భూసారంతోనే బుద్ధి బలం! | Soil Health Plays a Key Role in Human Well-Being and Cognitive Ability | Sakshi
Sakshi News home page

భూసారంతోనే బుద్ధి బలం!

Oct 29 2026 4:22 AM | Updated on Oct 29 2026 4:22 AM

Soil Health Plays a Key Role in Human Well-Being and Cognitive Ability

మనుషుల సంపూర్ణ ఆరోగ్యానికి, ఆలోచనా శక్తికి కేవలం తినే ఆహారంలో పోషకాలే కాకుండా, ఆ ఆహారాన్ని పండించే భూమి ఆరోగ్యం కూడా మూలకారణమని ఒక అధ్యయనం వెల్లడించింది. నేల సారాన్ని బట్టి ఆయా దేశాల్లోని ప్రజల సగటు మేధో సామర్థ్యం (ఐక్యూ) ఆధారపడి ఉంటోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. టర్కీలోని ఇగ్దిర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సాబిత్‌ ఎర్షాహిన్, ఫారూక్‌ తోహుమ్‌జు, రుష్తు చాల్లీలు ప్రపంచవ్యాప్తంగా 126 దేశాల మట్టి లక్షణాలు, అక్కడి ప్రజల సగటు ఐక్యూపై విశ్లేషణ చేశారు. ఈ వివరాలు సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.  

భూసార సూచికతో మేధోశక్తి అనుసంధానం
పరిశోధకులు వివిధ రకాల నేలలు, వాటి పోషక విలువల ఆధారంగా సాయిల్‌ ఫెర్టిలిటీ ఇండెక్స్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) అనే కొలమానాన్ని రూపొందించారు. ఈ సూచికకు, ప్రజల సగటు జాతీయ మేధోశక్తికి (మీన్‌ నేషనల్‌ ఐక్యూ) మధ్య బలమైన సానుకూల సంబంధం ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. వివిధ దేశాల ప్రజల ఐక్యూలలో కనిపించే వ్యత్యాసాల్లో సుమారు 34 శాతం కేవలం భూసారంపైనే ఆధారపడి ఉన్నట్లు విశ్లేషణలో తేలింది. జియోస్టాటిస్టికల్‌ అధ్యయనాల ద్వారా నేల సారానికి, మానవ మేధస్సుకు మధ్య భౌగోళికంగా కూడా విడదీయరాని సంబంధం ఉందని వెల్లడైంది.   

సారవంతమైన నేలలు.. అధిక మేధస్సు
అత్యంత సారవంతమైన మోలిసోల్స్, ఆల్ఫిసోల్స్, అండిసోల్స్‌ వంటి బలమైన నేలలు అధికంగా ఉన్న ఉత్తర అమెరికా, ఐరోపా, తూర్పు ఆసియా ప్రాంతాల్లో ప్రజల సగటు ఐక్యూ ఎక్కువగా నమోదైంది. ఈ ప్రాంతాల్లోని నేలలు పంటలకు తగిన పోషకాలను సమృద్ధిగా అందిస్తాయి. 

భూమధ్య రేఖ సమీపంలోని దేశాలు, సబ్‌–సహారన్‌ ఆఫ్రికాలోని ఆక్సిసోల్స్‌ వంటి అత్యంత నిస్సారమైన నేలల్లో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. నేలలో ఐరన్, జింక్, అయోడిన్, క్యాల్షియం వంటి సూక్ష్మపోషకాల కొరత ఉంటే, పంటల్లోనూ ఆ పోషకాలు లోపిస్తాయి.

వీటిని ఆహారంగా తీసుకునే గర్భిణులు, చిన్నపిల్లల్లో నాడీ వ్యవస్థ, మెదడు ఎదుగుదల మందగించి జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. భూమి ఇచ్చే పోషకాలే మనిషి ఆలోచనకు శక్తినిస్తాయి. అయితే, ఈ ప్రభావం కేవలం నేలపైనే కాకుండా సామాజిక, విద్యావకాశాలు, ఆహార దిగుమతులపై కూడా ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement