దావూద్ ఇబ్రహీం భవనం కూల్చివేతపై వివాదం | Controversy over demolition of Dawood Ibrahim building | Sakshi
Sakshi News home page

దావూద్ ఇబ్రహీం భవనం కూల్చివేతపై వివాదం

Nov 18 2026 3:10 PM | Updated on Nov 18 2026 3:13 PM

Controversy over demolition of Dawood Ibrahim building

ముంబై: అండర్‌వరల్డ్ డాన్, పరారీలో ఉన్న దావూద్ ఇబ్రహీంకు చెందిన పాత భవనం కూల్చివేత వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ముంబైలోని భేండీ బజార్‌లో ఉన్న హాజీ ఇస్మాయిల్ హబీబ్ ముసాఫిర్‌ఖానా భవనాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు నేడు, రేపు కూల్చివేయాలని నిర్ణయించారు.

అయితే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ప్రార్థనా స్థలాన్ని మసీదుగా గుర్తించాలని స్థానికులు, కాంగ్రెస్, ఎంఐఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్థలం వక్ఫ్ బోర్డు పరిధిలో ఉందని, సుప్రీంకోర్టు, వక్ఫ్ ట్రిబ్యునల్ స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూల్చివేతకు నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఎంఐఎం నేత వారిస్ పఠాన్ ఆరోపించారు. అంతేకాదు భవనం కూల్చివేతను అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయిస్తామని కూడా తెలిపారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్ సైతం అధికారులు నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వకుండా చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. ఈ వ్యవహారం వక్ఫ్ ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నందున ఇరువర్గాల వాదనలు వినకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.

దావూద్ ఇబ్రహీం కుటుంబం గతంలో నివసించిన ఈ భవనంలో ఒకప్పుడు 32 దుకాణాలతో పాటు 19 నివాస గృహాలు కూడా ఉండేవి. అయితే ప్రస్తుతం భవనం శిథిలావస్థకు చేరడంతో 2020లో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు కొంత భాగాన్ని కూల్చివేశారు. ప్రస్తుతం మిగిలిన ప్రార్థనా స్థలంతో పాటు భవనంలోని కొన్ని గదులను కూడా తొలగించేందుకు సిద్ధమయ్యారు.

1993లో ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల అనంతరం దావూద్ కుటుంబానికి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్లను 2018 ఏప్రిల్ 20న సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఇదీ చదవండి: స్వీట్స్‌లో అల్యూమినియం.. తయారీ కేంద్రాల గుట్టు రట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement