రెండోరోజూ అదే వే'ఢీ' | Assembly Monsoon Session War of words between BRS, Congress | Sakshi
Sakshi News home page

రెండోరోజూ అదే వే'ఢీ'

Sep 9 2026 1:39 AM | Updated on Sep 9 2026 1:39 AM

Assembly Monsoon Session War of words between BRS, Congress

ఢీ అంటే ఢీ అన్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌

అటు అసెంబ్లీలో, ఇటు బయట పోటాపోటీ వ్యూహాలు 

రాజకీయ ఆధిపత్యం కోసం రెండు పార్టీల ప్రయత్నాలు 

రాష్ట్ర మంత్రులు, అసెంబ్లీ కార్యదర్శితో పలుమార్లు భేటీ అయిన ముఖ్యమంత్రి 

తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై చర్యల విషయంలో మంత్రాంగం.. సస్పెన్షన్‌ తీర్మానంపై చర్చ 

అసెంబ్లీలో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్,  హరీశ్‌రావు మధ్య మాటల యుద్ధం 

స్పీకర్‌కు సీఎం రేవంత్,డిప్యూటీ సీఎం భట్టి పరామర్శ 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కేసీఆర్‌ నివాసం ముట్టడి కార్యక్రమంతో ఉద్రిక్తత 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కేటీఆర్, హరీశ్‌ భేటీ..ఎమ్మెల్సీల సస్పెన్షన్‌ నేపథ్యంలో నిరసనల హోరు 

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో రాజుకున్న మరో వివాదం

సాక్షి, హైదరాబాద్‌: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీల ఢీ అంటే ఢీ రెండోరోజూ కొనసాగింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల మొదటిరోజు సోమవారం బీఆర్‌ఎస్‌ నేతలు నల్ల టీ షర్టులు ధరించి రావడం, వారు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం, ‘అనుచిత వ్యాఖ్యల వ్యవహారంతో’పరిస్థితి ఉద్రిక్తంగా మారడం తెలిసిందే. కాగా మంగళవారం కూడా అదే వాతావరణంలో ఉభయ సభలు జరిగాయి. ఈ అంశంపై రాజకీయ ఆధిపత్యం సాధించేందుకు రెండు పార్టీలు పోటీలు పడి వ్యూహాలు రచించాయి. ఇక అసెంబ్లీ బయట కూడా ఇదే తీరు కొనసాగించాయి. అసెంబ్లీలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ టి.హరీశ్‌రావుల మధ్య మాటల యుద్ధం సాగగా, కాంగ్రెస్‌ చేపట్టిన ఎర్రవల్లిలోని కేసీఆర్‌ నివాసం ముట్టడి కార్యక్రమం, కేసీఆర్‌ను ఉద్దేశించి ఆ పార్టీ షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ చేసిన వ్యాఖ్యలు తాజా ఉద్రిక్తతకు, వివాదానికి దారి తీశాయి. మరోవైపు మహిళా పోలీసులపై బీఆర్‌ఎస్‌ సభ్యుల దురుసు ప్రవర్తనపై కాంగ్రెస్‌ మహిళా ఎమ్మెల్యేలు తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇక అసెంబ్లీ లాబీల్లోనూ ఇదే అంశం నడిచింది.  
ఎమ్మెల్యేలతో మంతనాలు 
ఉదయం అసెంబ్లీకి రాగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి స్పీకర్‌ చాంబర్‌కు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ప్రభుత్వం పక్షాన అండగా ఉంటామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఓదార్చారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి తన చాంబర్‌లో రాష్ట్ర మంత్రులతో పలు దఫాలు సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిల విషయంలో అసెంబ్లీ వేదికగా ఏం చేయాలన్న దానిపై అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతితో చర్చించారు. ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టే తీర్మానం ఎలా ఉండాలి? భవిష్యత్తులో న్యాయ వివాదాలు రాకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయాలపై మాట్లాడిన సీఎం.. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిని కోరుతూ శాసనసభలో మంత్రి దామోదర రాజనర్సింహతో తీర్మానం ప్రతిపాదింపజేసి, ఆమోదింపజేయాలని నిర్ణయించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు కూడా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించారు. కాంగ్రెస్‌ ముట్టడి కార్యక్రమాన్ని ధీటుగా ఎదుర్కోవాలని, ఎమ్మెల్సీలు మాత్రం సభలోనే ఉండాలని నిర్ణయించారు. తాతా మధు, నవీన్‌రెడ్డిల సస్పెన్షన్‌ నేపథ్యంలో నిరసనలు, ధర్నాతో బీఆర్‌ఎస్‌ నేతలు వాతావరణాన్ని మరింత వేడెక్కించారు. 

‘అనుచిత వ్యాఖ్యలపై’చర్చ..సస్పెన్షన్‌ తీర్మానం 
మంగళవారం మధ్యాహ్నం సభ ప్రారంభమైన తర్వాత ప్యానెల్‌ స్పీకర్‌ స్థానంలోకి వచ్చిన కడియం శ్రీహరి సోమవారం నాటి అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై చర్చను ప్రారంభించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రారంభించగా, పలువురు మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడారు. ఆ తర్వాత మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలపై చర్యకు విజ్ఞప్తి తీర్మానం ప్రవేశపెట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడిన తర్వాత ఈ తీర్మానాన్ని సభ ఆమోదించి శాసనమండలికి పంపింది.  

స్పీకర్‌ మనస్తాపం.. 
తాతా మధు ఎపిసోడ్‌లో కాంగ్రెస్‌ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నించింది. అసెంబ్లీలో మాట్లాడిన హరీశ్‌రావు వీలున్నంత వరకు తమ పార్టీ ఎమ్మెల్సీలకు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగానే స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ కొంత ఆవేశానికి లోనయ్యారు. హరీశ్‌రావును ఉద్దేశించి ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ సభ్యుల వైఖరి, హరీశ్‌రావు వ్యాఖ్యలకు స్పీకర్‌ మనస్తాపం చెందారు. ఉదయం సభను కొంతసేపు వాయిదా వేసిన అనంతరం చాలాసేపు ఆయన తన చాంబర్‌లోనే ఉన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు అసెంబ్లీ కార్యదర్శితో మాట్లాడారు. విలేకరులతో ఇష్టాగోష్టిలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ తర్వాత సభ లోపలికి వెళ్లిన ఆయన మనస్తాపం కారణంగా కొద్దిసేపు మాత్రమే సభా కార్యకలాపాలు నిర్వహించి, ప్యానల్‌ స్పీకర్‌ కడియం శ్రీహరికి సభాధ్యక్షత బాధ్యతను అప్పగించి వెళ్లిపోయారు. 
 
మహిళా కమిషన్‌కు ఫిర్యాదు 
సోమవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తీరుపై..కాంగ్రెస్‌ మహిళా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు మంగళవారం రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు ఉత్తమ్‌ పద్మావతి, మట్టా రాగమయి, పరి్ణకారెడ్డి, యశస్వినిరెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మహిళా నేతలు కల్వ సుజాత, గుండు సుధారాణి, ఇందిరా శోభన్‌లు మహిళా కమిషన్‌ను కలిశారు. మహిళా పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించారని, వారి ముందే అర్ధనగ్న ప్రదర్శన చేశారని, అనుచితంగా వ్యవహరించారంటూ కమిషన్‌ కార్యదర్శి, సభ్యులకు ఫిర్యాదును అందజేశారు.  

తగ్గని బీఆర్‌ఎస్‌ 
– అసెంబ్లీ లోపలా, బయటా ఆందోళనలు 
– నల్ల బ్యాడ్జీలతో సమావేశాలకు హాజరు 
– కాంగ్రెస్‌ చేపట్టిన కేసీఆర్‌ ఎర్రవల్లి నివాసం ముట్టడి కార్యక్రమంపై మండిపాటు 
– తాతా మధు, నవీన్‌రెడ్డి సస్పెన్షన్‌పై నిరసన, ధర్నా 

ప్రదాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ లోపలా, బయట అధికార కాంగ్రెస్‌ పార్టీపై యుద్ధం కొనసాగించింది. మంగళవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల బ్యాడ్జీలు ధరించి సమావేశాలకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో స్పీకర్‌ సభకు విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో శాసనసభ లాబీల్లోని బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష కార్యాలయంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్లు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. సభ లోపలా బయటా కాంగ్రెస్‌ అనుసరిస్తున్న ఎత్తుగడలపై చర్చించారు. ఎర్రవల్లిలో పార్టీ అధినేత కేసీఆర్‌ ఇంటి ముట్టడికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్తున్నట్లు అందిన సమాచారంపై చర్చించారు. వారికి పోలీసులు సహకరిస్తున్నారని తెలియడంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా ఎర్రవల్లికి వెళ్లాలని నిర్ణయించారు. అయితే పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌ రెడ్డిని సస్పెండ్‌ చేస్తారనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్సీలు మాత్రం సభలోనే ఉండాలని నిర్ణయించారు. 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య తోపులాట 
ఎర్రవల్లిలో కేసీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. అయితే రాజీవ్‌ రహదారి మీదుగా ఎర్రవల్లికి వెళ్లే క్రమంలో నగర శివారులోని బొల్లారం, హకీంపేట వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై నిరసన తెలుపుతూ తమ వాహనాల నుంచి దిగిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాలి నడకన ఎర్రవల్లికి బయలుదేరారు. అయితే హరీశ్‌రావుతో పాటు కొందరు ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకుని జవహర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపిన కేటీఆర్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలను బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేల అరెస్టు వార్తను తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున జవహర్‌నగర్, బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్లకు చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. బోయినపల్లి పోలీసు స్టేషన్‌ వద్ద బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ శ్రేణులు పరస్పరం తోపులాటకు, దాడికి దిగాయి. సాయంత్రం ఐదు గంటల వరకు నేతలను పోలీసు స్టేషన్‌లోనే నిర్బంధించిన పోలీసులు ఆ తర్వాత వదిలి పెట్టారు. పోలీసు నిర్బంధం నుంచి విడుదలైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సాయంత్రం తిరిగి అసెంబ్లీకి చేరుకున్నారు. 

నిరసనలు..ధర్నా 
తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల అసెంబ్లీ బయట పోలీసులు దురుసుగా వ్యవహరించారని, ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ మంగళవారం శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌ రెడ్డిని అరెస్టు చేయడంపై మండలిలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ నిరసన తెలపడంతో సమావేశాలకు అంతరాయం కలిగింది. తర్వాత సాయంత్రం మధు, నవీన్‌కుమార్‌ రెడ్డిని సస్పెండ్‌ చేయడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. మండలి చైర్మన్‌ చాంబర్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలో జరిగిన నిరసనలో ఏకపక్షంగా సస్పెన్షన్‌ విధించి సభను వాయిదా వేసుకుని వెళ్లారని విమర్శించారు. సస్పెన్షన్‌కు సంబంధించిన శాసనసభ తీర్మానం కాపీని తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చర్చ లేకుండా ఎమ్మెల్సీల సస్పెన్షన్‌కు నిరసనగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కొద్దిసేపు గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేస్తూ.. ధర్నా నిర్వహించారు. ఆ తరువాత వారిని పోలీసులు అక్కడ నుంచి పంపించేశారు. మీడియా పాయింట్‌లో తాతా మధు మాట్లాడుతుండగా అసెంబ్లీ మార్షల్స్‌ ఆయనను అడ్డుకున్నారు. మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లడంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కేసీఆర్‌ను ఉద్దేశించి షాద్‌నగర్‌ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement