చైనా 60 కి.మీ చొరబడిందా?.. క్లారిటీ ఇచ్చిన కిరణ్ రిజిజు | Border Demarcation Ambiguity Causes Arunachal Confusion Kiren Rijiju | Sakshi
Sakshi News home page

చైనా 60 కి.మీ చొరబడిందా?.. క్లారిటీ ఇచ్చిన కిరణ్ రిజిజు

Aug 20 2026 8:54 AM | Updated on Aug 20 2026 8:54 AM

Border Demarcation Ambiguity Causes Arunachal Confusion Kiren Rijiju

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వెంబడి సరిహద్దుల నిర్ధారణ స్పష్టంగా లేకపోవడం వల్లే ఇరువైపులా కొంత గందరగోళం నెలకొందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. చైనా బలగాలు భారత భూభాగంలోకి 60 కిలోమీటర్ల మేర చొరబడ్డాయంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు రేఖ నిర్దిష్టంగా విభజించబడకపోవడంతో సరిహద్దు ప్రాంత ప్రజల్లో తమ భూభాగంపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని అన్నారు.

చైనా మన గ్రామాన్ని ఆక్రమించిందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. లాంగ్జు ప్రాంతం వద్ద నిర్మించిన కొన్ని భవనాలు, నిర్మాణాలకు సంబంధించి ప్రస్తావిస్తూ.. ఆ ప్రాంతం 1959లోనే ఆక్రమణకు గురైందని, 1962 నాటికే అక్కడ వారి ఉనికి స్థిరపడిందని వివరించారు. నాటి నుంచి ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. అయితే, ఎత్తైన పర్వత శ్రేణులపై చైనా సైనిక కార్యకలాపాలు పెరిగాయన్న విషయాన్ని రిజిజు అంగీకరించారు.

సరిహద్దు గ్రామస్థుల ఆందోళనలు సహేతుకమైనవని, వాటిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని అన్నారు. అదే సమయంలో బంగ్లాదేశ్ వంటి ఇతర ప్రాంతాల ఫోటోలను జతచేస్తూ, చైనా 60 కిలోమీటర్లు చొచ్చుకొచ్చిందంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. ఇటువంటి అసత్యాలు సరిహద్దుల్లో కాపలా కాస్తున్న భారత సైన్యం, ఐటీబీపీ బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. ప్రస్తుతం భారత సైన్యం, ఐటీబీపీ బలగాలు సరిహద్దుల్లో నిఘా, గస్తీని మునుపెన్నడూ లేని విధంగా బలోపేతం చేశాయని మంత్రి వివరించారు.

ఇది కూడా చదవండి: ఉప్పు తగ్గిందని సర్ఫ్‌.. వికటించిన ‘మధ్యాహ్న భోజనం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement