వయసుతో పాటు బరువు పెరగడం మంచిదే! | A little extra body weight can help one particular group of people live longer | Sakshi
Sakshi News home page

వయసుతో పాటు బరువు పెరగడం మంచిదే!

Nov 18 2026 11:29 AM | Updated on Nov 18 2026 11:40 AM

A little extra body weight can help one particular group of people live longer

న్యూఢిల్లీ: వయసుతో పాటు కొంచెం అధిక బరువు కలిగి ఉండటం ఆరోగ్యానికి మేలు చేయనుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారిలో సాధారణం కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ఉండటం దీర్ఘాయుష్షుకు దోహదపడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్‌కు చెందిన ఆరోగ్య పరిశోధకుడు బ్రయాన్ బ్లిస్మర్ ఈ విషయాలను వెల్లడించారు. సాధారణంగా అధిక శరీర కొవ్వు వల్ల గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని భావిస్తారు. అయితే వృద్ధుల విషయంలో ఈ అంచనా పూర్తిగా సరైనది కాదని పరిశోధకులు పేర్కొన్నారు.

ఈ అధ్యయనం కోసం అమెరికాలోని 6,905 మంది వృద్ధులకు సంబంధించిన 14 ఏళ్ల ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించారు. శరీరంలో కొవ్వు ఎంత ఉందన్నదే కాకుండా అది ఏ ప్రాంతంలో పేరుకుపోతుందన్నది కూడా ముఖ్యమని గుర్తించారు. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉంటే వాపు సంబంధిత సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుందని బ్లిస్మర్ వివరించారు. అదే సమయంలో తుంటి, ఛాతీ, పిరుదుల ప్రాంతాల్లో ఉండే కొవ్వు అంతగా ప్రమాదకరంగా ఉండకపోవచ్చని తెలిపారు.

యువతలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించిందని పరిశోధకులు పేర్కొన్నారు. సాధారణ బీఎంఐ ఉన్నప్పటికీ నడుము చుట్టూ అధిక కొవ్వు ఉన్నవారిలో అకాల మరణ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు బీఎంఐ విషయంలోనూ కొన్ని పరిమితులు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే బీఎంఐ శరీరంలోని కొవ్వు, కండరాల మధ్య తేడాను గుర్తించలేదు. కండరాల పరిమాణం ఎక్కువగా ఉన్నవారిలోనూ బీఎంఐ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారిలో అనారోగ్యం, గాయాలను తట్టుకునే సామర్థ్యం మెరుగ్గా ఉండవచ్చని బ్లిస్మర్ ఆగస్టులో నిర్వహించిన పరిశోధన సూచించింది.

అయితే అధిక కొవ్వు ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుందని ఈ అధ్యయనాన్ని చూసి అనుకోకూడదని పరిశోధకులు హెచ్చరించారు. వృద్ధాప్యంలో శరీర నిర్మాణంలో వచ్చే మార్పులు, బీఎంఐ కొలమానంలోని పరిమితులను ఈ ఫలితాలు సూచిస్తున్నాయని స్పష్టం చేశారు. తక్కువ బీఎంఐ ఉన్నంత మాత్రాన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు భావించలేమని కూడా బ్లిస్మర్ పేర్కొన్నారు.

గతంలో నిర్వహించిన కొన్ని అధ్యయనాలు కూడా ఇలాంటి విషయాలనే వెల్లడించాయి. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న వారికి కొంత అదనపు బరువు ప్రయోజనకరంగా ఉండవచ్చని హార్బర్‌-యూసీఎల్‌ఏ మెడికల్ సెంటర్‌కు చెందిన నెఫ్రాలజిస్ట్, ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ కమ్యార్ కలంతర్‌-జాదే తెలిపారు. అయితే బరువు విషయంలో వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణుల సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: రామాయణ వివాదం.. జావేద్ అక్తర్ ‘రామ్‌పాల్‌’ అవుతారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement