సాక్షి,న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఓటరు నమోదు వివాదంపై ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో ఆమె పేరు నమోదైందంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ ఫిర్యాదుపై తీసుకున్న చర్యల నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
సోనియా గాంధీ 1983లో భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే, అనగా పౌరసత్వానికి ముందస్తుగా ఓటర్ల జాబితాలో ఆమె పేరు చేర్చారంటూ రౌస్ అవెన్యూ కోర్టు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ త్రిపాఠి ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యవహారంపై ఏసీజేఎం వినోద్ జోషి విచారణ జరిపారు. ఈ ఫిర్యాదుపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు. గతంలో ఈ పిటిషన్ విచారణను మేజిస్ట్రేట్ కోర్టు తోసిపుచ్చగా.. ఆ ఉత్తర్వులను గత సెప్టెంబర్‌లో సెషన్స్ కోర్టు రద్దు చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన విచారణను ఢిల్లీ ఏసీజేఎం కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.


