అమెరికాకు చెందిన ఎఫ్‌ఏఎస్ నివేదిక వెల్లడి
వాషింగ్టన్: భారత్ వద్ద 190 వరకు అణ్వాయుధాలు ఉండొచ్చంటూ అమెరికాకు చెందిన ఓ సంస్థ అంచనా వేసింది. ది ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్(ఎఫ్‌ఏఎస్)అనే లాభాపేక్షలేని ఓ సంస్థ ఇందుకు సంబంధించిన ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వం బహిర్గతం చేసిన గణాంకాలు, ఇతర వర్గాల నుంచి సేకరించిన సమాచారం, వాణిజ్య ఉపగ్రహాల చిత్రాల ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు వివరించింది.
‘భారత్ వద్ద ఉన్న అణు సామర్థ్య ప్రయోగ వాహనాల అమరిక, వ్యూహాలకు సంబంధించిన బహిరంగ సమాచారం ఆధారంగా ప్రస్తుతం ఉత్పత్తి దశలో ఉన్న కొత్త క్షిపణుల కోసం ఉద్దేశించిన 30 అదనపు వార్‌హెడ్లు సహా సుమారు 190 అణు వార్‌హెడ్‌లను తయారు చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. ఇందులో వాడకంలో ఉన్న ప్రయోగ వేదికల కోసం 160కి పైగా వార్‌హెడ్‌లు కూడా ఉన్నాయి’అని ’ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్ –2026’ పేరుతో ఎఫ్‌ఏఎస్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్స్ క్రిస్టెన్సన్ ఆ నివేదికలో పేర్కొన్నారు.‘భారత్ తన అణ్వాయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటోంది.
ఇటీవలి కాలంలో అనేక కొత్త ఆయుధ వ్యవస్థలను సైతం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అణు సామర్థ్యం కలిగిన యుద్ధ విమానాలు, భూమి, గగనతలం నుంచి ప్రయోగించే వ్యవస్థలను బలోపేతం చేసుకుంటోంది. పాత వాటి స్థానంలో కొత్తవి తీసుకువస్తోంది. ఇంకొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి’అని క్రిస్టెన్సన్ తెలిపారు. భారత్ 140 నుంచి 225 అణ్వాయుధాలకు సరిపడా సైనిక అవసరాల ప్లుటోనియంను సిద్ధం చేసుకుని ఉండొచ్చని కూడా ఆయన నివేదికలో పేర్కొన్నారు.
ఈ నిల్వలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. అయితే, 1998లో పొఖ్రాన్–2 ఆపరేషన్‌లో భాగంగా అణు పరీక్షలు చేపట్టిన భారత్..శత్రువుపై ముందుగా అణ్వాయుధాన్ని ప్రయోగించరాదనే విధానాన్ని ప్రకటించడంతోపాటు అందుకు కట్టుబడి ఉందని గుర్తు చేశారు. 2026 ఆరంభం నాటికి భారత్ వద్ద 730 కిలోల (సుమారు 170 కిలోలు అటూఇటుగా) అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే ప్లుటోనియం నిల్వలున్నట్లు ’ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ ఫిజైల్ మెటీరియల్స్’ అంచనా వేసినట్లు కూడా క్రిస్టెన్సన్ ఉటంకించారు.


