breaking news
soil health
-
నూతన యూరియా విధాన సవాళ్లు
హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర ఒక్కసారిగా టన్నుకు దాదాపు వెయ్యి డాలర్లకు పెరిగింది. దేశ యూరియా అవసరాల్లో నాలుగో వంతును దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది దిగుమతుల మీద ఆధారపడే పాత భయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నూతన యూరియా పెట్టుబడి విధానం రూపంలో స్పందన వచ్చింది. దేశం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న కోటి టన్నుల యూరియాను ఇక్కడే తయారు చేసేందుకు ఎనిమిది–తొమ్మిది కొత్త గ్యాస్ ఆధారిత కర్మాగారాలను నెలకొల్పడమే దీని లక్ష్యం.వేసిన నత్రజని పనికొచ్చేనా?తర్కంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే. కానీ ఆ తర్కమే అసలు సమస్య. సరఫరా సంక్షోభం వచ్చినప్పుడు మన వ్యవసాయ విధానం చూపే ప్రతిస్పందన ఒక్కటే– ఎరువును మరింత ఎక్కు వగా ఉత్పత్తి చేయడం. కానీ ఎవరూ అడగని ప్రశ్న ఒకటుంది. పద్నాలుగు కోట్ల రైతు కుటుంబాలు, ప్రపంచంలోనే అతిపెద్ద పశు సంపద, ప్రతి శీతాకాలంలో తగలబెట్టే కోట్లాది టన్నుల పంట వ్యర్థాలు– ఇవన్నీ ఉన్న దేశం ఇంత భారీ మొత్తంలో కృత్రిమ నత్రజనిని ఎందుకు దిగుమతి చేసుకోవాలి?గత అరవై ఏళ్లుగా మన వ్యవసాయ విధానాన్ని ఒక నమ్మకం శాసిస్తోంది– ప్రతి ఉత్పాదకత సమస్యా ఎరువుల సమస్యే; దాన్ని మరిన్ని ఎరువులు ఉత్పత్తి చేయడం, దిగుమతి చేయడం, రాయితీ ఇవ్వడం ద్వారానే పరిష్కరించాలి. హరిత విప్లవం కాలంలో ఇది నిజమే. అప్పుడు నత్రజని కొరత ఒక అడ్డంకి. కానీ ఇవాళ మన అసలు సమస్య నత్రజని కొరత కాదు; పంటకు నత్రజనిని అందించే నేల ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రభుత్వ నేల ఆరోగ్య కార్డుల డేటానే చూస్తే– దేశంలో దాదాపు 64 శాతం నేలల్లో నత్రజని తక్కువ, 48.5 శాతం నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువ.మరో గణాంకం మరింత భయపెడుతుంది. హరిత విప్లవం తొలినాళ్లలో ఒక కిలో ఎరువుకు దాదాపు పదమూడు కిలోల అదనపు ధాన్యం వచ్చేది– అంటే 1:13 నిష్పత్తి. ఇవాళ అది 1:2.7కి పడి పోయింది. అంటే అదే కిలో ఎరువు ఇప్పుడు నాలుగో వంతు ధాన్యాన్ని మాత్రమే ఇస్తోంది. మనం వేసే నత్రజనిలో అరవై శాతానికి పైగా పంటకు అందకుండా గాలిలోకి, భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోతోంది. నత్రజని చౌకగా దొరకడంతో రైతులు దాన్నే మోతాదు మించి వాడుతున్నారు; ఫలితంగా ఎన్ పీకే(నత్రజని, భాస్వరం, పొటాషియం) నిష్పత్తి 4:2:1 ఉండాల్సిన చోట దాదాపు 11:4:1కి చేరింది.ఒక ప్రాథమిక తేడాను మనం మరచిపోయాం. పంటకు పోషకాలు అందించడం వేరు, నేల సారాన్ని కాపాడటం వేరు. యూరియా పంటకు తక్షణ ఆహారం అందిస్తుంది. కానీ నేలలో సేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, వానపాములు– వీటిని అది పెంచదు. నిజానికి మోతాదు మించిన నత్రజని వీటిని దెబ్బతీస్తుంది. ఈ జీవరాశే నేలకు నీటిని పట్టి ఉంచే శక్తిని, గాలి ఆడే నిర్మాణాన్ని, పోషకాలను చక్రంలా తిప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది. వీటిని రసాయనిక ఎరువులతో తిరిగి నిర్మించలేం– ఎందుకంటే ఎన్పీకే అనేది కర్బనం కాదు, జీవం అసలే కాదు.నిజంగా ఇది స్వావలంబనా?నూతన యూరియా విధానం చెప్పే స్వావలంబన కూడా చాలావరకు భ్రమే. యూరియా అమోనియా నుంచి, అమోనియా సహజ వాయువు నుంచి తయారవుతాయి. ఆ సహజ వాయువులో చాలా భాగం మనం ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి చేసుకునేదే. యూరియా ఉత్పత్తి వ్యయంలో ఇది 70–80 శాతం. అంటే కొత్త కర్మాగారం అంటే దిగుమతి చేసుకున్న వాయువును ఇక్కడ యూరియాగా మార్చే యంత్రం మాత్రమే. మన ఆధారపడటం పోలేదు, కేవలం ఒక మెట్టు పైకి జరిగింది. భాస్వరం, పొటాష్ విషయంలో అయితే మనం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాం.అమెరికా ఉదాహరణ చూడండి: ఆ దేశం నత్రజనిలో స్వావలంబన సాధించిన మాట నిజమే, కానీ కర్మాగారాలు కట్టడం వల్ల కాదు. దానికి సొంత షేల్ గ్యాస్ ఉంది; మొక్కజొన్న–సోయాబీన్ మార్పిడి సాగులో పప్పుజాతి పంట తనకు తానే నత్రజనిని స్థిరీక రించుకుంటుంది. ఈ రెండూ మనకు లేవు. అక్కడి వాతావరణం కూడా వేరు. మన ఉష్ణోగ్రతలకు సేంద్రియ కర్బనం తొందరగా కోల్పోతాం. అక్కడ సంవత్సరానికి ఒక పంట కాలమే, రెండో కాలంలో నేల పునర్జీవనం కావటానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా బాటలో కేవలం కర్మాగారాల స్థాపనను కాపీ చేస్తే, భారం మిగులుతుంది తప్ప భద్రత రాదు.నిజమైన స్వావలంబన అంటే మనం అదుపులో ఉంచుకోగల వనరుల నుంచి పంట అవసరాలను తీర్చుకోవడం. పప్పు ధాన్యాలు, జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, అజొల్లా ద్వారా జీవ నత్రజని స్థిరీకరణ, పంట వ్యర్థాల పునర్వినియోగం, పశువుల ఎరువు, అన్నిటికీ ఆధారమైన నేలలో సేంద్రియ పదార్థం– ఇవి పెరిగితే వేసే ప్రతి కిలో ఎరువూ మరింత సమర్థంగా పనిచేస్తుంది.జీవసారం పెంచితే ప్రోత్సాహకాలుఇప్పుడు డబ్బుల మాట. దేశ ఎరువుల రాయితీ దాదాపు రూ.1.7 లక్షల కోట్లు; అందులో యూరియాదే రూ.1.19 లక్షల కోట్లు. తగ్గిపోతున్న రసాయనిక ఎరువుల సామర్థ్యం, వృథా అవు తున్న సగం నత్రజని– వీటిని చూస్తే ఇది తక్కువ ప్రయోజనం ఇచ్చే ఖర్చు. ఈ రాయితీలో సగాన్ని– అంటే దాదాపు 85 వేల కోట్లను– నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మళ్లిస్తే ఏమవుతుంది?ఒక టన్ను యూరియా ఒక్క సీజన్ కే అయిపోతుంది, మళ్లీ కొనా ల్సిందే. కానీ నేలలో పెరిగిన సేంద్రియ కర్బనం ఏళ్ల తరబడి నిలు స్తుంది. ప్రతి ఏటా దిగుబడిని, నీటి నిల్వను, ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల బాగుపడిన కొద్దీ దానికి కావాల్సిన నత్రజని తగ్గుతుంది, దాంతోపాటే రాయితీ భారమూ తగ్గుతుంది.అందుకే ఒక జాతీయ/రాష్ట్ర స్థాయి నేల ఆరోగ్య పునరుద్ధరణ మిషన్ అవసరం. నేలలో సేంద్రియ కర్బనం, జీవసారం పెరిగిన కొద్దీ రైతుకు నేరుగా ప్రోత్సాహకం అందాలి. గ్రామ స్థాయి కంపోస్ట్, పంట వ్యర్థాల పునర్వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జీవ ఎరువుల యూనిట్లు– వీటిని ఉపాధి హామీ పథకం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.‘రసాయనిక ఎరువులు లేకుండా దేశాన్ని పోషించలేం’ అనే వాదన రావచ్చు. ఎరువులను పూర్తిగా వదిలేయాలని అనడం లేదు. మొదట్లో రసాయనికం, జీవసంబంధం రెండింటినీ కలిపి వాడే సమీ కృత పోషక యాజమాన్యమే మార్గం. భారత్ తదుపరి వ్యవసాయ విప్లవం మరిన్ని రసాయనిక ఎరువులపై కాదు– ప్రాణమున్న నేల లను తిరిగి నిర్మించడంపై ఆధారపడాలి. ఏ ఓడరేవు, గ్యాస్ పైప్‌లైన్ కోసం మనం ఎదురుచూడనక్కర్లేదు– మన అతిపెద్ద ఎరువుల కర్మాగారం ప్రతి రైతు కాళ్ల కింద, నేల జీవంలోనే ఉంది. - డా. జి.వి. రామాంజనేయులు, వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు -
Sagubadi: మట్టి సారాన్ని పెంచే తవుడు ద్రావణం..
మిద్దెతోటలు, ఇంటిపంటల్లో తవుడు (రైస్ బ్రాన్)ను మొక్కల పెంపకంలో అద్భుతమైన ఎరువుగా ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. తవుడు మొక్కల పెరుగుదలకు, నేల స్వభావాన్ని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. తవుడులో విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.తవుడును నేరుగా మట్టిలో చల్లడం లేదా కంపోస్ట్‌లో కలపడం వల్ల అది నెమ్మదిగా కుళ్ళి మొక్కలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.ఇది మట్టిలోని మేలు చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు దోహదపడుతుంది. మొక్కలకు బలం చేకూరుతుంది.తవుడును నీటిలో నానబెట్టి, పులియబెట్టి మొక్కలకు వాడవచ్చు. ఇది మొక్కలకు ఒక అద్భుతమైన సహజ ఎరువుగా, నేల సారాన్ని పెంచే బూస్టర్‌గా పనిచేస్తుంది.కుళ్లే ప్రక్రియలో తవుడులో ఉండే సంక్లిష్ట కర్బన పదార్థాలు విచ్ఛిన్నమై, మొక్కలకు సులభంగా అందే నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలుగా మారుతాయి.తవుడు ద్రావణంలో లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా, ఇతర మేలు చేసే సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఇవి నేలలోని హానికర వ్యాధికారకాలను అరికట్టి, వేర్ల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.తవుడు ద్రావణం నేల నిర్మాణాన్ని మెరుగుపరిచి, వానపాములు వంటి జీవులను ఆకర్షిస్తుంది, తద్వారా నేల గుల్లగా మారుతుంది.ఈ ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల మొక్కలకు చీడపీడల నుండి రక్షణ లభిస్తుంది, మొక్కల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మిశ్రమం నుండి పుల్లటి లేదా మంచి వాసన వచ్చినప్పుడు అది తయారైనట్లు గుర్తు. ఒకవేళ కుళ్ళిన వాసన వస్తే అది వాడకూడదు.తయారైన ద్రావణాన్ని 1 లీటరు ద్రావణానికి 10 లీటర్ల నీరు కలిపి మొక్కల మొదళ్లలో పోయవచ్చు లేదా ఆకులపై పిచికారీ చేయవచ్చు.దీన్ని నెలకు ఒకటి లేదా రెండుసార్లు వాడితే సరిపోతుంది. అతిగా వాడితే మట్టి గట్టిపడే అవకాశం ఉంటుంది.తవుడు ఫెర్మెంటేషన్ నీరు పూల (గులాబీ, మల్లె, జాజి, మందార..) మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది. తవుడులోని భాస్వరం, పొటాషియం వల్ల పూల సైజు పెరుగుతుంది అలాగే ఎక్కువ మొగ్గలు కూడా వస్తాయి.ఇందులోని పోషకాలు పూలకు మంచి రంగును, సువాసనను ఇస్తాయి.ముఖ్యంగా గులాబీ మొక్కల మొదళ్లలో ఈ ద్రావణాన్ని పోస్తే వేర్లు దృఢంగా మారి, మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.కూరగాయల (టమాటో , మిరప , వంగ..) మొక్కలకు వాడితే నత్రజని అందుతుంది. ఆకులు ముదురు పచ్చగా మారి, కిరణజన్య సంయోగ క్రియ బాగా జరుగుతుంది.టమాటా, మిర్చి వంటి మొక్కల్లో పూత రాలడం తగ్గుతుంది. కాయలు నాణ్యంగా, రుచిగా వస్తాయి.తవుడు ద్రావణాన్ని ఆకులపై స్ప్రే చేయడం వల్ల ఆకు ముడత వంటి సమస్యలు తగ్గుతాయి.మనం తయారు చేసుకున్న ద్రావణం గాఢత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 1 లీటరు ద్రావణానికి కచ్చితంగా 10 లీటర్ల నీటిని కలిపి వాడాలి. లేదంటే మొక్కల వేర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది.ఎప్పుడైనా ఎరువులను ఉదయం పూట లేదా సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత ఇస్తే మొక్కలు త్వరగా గ్రహిస్తాయి.తవుడు ద్రావణాన్ని 15–20 రోజుల లోపు వాడేయడం మంచిది. ఎక్కువ రోజులు ఉంచితే దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది.తవుడు నీటిలో ఉండే అమినో ఆమ్లాలు మొక్కలు త్వరగా కొమ్మలు వేయడానికి సహకరిస్తాయి. మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు (4–5 ఆకులు ఉన్నప్పుడు) దీన్ని ఇస్తే ఎదుగుదల బాగుంటుంది.మొక్క కాండం దృఢంగా మారడానికి, ఆకులు వెడల్పుగా పెరగడానికి ఇందులో ఉండే నత్రజని ఎంతో అవసరం.కుండీలో ఉండే మట్టి గట్టిపడకుండా, ఈ ద్రావణం మట్టిని గుల్లగా ఉంచుతుంది. దీనివల్ల వేర్లకు గాలి ఆడి మొక్క చురుగ్గా పెరుగుతుంది.తవుడు నీటిని పులియబెట్టేటప్పుడు అందులో కొంచెం పుల్లటి మజ్జిగ కూడా కలిపితే, అది మరింత శక్తివంతంగా మారుతుంది. ఇది మొక్కలకు ‘గ్రోత్ ప్రమోటర్’లా పనిచేస్తుంది.ఈ ద్రావణాన్ని వారానికి ఒకసారి కాకుండా, 15 రోజులకు ఒకసారి మాత్రమే వాడాలి. మిగిలిన రోజుల్లో సాధారణ నీటిని పోయవచ్చు.తవుడుతో తయారు చేసిన ఫెర్మెంటేషన్ నీరు వాడటం మొదలుపెట్టిన 15 రోజుల్లోనే కూరగాయల మొక్కల ఆకుల్లో మంచి మెరుపును గమనించవచ్చు.వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేస్తున్నట్లయితే, అందులో అప్పుడప్పుడు కొంచెం ఎండు తవుడు చల్లవచ్చు. ఇది వ్యర్థాలు త్వరగా కుళ్లి ఎరువుగా మారడానికి సహాయపడుతుంది. వంటింటి వ్యర్థాల నుండి వచ్చే చెడు వాసనను అరికట్టడానికి తవుడు బాగా పనిచేస్తుంది.తవుడును కంపోస్ట్ బిన్ లోని పొరల మధ్య చల్లడం వల్ల అందులోని సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల కంపోస్ట్ తయారయ్యే సమయం తగ్గుతుంది.ఒకవేళ కిచెన్ వేస్ట్ వల్ల బిన్లో తేమ ఎక్కువగా ఉంటే, కొంచెం పొడి తవుడు చల్లితే అదనపు తేమను పీల్చుకుని, ముక్కిపోయిన వాసన రాకుండా చేస్తుంది.కంపోస్ట్ బిన్ పొడిగా ఉంటే లోపల సూక్ష్మజీవుల చర్య మందగిస్తుంది. దీనివల్ల వ్యర్థాలు ఎరువుగా మారడానికి చాలా సమయం పడుతుంది. కంపోస్ట్ పక్రియ వేగంగా జరగాలంటే అది తడిసిన స్పాంజిలా (తేమగా మరీ నీరు కారకుండా) ఉండాలి. (బిన్ లోని మట్టిని లేదా వ్యర్థాలను చేత్తో పట్టుకుని పిండినప్పుడు, ఒకటి రెండు చుక్కల నీరు వస్తే తేమ సరిగ్గా ఉన్నట్లు).తవుడును బెల్లం నీటితో కలిపి, పులియబెట్టి కంపోస్ట్ బిన్లో కొద్దిగా చల్లినట్లు వేస్తే వ్యర్థాలు చాలా త్వరగా విచ్ఛిన్నమవుతాయి. తవుడు ఫెర్మెంటేషన్ నీరు కంపోస్ట్ బిన్ కు ఒక ‘బూస్టర్‘లా పనిచేస్తుంది.తవుడును నీటిలో నానబెట్టి ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత మిగిలిన తవుడు పిప్పిని పారవేయకుండా, కంపోస్ట్ బిన్లో కలిపితే మంచి ఎరువుగా మారుతుంది.తవుడును పులియబెట్టిన నీటిలో, కూరగాయల తొక్కలు నానబెట్టిన నీటిని కూడా కలిపి మొక్కలకు పోయవచ్చు. దీనివల్ల మొక్కకు అవసరమైన అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అందుతాయి.తవుడు రైస్ మిల్లులో దొరుకుతుంది. ఒక్కసారే ఎక్కువ కొనవద్దు, పురుగులు పడతాయి. నెలకు 1 లేక 2 కేజీలు తీసుకుని వాడుకుంటే సరిపోతుంది. ఆది వాడిన తరువాత మళ్లీ తెచ్చుకోవచ్చు.తయారీ విధానం..ఒక పెద్ద ΄్లాస్టిక్ బకెట్లో 10 లీటర్ల నీరు తీసుకుని, అందులో కేజీ తవుడు మరియు బెల్లం వేసి బాగా కలపాలి. తవుడు డైరెక్ట్ గా నీటిలో వేయవచ్చు లేదా ఒక కాటన్ క్లాత్ లో మూట కట్టి వేయవచ్చు.బకెట్ పై పలచని బట్ట లేదా కొద్దిగా మూత పెట్టి నీడలో ఉంచాలి. ఎండ తగిలితే లోపల ఉన్న మేలు చేసే బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉంటుంది.3 నుండి 5 రోజుల పాటు పులియబెట్టాలి. రోజుకు రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) ఒక కర్రతో మిశ్రమాన్ని బాగా కలపాలి . దీనివల్ల గాలి ఆడి మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.5 రోజుల తర్వాత ఆ నీటిని వడకట్టి తవుడు పిప్పిని వేరు చేయాలి. ఈ తవుడు పిప్పి ని కంపోస్ట్ బిన్ లో వేయవచ్చు.తయారు చేసిన ద్రావణం చాలా గాఢంగా ఉంటుంది, కాబట్టి 1 లీటరు తవుడు ద్రావణానికి 10 లీటర్ల సాధారణ నీటిని కలిపి పలచగా చేయాలి.అంటే, తయారు చేసిన 10 లీటర్ల ద్రావణంతో మొత్తం 100 లీటర్ల ఎరువును సిద్ధం చేసుకోవచ్చు.ఎక్కువ మొక్కలు ఉంటే ఈ 100 లీటర్ల నీటిని అన్నింటికీ పోయవచ్చు. ఒకవేళ మొక్కలు తక్కువగా ఉంటే, తవుడు పరిమాణాన్ని తగ్గించి (అర కేజీ తవుడు – 5 లీటర్ల నీరు) తయారు చేసుకోవచ్చు.నల్ల తవుడు మేలు!దొరికితే నల్ల తవుడు (బ్లాక్ రైస్ బ్రాన్) వాడవచ్చు. దీనిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నల్ల తవుడులో ఆంథోసైనిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి దీనికి ఆ నలుపు లేదా ముదురు ఊదా రంగును ఇస్తాయి. ఇవి మొక్కలకు చీడపీడల నుండి సహజమైన రక్షణను అందిస్తాయి.సాధారణ తెల్ల తవుడుతో పోలిస్తే, నల్ల తవుడులోప్రోటీన్, ఫైబర్, ఇనుము వంటి ఖనిజాలు అత్యధికంగా ఉంటాయి. ఇది మొక్కల పెరుగుదలకు అవసరమైన 18 రకాల అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. నల్ల తవుడు కొంచెం ఖరీదైనది. మార్కెట్లో తక్కువగా దొరుకుతుంది. ఒకవేళ ఇది దొరక్కపోతే సాధారణ తవుడు కూడా వాడవచ్చు. అది కూడా మొక్కలకు చాలా మేలు చేస్తుంది.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఎక్కడికైనా సులభంగా చిన్న బయోచార్ యూనిట్
భూసారాన్ని పెంపొందించడంతో పాటు దీర్ఘకాలం పాటు ప్రభావం చూపటం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించటంలో ఉపయోగపడే బయోచార్ (కట్టెబొగ్గు) ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పత్తి కట్టె, కంది కట్టె, వరి ΄పొట్టు వంటి పంట వ్యర్థాలతో ఒక ప్రత్యేక పద్ధతిలో దగ్ధం చేయటం ద్వారా బయోచార్ను ఉత్పత్తి చేస్తున్నారు. అందుకు ఇప్పటికే అనేక రకాల యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా, న్న, సన్నకారు రైతులకు ఉపయోగకరంగా ఉండే రొటేటింగ్ డ్రమ్ ఆటోథర్మల్ బయోచార్ యూనిట్‌ను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధ సంస్థ, భోపాల్‌లోని కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (ఐసిఎఆర్-సిఐఎఇ) రూపొందింంది. పేటెంట్ పొందదిన ఈ యూనిట్ పంట వ్యర్థాలను బయోచార్గా మారుస్తుంది. వంద కిలోల కట్టెను వాడితే 20–35% కట్టె బొగ్గును అందించే సామర్థ్యంతో పనిచేస్తుంది. చిన్నది. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. బయోచార్ను తయారు చేసే ప్రక్రియను పైరోలిసిస్ అంటారు. పైరోలిసిస్ ఛాంబర్‌తోపాటు రెండు సర్క్యులర్ బీమ్‌లు రెండు వైపులా ఉంటాయి. రొటేటింగ్ హేండిల్, చిమ్నీతో కూడిన గ్యాస్ అవుట్లెట్, మూతతోపాటు లోడింగ్ పోర్టు, వీటన్నిటినీ మోసే ఫ్రేమ్ ఉంటాయి. ఈ బయోచార్ ఉత్పత్తి యూనిట్‌ను ఆరుబయట ఉంచి, దాంట్లో పైన ఉండే మూత తీసి పంట వ్యర్థాలను లోపల వెయ్యాలి. ఆ తర్వాత నిప్పంటించాలి. మంట చిన్నగా రగులు కుంటున్నప్పుడు ఎయిర్ బ్లోయర్ ద్వారా గాలిని సరఫరా చెయ్యాలి. ఈ ఛాంబర్ పైభాగాన ఉన్న గ్యాస్ అవుట్లెట్ ద్వారా మంట పొగ బయటకు వస్తాయి. బాగా ఎండబెట్టిన (తేమ సుమారు 10–15% ఉండే) పంట వ్యర్థాలను రియాక్టర్‌లోకి వెయ్యాలి. పూర్తిగా నింపెయ్యకుండా 80% వరకు వెయ్యాలి. రియాక్టర్ యూనిట్‌ను 3–4 సార్లు తిప్పటం ద్వారా మంట కట్టెకు అన్ని వైపులా పూర్తిగా మంట వ్యాపించేలా చెయ్యాలి. బయోచార్ 20 శాతం నుంచి 30% మధ్యలో లభిస్తుంది. సామర్థ్యం: 1.2 క్యూబిక్ మీటర్లు (సుమారు 150 కిలోల పంట వ్యర్థాల ముక్కలు) ధర: రూ. లక్ష + 18% జిఎస్టి. వివరాలకు: డాక్టర్ సందీప్ మండల్, సీనియర్ సైంటిస్ట్, ఐసిఎఆర్– సిఐఎఇ, భోపాల్, భారత్. మొబైల్: 97203 23421 -
భూసార పరిరక్షణకు విద్యార్థి సైన్యం
సాక్షి, అమరావతి: ఎరువులు, పురుగు మందుల్ని మితిమీరి వినియోగించడం వల్ల దిగుబడులు రాక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున భూసార పరీక్షలు చేయిస్తూ ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డులను అందజేస్తోంది. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు తగిన మోతాదులో ఎరువులు, మందులు వాడేలా ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పిస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసి భవిష్యత్ తరాలకు భూసార పరిరక్షణపై అవగాహన కల్పించేలా ‘స్కూల్ సాయిల్ హెల్త్ ప్రాజెక్ట్’ చేపట్టింది. భవిష్యత్ తరాలకు భూసార పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో ప్రకృతిపై ఆరాధన భావం పెంపొందించడం, వ్యవసాయంపై ఆసక్తి, ఉత్సుకత, రైతుల కష్టంపై చిన్ననాటి నుంచే అవగాహన కల్పించడం, వారిపట్ల బాధ్యతాయుత ప్రేమ, సాగుపై ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తోంది. 6–12వ తరగతి విద్యార్థులకు అవగాహన తొలి దశలో రాష్ట్రంలోని 29 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, 13 జవహర్ నవోదయ పాఠశాలలతో పాటు 8 కేంద్రీయ విద్యాలయాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని చేçపడుతున్నారు. విద్యాశాఖ సమన్వయంతో వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమం అమలు చేస్తోంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు భూసార పరిరక్షణ–చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులతో అవగాహన కల్పిస్తారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు కూడా మట్టి నమూనాల సేకరణ, రసాయనిక విశ్లేషణ, యాప్ ద్వారా ఫలితాల నమోదు, సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీపై ఎస్‌హెచ్‌సీ మొబైల్ యాప్ ద్వారా శిక్షణ ఇస్తారు. ఇందుకు అవసరమైన సాయిల్ టెస్టింగ్ పరికరాలను పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. మట్టి నమూనాల సేకరణ, పరీక్ష, విశ్లేషణ కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి పాఠశాల పరిధిలో 50 నమూనాలు ప్రతి పాఠశాల పరిధిలోని గ్రామంలో సీజన్‌కు 25 చొప్పున ఖరీఫ్, రబీ సీజన్లలో కనీసం 50 శాంపిల్స్‌కు తక్కువ కాకుండా సేకరించనున్నారు. వీటిని పాఠశాలకు అందజేసిన సాయిల్ టెస్టింగ్ కిట్ ద్వారా విశ్లేషించి ఫలితాలను మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 24వ తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. జూన్ 15న ఆయా పాఠశాలల పరిధిలోని గ్రామాల్లో సభలు నిర్వహించి రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేస్తారు. భూమిలో ఉండే పోషక లోపాలను వివరిస్తూ, కోల్పోయిన భూసారం తిరిగి పొందాలంటే భూమికి ఎలాంటి పోషకాలు అందించాలి, సాగువేళ ఏ పంటకు ఎంత మోతాదులో ఎరువులు, పురుగుల మందులు వినియోగించాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే అంశాలపై గ్రామసభల్లో శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పిస్తారు. విద్యార్థి దశ నుంచే ఆసక్తి విద్యార్థి దశ నుంచే సాగు, రైతులపై గౌరవభావం పెంపొందించడం, భూసారం పట్ల ఆసక్తి కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే అన్ని పాఠశాలలకు విస్తరిస్తాం. ఈ ప్రాజెక్ట్ కింద విద్యార్థులే స్వయంగా మట్టి నమూనాలు సేకరించి, పాఠశాలకు అందించిన కిట్ ద్వారా భూసార పరీక్షలు చేస్తారు. మట్టిలో ఏ లోపం ఉందో గుర్తిస్తారు. దీనివల్ల భూసార పరిరక్షణపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు అవగాహన కలుగుతుంది. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
అరకోటి నిధులు మట్టిపాలు..!
– రైతులకందని భూసార పరీక్ష ఫలితాలు – ఏడీఏ, ఏఓ కార్యాలయాల్లో సాయిల్హెల్త్ కార్డులు – హడావుడే తప్ప.. ఆచరణ శూన్యం కర్నూలు(అగ్రికల్చర్): భూసార పరీక్షలు తప్పనిసరి అంటూ ఊదరగొట్టిన వ్యవసాయ శాఖ.. పరీక్ష ఫలితాలను రైతులకు చేరవేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఖరీఫ్ సీజన్ మొదలై 50 రోజులు గడిచినా ఇప్పటి వరకు సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేయలేదు. జిల్లాలో ఇప్పటికే దాదాపు 2.20 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఈ పంటలు 20 నుంచి 40 రోజుల దశలో ఉన్నాయి. పైర్లలో ప్రస్తుతం పలు సూక్ష్మ పోషక లోపాలు ఉత్పన్నం అవుతున్నాయి. భూమిలో సూక్ష్మ పోషకాలైన∙బోరాన్, జింక్, ఐరన్, మెగ్నీషియంలు ఏ స్థాయిలో ఉన్నాయి.. ఎక్కువగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర విషయాలు భూసార పరీక్షల వల్ల తెలుస్తాయి. సకాలంలో రైతులకు ఈ ఫలితాలు చేరితే పంటల్లో ఏర్పడే పోషక లోపాలను సవరించుకునే అవకాశం ఉంది. ఏరువాక సందర్భంగా అక్కడక్కడ కొంతమందికి భూసార పరీక్ష ఫలితాలకు సంబంధించిన కార్డులను పంపిణీ చేశారు. తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవు. భూసార పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అరకోటికిపైగా ఖర్చు చేసింది. ఈ నిధులన్నీ మట్టిపాలయ్యాయి. ఏడీఏ, ఏఓ కార్యాలయాల్లో కార్డులు.. ఈ ఏడాది 68,098 మట్టి పరీక్షలు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా తీసుకుంది. ఇందుకోసం 68,535 మట్టి నమూనాలు సేకరించారు. వీటిని కర్నూలు, ఎమ్మిగనూరు, డోన్, నంద్యాలలోని భూసార పరీక్ష కేంద్రాలకు పరీక్షించారు. ఒక మట్టి నమూనా పరీక్షలు చుట్టుపక్కల భూములకూ వర్తిస్తాయి. ఈ ప్రకారం జిల్లాలో 2 లక్షల మంది రైతులకు భూమి ఆరోగ్య స్థితి కార్డులు (సాయిల్ హెల్త్‌కార్డులు) పంపిణీ చేయాల్సి ఉంది. ఈ సారి ఈ కార్డులను ప్రత్యేకంగా ల్యామినేషన్ చేయించి పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు 80 వేల కార్డులు ప్రింటు వేయించి, ల్యామినేషన్ చేయించి వాటిని ఏడీఏలకు పంపారు. అక్కడి నుంచి మండల వ్యవసాయ అధికారులు తీసుకెళ్లి రైతులకు పంపిణీ చేయాల్సింది. భూసార పరీక్షలను ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ శేషారెడ్డి పర్యవేక్షిస్తారు. ఒక్కో కార్డుకు దాదాపు రూ.10 వ్యయం చేసి ముద్రించి ల్యామినేషన్ చేయించారు. అయితే ఇవి ఏడీఏ, ఏఓ కార్యాలయాల్లో మూలకు పడిఉన్నాయి. ఖరీఫ్ మొదలై 50 రోజులు దాటినా మట్టిపరీక్ష ఫలితాలు జిల్లా మొత్తం మీద వెయ్యి మందికి కూడా చేరలేదు. నిధులు వ«థా.. ఒక్క భూసార పరీక్షకు వ్యవసాయ శాఖ రూ.32 ఖర్చు చేస్తుంది. 68,535 మట్టి పరీక్షలకు రూ.21.93 లక్షలు ఖర్చు చేసింది. ఒక పరీక్షకు కూడా మూడు కార్డులు తయారు చేసి రైతులకు పంపిణీ చేయాలి. ఇలా కార్డుల ముద్రణ ల్యామినేషన్‌కు రూ.15 ప్రకారం ఖర్చు చేస్తోంది. ఇందుకోసం రూ.30 లక్షలు ఖర్చు చేస్తోంది. మొత్తంగా భూసార పరీక్షల కోసం జిల్లాలో రూ.51.93 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇంత ఖర్చుపెట్టి పరీక్షలు చేసి, కార్డులు ముద్రించి, ల్యామినేషన్ చేయించిన వాటిని రైతులకు సకాలంలో చేర్చితేనే ఫలితం దక్కినట్లు. అయితే ఇవి రైతులకు చేరడం లేదు. ఈ ఏడాదే కాదు. ప్రతి ఏటా ఇదే తంతు నడుస్తోంది. భూసార పరీక్షలను ప్రభుత్వం చేస్తున్న నిధుల వ్యయం బూడిదలో పోసిన పన్నీరులా అవుతోంది. భూ ఆరోగ్య స్థితి కార్డులు పంపతున్నాం: శేషారెడ్డి, ఏడీఏ ఎమ్మిగనూ, భూసార పరీక్ష కేంద్రం ఈ ఏడాది 68,535 మట్టి పరీక్షలు చేశాం. ఒక పరీక్షకు మూడు కార్డులను ముద్రిస్తున్నాం. ఒక పరీక్షకు మూడు కార్డుల రూపంలో రైతులకు పంపిణీ చేస్తున్నాం. కార్డులు ప్రింట్ తీసి ల్యామినేషన్ చేయించి ఏడీఏలకు పంపుతున్నాం. ఇప్పటి వరకు 82 వేల కార్డులు పంపాం. ఏడీఏల నుంచి ఏఓలు తీసుకెళ్లి రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది.


