చమురు ధరలు భగ్గుమంటున్నాయ్‌.. ప్రపంచానికి కొత్త ముప్పు! | Middle East War Crude Oil Prices Global Economy Inflation | Sakshi
Sakshi News home page

చమురు ధరలు భగ్గుమంటున్నాయ్‌.. ప్రపంచానికి కొత్త ముప్పు!

Sep 11 2026 12:52 AM | Updated on Sep 11 2026 12:52 AM

Middle East War Crude Oil Prices Global Economy Inflation

ధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ముఖ్యంగా చమురు, సహజవాయువు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 105 డాలర్లకు చేరింది. ఈ పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా-ఇరాన్‌ మధ్య ఘర్షణలు ఈ మధ్య మరింత తీవ్రం కావడంతో ఈ ప్రభావం చమురు సరఫరాలపై పడుతోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్‌ జలసంధి దాదాపుగా మూసుకుపోవడంతో గల్ఫ్‌ దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు చమురు, గ్యాస్‌ సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో భవిష్యత్తులో ఇంధన కొరత ఏర్పడవచ్చన్న భయాలు పెరుగుతున్నాయి.

అయితే, మరోవైపు సహజవాయువు ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. యూరప్‌లో ఈ ఏడాది ఇదే సమయానికి సాధారణంగా ఉండే స్థాయికంటే గ్యాస్‌ నిల్వలు తక్కువగా ఉన్నాయి. చలికాలం కోసం నిల్వలను పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో గ్యాస్‌కు డిమాండ్‌ పెరిగి ధరలు మరింత ఎక్కువవుతున్నాయి. అలాగే, బ్రిటన్‌లో గ్యాస్‌ ధరలు 2022 తర్వాత తొలిసారిగా ఒక థర్మ్‌కు 200 పెన్స్‌ దాటాయి.

ఇలా ఇంధన ధరలు పెరగడంతో ప్రజలపై కూడా వాటి ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే, బ్రిటన్‌లో స్వల్పకాలిక గ్యాస్‌ ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ధరల పరిమితి కొంత రక్షణ కల్పిస్తున్నప్పటికీ.. ధరలు ఎక్కువ కాలం కొనసాగితే విద్యుత్‌, గ్యాస్‌ బిల్లులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అక్టోబర్‌ నుంచి అక్కడ ఇంధన ధరల పరిమితి 3.6 శాతం పెరగనుంది.

చమురు, గ్యాస్‌ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మళ్లీ వేగం పుంజుకుంటుందన్న ఆందోళనలు కూడా పెరిగాయి. దీనికి తోడు అమెరికా, బ్రిటన్‌లో ప్రభుత్వాలు తీసుకునే దీర్ఘకాలిక రుణాలపై వడ్డీ రేట్లు కూడా గణనీయంగా పెరిగాయి. బ్రిటన్‌లో పదేళ్ల ప్రభుత్వ బాండ్లపై రాబడి 2007 తర్వాత అత్యధిక స్థాయికి చేరింది. దీంతో ప్రభుత్వ రుణభారం పెరగడంతో పాటు.. గృహ రుణాలు వంటి కొన్ని ఆర్థిక ఉత్పత్తులపై ప్రజలు చెల్లించే వడ్డీ కూడా పెరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న హౌతీ దళాలు యెమెన్‌లోని కీలకమైన మోఖా పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు రావడం ఆందోళనకు మరింత కారణమైంది. ఈ పరిణామంతో సముద్ర మార్గాల్లో చమురు, ఇతర సరుకుల రవాణాకు మరిన్ని అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. యుద్ధ పరిస్థితులు త్వరగా ముగియకపోతే ఇంధన ధరల పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: ఖరీదైన విడాకులు.. మాజీ భార్యకు రూ.18 వేలకోట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement