లండన్: కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రస్తుత తరుణంలో.. మనిషి ప్రత్యేకతకు మరోసారి గుర్తింపు లభించింది. 2026 సంవత్సరానికి సంబంధించి కేంబ్రిడ్జ్ డిక్షనరీ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ‘హ్యూమన్’ (Human) అనే పదాన్ని ఎంపిక చేసింది. మనుషులకు ఉండే లక్షణాలు, లోపాలు, భావోద్వేగాలను కలిగి ఉండటమే హ్యూమన్ అనే పదానికి అర్థమని డిక్షనరీ వివరించింది.
ఏఐతో పెరిగిన పోటీ
గత కొంతకాలంగా ఏఐ వినియోగం విపరీతంగా పెరిగింది. రచనలు, కళలు, సంగీతం వంటి రంగాల్లోనూ ఏఐ అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. దీంతో మనుషులు సృష్టించిన వాటికి, యంత్రాలు తయారుచేసిన వాటికి మధ్య తేడా గుర్తించడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ‘హ్యూమన్ మేడ్’, ‘హ్యూమన్ రిటెన్’, ‘హ్యూమన్ జనరేటెడ్’ వంటి పదాల ప్రాధాన్యం పెరుగుతోందని కేంబ్రిడ్జ్ పేర్కొంది.
మానవ సృజనాత్మకతకు గుర్తింపు
ఏఐ తయారుచేసిన కంటెంట్ విస్తరిస్తున్న కొద్దీ మానవ సృజనాత్మకత, సహజత్వం, భావోద్వేగాలకు ప్రజలు ఎక్కువ విలువ ఇస్తున్నారని డిక్షనరీ తెలిపింది. మనుషుల భాగస్వామ్యంతో తయారైన ఉత్పత్తులు, అనుభవాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తోందని వివరించింది.
2026లో కీలక పరిణామం
కేంబ్రిడ్జ్ డిక్షనరీ చీఫ్ ఎడిటర్ కోలిన్ మెకింతోష్ మాట్లాడుతూ.. ఏఐ సమాజంలో అంతర్భాగంగా మారిందని, ఈ ఏడాది దాని ప్రభావం మరింత స్పష్టంగా కనిపించిందని చెప్పారు. ఏఐ నేపథ్యంలో మానవ విలువలను తిరిగి అంచనా వేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.
షార్ట్‌లిస్ట్‌లో మరో నాలుగు పదాలు
‘హ్యూమన్’తో పాటు అనలాగ్, ఏజెంట్, హోల్‌సమ్, చిక్కీ పదాలు కూడా తుది జాబితాలో నిలిచాయి. వీటిలో అనలాగ్ అంటే డిజిటల్ టెక్నాలజీకి దూరంగా ఉండే విధానాలు, ఏజెంట్ అంటే స్వతంత్రంగా పనిచేసే ఏఐ వ్యవస్థ అని అర్థం. ఏఐ మానవుడిలా మాట్లాడగలుగుతున్నా.. మనిషిలోని భావోద్వేగాలు, సృజనాత్మకత, అనుబంధాల ప్రత్యేకతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘హ్యూమన్’ ఎంపికకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదీ చదవండి: ‘రావణుడు శూర్పణఖ భర్తను చంపడమేంటి?.. నిలదీసిన హిందూ సంఘం!


