ఉన్న లోపాలను వెంటనే సరిచేయాలని అధికారుల బృందం సూచించింది.

మొత్తంగా, జైపూర్‌లో జరిగిన ఈ తనిఖీల్లో సుమారు 2,350 డెయిరీ ఉత్పత్తుల ప్యాకెట్లను, అలాగే గడువు ముగిసిన మరియు దెబ్బతిన్న ఇతర ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. ముఖ్యంగా పాల ఉత్పత్తులను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం, గడువు ముగిసిన వస్తువులు స్టోర్లలో ఉండటం, పరిశుభ్రత లోపాలు వంటి అంశాలను అధికారులు తీవ్రంగా పరిగణించారు. సేకరించిన నమూనాల ప్రయోగశాల పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉందని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement