అమెరికా ఓటర్లకు డొనాల్డ్ ట్రంప్ ఆఫర్
ఫినిక్స్: అమెరికా ఓటర్లకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. త్వరలో జరిగే మధ్యంతర ఎన్నికల్లో తమ పార్టీకి విజయం లభించి, ప్రతినిధుల సభ, సెనేట్‌పై రిపబ్లికన్ల నియంత్రణ కొనసాగితే ప్రతి ఒక్కరికీ 5,000 డాలర్ల చొప్పున అందజేస్తానని ప్రకటించారు. ట్రంప్ పార్టీకి ప్రజాదరణ నానాటికీ పడిపోతున్నట్లు సర్వేలు తేల్చిచెబుతున్న ఆయన ఈ ఆఫర్ ఇవ్వడం గమనార్హం. బుధవారం డల్లాస్‌లో రిపబ్లికన్ పార్టీ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు.
‘‘రిపబ్లికన్లు గెలిస్తే మీరు కూడా మాతో కలిసి గెలుస్తారు. మీకు 5,000 డాలర్లు లభిస్తాయి. దీనిని ట్రంప్ డివిడెండ్ అని పిలుస్తారు’’అని పేర్కొన్నారు. ఈ చెల్లింపులను ఒక సంస్థ తన వాటాదారులకు చేసే పంపిణీలతో పోల్చారు. అమెరికా ఆర్థికంగా బలంగా ఉందని చెప్పుకొచ్చారు. నిజంగా ట్రంప్ వాగ్దానం నెరవేరాలంటే ఒక ట్రిలియన్ డాలర్లకుపైగా ఖర్చవుతుంది. దీనికి కాంగ్రెస్ ఆమోదం కూడా అవసరం. అంతేకాకుండా వార్షిక బడ్జెట్ లోటును మరింత తీవ్రతరం చేస్తుంది.
ద్రవ్యోల్బణం పెరిగిపోయే ప్రమాదం ఉంది. అమెరికా సర్కార్ ఇప్పటికే అప్పుల్లో మునిగిపోయింది. దాదాపు 1.8 ట్రిలియన్ డాలర్ల వార్షిక బడ్జెట్ లోటు ఉంది. ట్రంప్ తాజా ప్రకటనపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గంట వ్యవధిలోనే స్పందించారు. ఈ డివిడెండ్ చెల్లింపులు సంపన్నులకు అందవని తేల్చిచెప్పారు. వయోజనులకు ఇస్తామంటున్న 5,000 డాలర్లకు అవసరమైన నిధులను సుంకాల ద్వారా వచ్చే ఆదాయంతో సమకూర్చుకోవచ్చని పేర్కొన్నారు.
‘ఒబామాకేర్’లబ్దిదారులకు 500 డాలర్ల రిబేట్ చెక్కులు
వాషింగ్టన్: అమెరికాలో 30 రాష్ట్రాల్లోని 10 లక్షల మంది ‘ఒబామాకేర్’లబ్దిదారులకు 500 డాలర్ల రిబేట్ చెక్కులు ఇస్తామని అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారు. బైడెన్ ప్రభుత్వ హయాంలో ఒబామాకేర్ కింద ప్రజల నుంచి ప్రీమియం అధికంగా వసూలు చేశారని ఆక్షేపించారు. ప్రతి ఒక్కరికీ డబ్బు వాపసు ఇవ్వడంతో ఉపశమనం లభిస్తుందని అన్నారు. కొద్ది వారాల్లోనే రాయితీలు అందజేయనున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ట్రంప్ చేసిన ప్రసంగాన్ని గురువారం వైట్‌హౌస్ ‘ఎక్స్’õÙర్ చేసింది. మరోవైపు ఈ రిబేట్‌ల కోసం నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అలాగే వాటి పంపిణీకి కాంగ్రెస్ ఆమోదం అవసరమా కాదా అనేది ఇంకా తెలియరాలేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య బీమా రుసుములు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రీమియంలు రెట్టింపు లేదా మూడు రెట్లు పెరిగాయి. దీంతో లక్షలాది మంది తమ ప్లాన్‌లను తగ్గించుకోవడానికి లేదా ఈ కార్యక్రమం నుంచి పూర్తిగా వైదొలగడానికి మొగ్గుచూపారు.


