పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.హర్ముజ్ జలసంధి ప్రవేశద్వారం వద్ద అమెరికాకు చెందిన అత్యాధునిక మానవరహిత జలాంతర్గామిని పట్టుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో అమెరికా దళాలు ఐదు ఇరానియన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) అధికారిక మీడియా ‘సెపాహ్ న్యూస్’ ప్రకారం.. సంక్లిష్టమైన నిఘా ఆపరేషన్‌లో అమెరికాకు చెందిన డైవ్ ఎల్‌డీ(Dive-LD) మానవరహిత అండర్‌వాటర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక అండర్‌వాటర్ టెక్నాలజీ కలిగిన వాహనంగా దీన్ని ఇరాన్ అభివర్ణించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. మరోవైపుహర్ముజ్ జలసంధిపై ఓ అమెరికా డ్రోన్( MQ-9 Reaper)ను కూల్చివేసినట్లు కూడా ఐఆర్‌జీసీ ప్రకటించింది.
అమెరికా రియాక్షన్ ఇదే
ఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించింది. తమ మానవరహిత అండర్‌వాటర్ వాహనం ఒకటి అంతకుముందు రోజు పనిచేయకుండా నిలిచిపోయిందని అమెరికా సైన్యం తెలిపింది. అయితే ఇరాన్ స్వాధీనం చేసుకున్నది అదే వాహనమా అనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఆ వాహనం పాత మోడల్ అని.. అందులో సున్నితమైన సమాచారం, రహస్య సోనార్ లేదంటే రాడార్ పరికరాలు లేవని పెంటగాన్ వెల్లడించింది.

ఐదు చమురు ట్యాంకర్లపై అమెరికా దాడి
ఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. తమ యుద్ధనౌకపై ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా ఐదు ఇరానియన్ ముడిచమురు ట్యాంకర్లను ధ్వంసం చేశారు. గత రెండు రోజుల్లో అమెరికా నౌకపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో రెండుసార్లు దాడికి ప్రయత్నించిందని సెంట్‌కామ్ పేర్కొంది.
ఇరాన్ విమానయాన సంస్థలపై ఆంక్షలు
మరోవైపు అమెరికా ఆర్థిక శాఖ ఇరాన్‌కు చెందిన మరో 27 విమానయాన సంస్థలను ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చింది. ఇరాన్ పాలనకు, ఐఆర్‌జీసీకి ఆయుధాల రవాణా, సిబ్బంది తరలింపులో వాణిజ్య విమానయాన సంస్థలు సహకరిస్తున్నాయని అమెరికా ఆరోపించింది.
‘వాళ్లు పశ్చాత్తాపపడే వరకు..’
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాత్రం.. యుద్ధంలో విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ఇరాన్ ఎప్పుడూ కోరుకోలేదని.. అయితే దాడులను ఎదుర్కొనేందుకు తమ ప్రతిఘటన కొనసాగుతుందని తెలిపారు. ఆక్రమణదారులు పూర్తిగా పశ్చాత్తాపపడే వరకు బలంగా పోరాడతామని పేర్కొన్నారు.
మళ్లీ ముదిరిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధానికి ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది. అనంతరంహర్ముజ్ జలసంధిపై తన పట్టును మరింత బిగించింది. జూన్ 18న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ.. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి.
ఇదీ చదవండి: ఇరాన్‌కు దిమ్మతిరిగే షాక్.. భారీ దెబ్బకొట్టిన అమెరికా


