అమెరికాలో పుట్టి పెరిగిన భారత సంతతి అమెరికన్ పౌరుడు, వ్యాపారవేత్త, రచయితకు నీల్ బక్షి (Neal Bakshi)కి చేదు అనుభవం ఎదురైంది. దేశంలోకి ప్రవేశించకుండా సరిహద్దు వద్ద, తన రంగు కారణంగా ఎదుర్కొన్న వేధింపుల ఘటన ఆందోళన రేపింది. గ్రీన్‌ల్యాండ్ విహారయాత్ర తర్వాత అమెరికా సరిహద్దు దగ్గర గదిలో విచారించి, అమానుషంగా ప్రవర్తించారంటూ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు ఇంగ్లీష్ రాని ఒక వృద్ధురాలితో అధికారుల ప్రవర్తించిన తీరును కూడా తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వెల్లడించారు.అమెరికా పౌరులందర్నీ ఇలానే ట్రీట్ చేస్తున్నారా? లేదా కొంతమంది మాత్రమే టార్గెట్ చేస్తున్నారా అని ఆవేదనతో ప్రశ్నించారు.
తనకు 'గ్లోబల్ ఎంట్రీ' (Global Entry) పర్మిషన్ ఉన్నప్పటికీ, అమెరికా చేరుకోగానే సరిహద్దు భద్రతా అధికారులు (US Customs and Border Protection) సాధారణ తనిఖీ అని చెప్పి పక్కకు తీసుకెళ్లారని నీల్ బక్షి వాపోయారు. అదనపు స్క్రీనింగ్ తనకు కొత్తేమీ కానప్పటికీ, ఈ ప్రత్యేక సంఘటన మాత్రం "పూర్తిగా భిన్నంగా" అనిపించిందన్నారు. ఆ సంఘటన ముగిసేంత వరకు, తనను ప్రాసెసింగ్ కోసం వెనుకకు ఎందుకు తీసుకువెళ్తున్నారో ఏజెంట్లు వెల్లడించ లేదని చెప్పారు.
ఇదీ చదవండి: ఢిల్లీ విషాదంపై స్పందించిన సోనూ సూద్, కీలక వ్యాఖ్యలు
కిటికీలు లేని, పసుపు రంగు వెలుతురు ఉన్న పెద్ద గదిలో ఆయనను కూర్చోబెట్టారు. అక్కడ నల్లజాతీయులు, ఆసియా వాసులు , ఇతర వర్ణాల వ్యక్తులు (People of Colour) మాత్రమే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లి ఆయన వ్యక్తిగత సమాచారం, వివిధ సంస్థలు లేదా సమూహాలతో ఆయనకున్న సంబంధాల గురించి వివరంగా ప్రశ్నించారు. ఇది ఆయన భద్రత కోసమే చేస్తున్నామని అధికారులు చెప్పినప్పటికీ తన దేశంలోకి తన ఎంట్రీ నిరాకరించడం తనకు చాలా బాధించిందని చెప్పారు. తర్వాత ఏ అబద్ధం చెప్పాలో ఆలోచించి కూర్చోఅంటూ పాపం ఇంగ్లీసు రాని ఒక పెద్దావిడను గద్దించారని తెలిపారు.
ఇదీ చదవండి: Delhi building collapse జస్ట్ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్!
ఎందుకు ఇలా నీల్ బక్షి ఆవేదన
సరిహద్దు భద్రత ముఖ్యమే అయినప్పటికీ, కేవలం నిర్దిష్ట రంగు లేదా ప్రాంతానికి చెందిన అమెరికన్ పౌరులను మాత్రమే ఇలా అనుమానించడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. "అమెరికన్లందరినీ సమానంగా చూస్తున్నారా? లేక కొంతమందికి మాత్రమే స్వేచ్ఛ ఉందా?" అని ఆయన ప్రశ్నించారు.
కాగా అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో అక్రమ వలసలపై కఠిన చర్యలు వలస నిబంధనల తనిఖీలను బాగా పెంచింది. జాతీయ భద్రత కోసమే ఇవన్నీ చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, చట్టబద్ధమైన పౌరులు, గ్రీన్‌కార్డ్ హోల్డర్లు కూడా అనవసరమైన తనిఖీలకు, గంటల తరబడి జరిగే విచారణలకు గురవుతున్నారని హక్కుల సంఘాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: నో జిమ్, సోషల్ మీడియాను ఊపేస్తున్న కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్?


