న్యూఢిల్లీ: కెమెరాలు, మైక్రోఫోన్లు పట్టుకుని రీల్స్ చేసే వారంతా జర్నలిస్టులు కాలేరని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. వార్తా సేకరణ కోసం పనిచేసే మీడియా ప్రతినిధులకు లభించే రక్షణలు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు వర్తించవని స్పష్టం చేశారు. గత నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడి చేశారంటూ పలు మీడియా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
దీనిపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్, జాయింట్ కమిషనర్ సురేందర్ కుమార్ అఫిడవిట్లు దాఖలు చేశారు. నిరసనల్లో కొందరు యూట్యూబ్ రీల్స్ చేసే వ్యక్తులు కెమెరాలు, మైక్రోఫోన్లతో పాల్గొన్నారని, దీంతో నిజమైన జర్నలిస్టులను గుర్తించడం కష్టమైందని పోలీసులు పేర్కొన్నారు. డిజిటల్ మీడియా పేరుతో పలువురు రీల్స్ రూపొందించి వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఒక వ్యక్తి జర్నలిస్టా? కంటెంట్ క్రియేటరా? అనేది నిర్ణయించడంలో అతడి ప్రధాన ఉద్దేశం కీలకమని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేస్తూనే, రీల్ మేకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సాధారణ చట్టాలకు, పోలీసుల చట్టబద్ధమైన ఆదేశాలకు అతీతులు కారని సుప్రీంకోర్టుకు నివేదించారు.


