ఢిల్లీలో 2 రోజుల శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు పూర్తి
జిన్‌పింగ్, పుతిన్, పెజెష్కియాన్, రమఫోసా హాజరు
న్యూఢిల్లీ: భారత్ అతిథ్యం ఇవ్వనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. శనివారం, ఆదివారం జరిగే ఈ సదస్సుకు చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో తదితరులు హాజరు కాబోతున్నారు.
షీ జిన్‌పింగ్ భారత్‌లో అడుగుపెడుతుండడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా పె రుగుతున్న ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, రష్యా–ఉక్రెయిన్ ఘర్షణ, పశ్చిమాసియా సంక్షోభం, అమెరికా విధిస్తున్న సుంకాల ప్రతికూల ప్రభావాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న నేపథ్యంలో రెండు రోజుల బ్రిక్స్ సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలపై కూటమి సదస్సులో చర్చించబోతున్నారు.
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమిలో 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా ఇందులో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం కూడా భాగస్వామ్య దేశాలుగా మారాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో సుమారు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతి నిధ్యం వహిస్తోంది. 11 ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో బలమైన కూటమిగా ఆవిర్భవించింది.
భారత్ బ్రిక్స్‌లో వ్యవస్థాపక సభ్య దేశం. 2012, 2016, 2021లో కూటమికి సారథ్యం వహించింది. ఇప్పుడు నాలుగోసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. ఈసారి ‘సమ్మిళిత ప్రపంచ పాలన, బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడం’అనే ఇతివృత్తంతో బ్రిక్స్ సదస్సు శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 7.30 గంటలకు ప్రధాని మోదీ ఏర్పాటు చేసే విందుతో మొదటి రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. రెండో రోజు ఆదివారం పలు సమావేశాలు, చర్చలు జరుగుతాయి. ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’విడుదలతో సదస్సు ముగుస్తుంది.
నేడే పుతిన్ రాక
రష్యా అధినేత పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున భారత్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఆయన మూడు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారని రష్యా ప్రతినిధి యురీ ఉషకోవ్ తెలిపారు. శుక్రవారం వార్షిక బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ సర్వసభ్య సమావేశంలో పుతిన్ ప్రసంగించనున్నారు. మరోవైపు మధ్యాహ్నం 3.30 గంటలకు పుతిన్‌తో, సాయంత్రం 6.15 గంటలకు మసూద్ పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ అవుతారు.
జిన్‌పింగ్, మోదీ ప్రత్యేక భేటీ!
ఢిల్లీలో జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు షీ జిన్‌పింగ్ హాజరు కాబోతున్నారని చైనా ప్రభుత్వ మీడియాతోపాటు భారత విదేశాంగ శాఖ గురువారం నిర్ధారించింది. సదస్సు సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటలకు జిన్‌పింగ్, నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతారని సమాచారం. జిన్‌పింగ్ భారత పర్యటన ఒక ఉన్నత స్థాయి దౌత్య కార్యక్రమంగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. రెండు ఆసియా అగ్రరాజ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించడానికి జరుగుతున్న ప్రయత్నంగా పేర్కొంటున్నారు. జిన్‌పింగ్ చివరిసారిగా 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు.
బ్రిక్స్‌కు అంతా సిద్ధం: మోదీ
బ్రిక్స్–2026 శిఖరాగ్ర సదస్సుకు అంతా సిద్ధం అంటూ ప్రధాని మోదీ గురువారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సదస్సు జరిగే ‘భారత్ మండపం’దృశ్యాలు, ఏర్పాట్లతో కూడిన 30 సెకండ్ల వీడియో క్లిప్‌ను సైతం షేర్ చేశారు.


