అభిప్రాయం
‘మెరిట్’ అనే మాట వినగానే మనకు సాధారణంగా ఒక పరీక్ష గుర్తుకొస్తుంది. ఎక్కువ మార్కులు సాధించినవాడు మెరిట్‌లో ముందుంటాడు. తక్కువ మార్కులు వచ్చినవాడు వెనుకబడతాడు. ఈ లెక్కలో ఎవరి కులమూ, కుటుంబమూ, స్కూలూ, తల్లిదండ్రుల విద్యార్హతలూ, ఆర్థిక పరిస్థితులూ ఏవీ కనిపించవు; కాగితంపై మిగిలే మార్కులు తప్పించి.
ఒకే పరీక్ష రాసిన ఇద్దరు విద్యార్థులకూ పరీక్షా సమయం, ప్రశ్నపత్రం ఒకటే ఉండొచ్చు. కానీ ఆ పరీక్షకు చేరుకునే దారి మాత్రం ఒకటేనా? ఒకరికి చిన్నప్పటి నుంచే పుస్త కాలతో నిండిన ఇల్లూ, చదువుకున్న తల్లిదండ్రులూ, ప్రైవేట్ స్కూలూ, ట్యూషనూ, ఇంటర్నెట్, పర్సనల్ రూమ్, కాంపిటీటివ్ కోచింగ్... ఇవన్నీ ఉంటే, మరొకరికి మొదటి తరంలోనే చదువు మొదలై ఉంటే; పరీక్ష హాలులోకి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య ఉన్న తేడాని కేవలం ‘మెరిట్’ అన్న ఒక్క పదంతోనే వివరించగలమా?
మెరిట్ అన్నది వ్యక్తి ప్రతిభకు మాత్రమే కొల మానమా, లేక వ్యక్తికి లభించిన అవకాశాల ఫలితమూ అందులో కలిసే ఉంటుందా? భారతదేశంలో విద్యా అవ కాశాలు గతంతో పోలిస్తే విస్తరించాయి. కానీ అందరికీ ఒకే స్థాయీ ప్రయాణం మొదలు కాలేదు. 2017–18 విద్యా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 15 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 5.7 శాతం మంది మాత్రమే గ్రాడ్యు యేట్లు లేదా అంతకంటే పై స్థాయి విద్య పూర్తి చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఈ శాతం 21.72. అదే సర్వే గ్రామీణ ప్రాంతాల్లో సెకండరీ పాఠశాల ఒక కిలోమీటర్ పరిధిలో ఉందని చెప్పిన కుటుంబాలు సుమారు 38 శాతం మాత్ర మేనని నమోదు చేసింది.
పట్టణాల్లో అది దాదాపు 70 శాతం. ఇది కేవలం పేదరికం సమస్య కాదు. కులం కూడా విద్యా అవకాశాల పంపిణీలో భాగమే. భారత విద్యాశాఖకు చెందిన ఒక అధ్యయనం సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు మొదటి తరం విద్యార్థులుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందనీ, వారికి విద్యా వ్యవస్థలో అవసరమైన సామాజిక–సాంస్కృతిక మూలధనం తక్కు వగా ఉండవచ్చనీ, ప్రవేశ దశలోనే విద్యా అసమానతలు ఉంటాయనీ గుర్తించింది. ఇక్కడ ‘సామాజిక మూలధనం’ అన్న మాట ముఖ్యమైనది.
ఐఐటీలపై చేసిన ప్రసిద్ధ పరి శోధనలో సామాజికంగా లభించిన కుల మూలధనం ఆధు నిక విద్యా మెరిట్‌గా ఎలా మారుతుందనే ప్రశ్నను పరిశీలించారు. చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థి నిజంగానే ప్రతిభావంతుడై ఉండవచ్చు. ప్రశ్న వ్యక్తిగత ప్రతిభను నిరాకరించడం కాదు, ఆ ప్రతిభ పెరగడానికి లభించిన పరిస్థితులు సమానంగా ఉన్నాయా అని అడగడం.
సామాజిక మూలధనం
ఇదే తేడా అర్థం కాకపోవడం వల్ల ‘మెరిట్ వర్సెస్ రిజర్వేషన్’ అనే చర్చ పదేపదే ఒకే చోటికి వచ్చి ఆగిపోతుంది. రిజర్వేషన్‌ను ప్రతిభను తొలగించే వ్యవస్థగా చూడటం సరికాదు. భారత రాజ్యాంగ వ్యవస్థలో రిజర్వేషన్ అనేది సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఉపయోగపడే ఒక సాధనం. 2026 మార్చిలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రిజర్వేషన్‌కు అర్హులైన అభ్యర్థులకు వయస్సు, ఫీజు వంటి సడలింపులు ఇవ్వడం మెరి ట్‌ను తగ్గించడం కాదనీ, అవి పోటీకి చేరుకునే పరి స్థితులను సమానం చేసే చర్యలనీ కోర్టు పేర్కొంది.
అంటే ‘సమాన పోటీ’ అనే మాటకు కూడా ఒక ముందస్తు అర్థం ఉంది. అందరూ ఒకే స్టార్టింగ్ లైన్ వద్ద నిలబడి ఉన్నప్పుడు మాత్రమే పందెం ఫలితాన్ని పూర్తిగా వ్యక్తిగత సామర్థ్యంగా చూడటం సాధ్యం. కానీ సమాజంలో స్టార్టింగ్ లైన్లే వేర్వేరుగా ఉంటే? అప్పుడు చివర్లో వచ్చిన మార్కును మాత్రమే చూసి ‘ఎవరు ఎక్కువ మెరిట్?’ అని అడగటం అనేది ఫలితాన్ని కొలవడం మాత్రమే అవుతుంది; ఫలితం ఏర్పడిన సామాజిక ప్రక్రియను కొలవడం కాదు.
అయితే అవకాశాల అసమానతలను తగ్గించడానికి రిజర్వేషన్ ఒక్కటే సరిపోతుందా? పిల్లవాడు పోటీ పరీక్షకు వచ్చేలోపు పది సంవత్సరాల విద్యలోనే అసమానతలు ఏర్పడితే, చివర్లో సీట్లను పంచడం మాత్రమే సమానత్వం ఎట్లా అవుతుంది? ప్రభుత్వ పాఠశాలల నాణ్యత, ఉపాధ్యా యుల లభ్యత, ప్రాథమిక విద్య, భాషా సామర్థ్యం, డిజి టల్ సదుపాయాలు, పోటీ పరీక్షల ఉచిత శిక్షణ, మొదటి తరం విద్యార్థులకు మార్గదర్శకత్వం– ఇవన్నీ బలపడాలి. అందువల్ల ‘మెరిట్’ను సామాజిక నేపథ్యం లేని స్వచ్ఛమైన వ్యక్తిగత ప్రతిభగా ఊహించడం మాత్రం సమస్య. ‘మెరిట్ ఎవరిది?’ అనే ప్రశ్న కంటే ముందు ‘మెరిట్ ఏర్పడటానికి అవకాశం ఎవరికెంత దొరికింది?’ అన్న ప్రశ్న వేయాలి.
- బాలాజీ పోతుల, వ్యాసకర్త ఉపాధ్యాయుడు
ఇదీ చదవండి: కంచె చేను మేస్తుంటే, కాపు గాచేదెవరు?


