కంగనా సీరియస్‌.. కేంద్రాన్ని అడుక్కోవాలా అంటూ.. | MP Kangana Ranaut Slams Officials At DISHA Meet, Questions Dependence On Centre For Funds, Watch Video Inside | Sakshi
Sakshi News home page

కంగనా సీరియస్‌.. కేంద్రాన్ని అడుక్కోవాలా అంటూ..

Sep 9 2026 8:01 AM | Updated on Sep 9 2026 9:39 AM

MP Kangana Ranaut Serious On Himachal officials Generate revenue

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. కేంద్రం దగ్గరికి వెళ్లి డబ్బులు అడుక్కునే పరిస్థితి ఎందుకు? అంటూ అధికారుల తీరుపై కంగనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండి నియోజకవర్గంలో జరిగిన దిశ (DISHA) సమావేశంలో అధికారులపై నేరుగా ఆగ్రహం వ్యక్తం చేసిన కంగనా.. ‘చేతులు ముడుచుకుని కూర్చుంటే పనులు జరగవు.. మీరే ముందడుగు వేయాలి’ అంటూ క్లాస్‌ పీకారు. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే మార్గాలపై దృష్టి పెట్టాలని, ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి అభివృద్ధి విధానాలను నేర్చుకోవాలని అధికారులకు గట్టిగా సూచించారు.

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (DISHA) సమావేశంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంగనా.. అభివృద్ధి కోసం కేంద్రం వైపు రూ.1,000 కోట్లు అడుక్కునే పరిస్థితి కాకుండా.. రాష్ట్రంలోనే ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. చేతులు ముడుచుకుని కూర్చుంటే పనులు జరగవు. ప్రభుత్వం మీ వద్దకు రాకపోతే.. మీరే వెళ్లండి. ఏం అడ్డుకుంటోంది? ఇతర రాష్ట్రాల్లో అధికారులు ఏం చేస్తున్నారో వెళ్లి నేర్చుకోండి అంటూ అధికారులకు ఆమె సూచించారు.

ముఖ్యంగా ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’ (ODOP) కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆమె కోరారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రతిభకు కొదవ లేదని, అయితే దాన్ని ఆదాయ మార్గాలుగా మలచడంలో అధికారులు మరింత చొరవ చూపాలని అన్నారు. ఇతర రాష్ట్రాలు తమ ఆర్థిక వ్యవస్థలను గణనీయంగా అభివృద్ధి చేసుకున్నాయి. మన దగ్గర మాత్రం రెవెన్యూ జనరేషన్ తక్కువగా ఉంది. ఆ తర్వాత కేంద్రం దగ్గరకు వెళ్లి డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాం. మనం కూడా ఆదాయం సృష్టించాలి అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ నేతలపై ఫైర్‌..
అనంతరం, DISHA సమావేశం సుమారు మూడున్నర నుంచి నాలుగు గంటల పాటు సాగిందని, అన్ని శాఖల పనితీరుపై సమగ్రంగా చర్చించినట్లు ఆమె తెలిపారు. కొన్ని శాఖల్లో జాప్యం, నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోందని ఆరోపించారు. అలాగే, కాంగ్రెస్‌ నేతృత్వంలోని హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వంపైనా కంగనా విమర్శలు గుప్పించారు. కేంద్ర నిధులతో చేపట్టిన ప్రాజెక్టులకు కూడా కాంగ్రెస్‌ నేతలు క్రెడిట్‌ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మండి ప్రాంతంలోని భూభూ జోత్‌ టన్నెల్‌, ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన (PMGSY) కింద చేపట్టిన పనులు తమ ప్రభుత్వం తీసుకొచ్చినవేనని ఆమె పేర్కొన్నారు. అధికారుల పనితీరులో మార్పు రాకపోతే వారి పేర్లతో కేంద్రానికి అధికారిక నివేదిక పంపిస్తానని కంగనా హెచ్చరించారు. కొన్ని శాఖల్లో పురోగతి కనిపించకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అంతేకాదు, రూ.75 కోట్ల విలువైన 11 రహదారి ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. PMGSY పనులకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు, భూమిపూజలు చేస్తూ తమ పేర్లతో ఫలకాలు ఏర్పాటు చేసుకుంటున్నారని కూడా విమర్శించారు. ఇటీవల కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నాశనం చేసిందని’ కంగనా ఆరోపించిన విషయం తెలిసిందే. కేంద్ర పథకాలను సక్రమంగా అమలు చేయడంలో ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయం కొరవడిందని ఆమె విమర్శించారు.

ఇదీ చదవండి: ఆ ధోరణి ఇంకెప్పుడు మారుతుందో?: కంగనా కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement