సాగుబడి
పర్యావరణ మార్పులకు మట్టిలోని సూక్ష్మజీవులు (మైక్రోబయోమ్) అత్యంత వేగంగా స్పందిస్తాయి
మొక్కలు ఎండిపోకముందే మట్టిలో ప్రమాద సంకేతాలు కనిపిస్తాయి
ఎడారీకరణ ముప్పును ‘సూక్ష్మజీవుల నిఘా వ్యవస్థ’ ముందుగానే పసిగట్టేస్తుంది
శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో వెల్లడి
వ్యవసాయంలో పంట ఎదుగుదల, దిగుబడి కేవలం వేసే ఎరువులు, నీటిపైనే కాకుండా మట్టిలోని ‘అజ్ఞాత సూక్ష్మజీవుల ప్రపంచం’ పైనే ఆధారపడి ఉంటుంది. తాజా పరిశోధనా వివరాల ప్రకారం.. సారవంతమైన సాగు భూములు క్రమంగా ఎడారులుగా మారిపోవడాన్ని (ఎడారీకరణ) అంటాం. ఈ ముప్పును మట్టిలో సూక్ష్మజీవులు ముందే పసిగడతాయి. నీటి కరువుతో మొక్కలు చనిపోవటానికి ఎంతో ముందే నేలలోని సూక్ష్మజీవులు కనిపెట్టి హెచ్చరిస్తాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
సూక్ష్మజీవుల సామ్రాజ్యం
మట్టిలో ఉండే ఒకే ఒక్క ఇసుక రేణువుపై కూడా వేల సంఖ్యలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగస్), వైరస్‌లు కలిసి ఒక మహానగరం లాంటి వ్యవస్థను (మైక్రోబయోమ్) నిర్మించుకుంటాయి. ఇవి సేంద్రియ పదార్థాలను కుళ్ళింపజేసి పంటలకు అవసరమైన నత్రజని, భాస్వరం వంటి పోషకాలను వాటి వేర్లకు అందిస్తాయి. అంతేకాకుండా, వాతావరణంలోని కర్బనాన్ని నేలలో నిల్వ ఉంచడంలో (కార్బన్ సైకిల్) కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం వైద్యరంగంలో వాడుతున్న 70%–80% యాంటీబయాటిక్ ఔషధాలు కూడా నేలలోని ‘స్ట్రెప్టోమైసిస్’ వంటి బ్యాక్టీరియా నుంచే ఉత్పత్తి అవుతుండటం గమనార్హం.
‘‘మట్టిలో ఉండే ఒకే ఒక్క ఇసుక రేణువుపై కూడా వేల సంఖ్యలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగస్), వైరస్‌లు కలిసి ఒక మహానగరం లాంటి వ్యవస్థను (మైక్రోబయోమ్) నిర్మించుకుంటాయి. ఇవి సేంద్రియ పదార్థాలను కుళ్ళింపజేసి పంటలకు అవసరమైన నత్రజని, భాస్వరం వంటి పోషకాలను వాటి వేర్లకు అందిస్తాయి..’’
మొక్కల కంటే వేగంగా స్పందన
సాధారణంగా నేలలో తేమ తగ్గినా, ఉష్ణోగ్రత పెరిగినా లేదా పీహెచ్ (క్షార/ఆమ్ల స్వభావాన్ని తెలిపే ఉదజని సూచిక) మారినా ఆ ప్రభావం పంటపై వెంటనే పైకి కనిపించదు. మొక్కలు వాలిపోవడం లేదా ఎండిపోవడం ప్రారంభించే సమయానికే నేల స్వభావం చాలావరకు దెబ్బతింటుంది. అయితే, నేలలోని సూక్ష్మజీవులు ఈ మార్పులను మానవుల కంటికి కనిపించకముందే గుర్తిస్తాయి. వాతావరణ ప్రతికూలతలకు అత్యంత వేగంగా స్పందిస్తాయి. పరిస్థితికి అనుగుణంగా తమ సంఖ్యను, కార్యకలాపాలను మార్చుకుంటాయని పరిశోధకులు గుర్తించారు.
ఎడారీకరణకు అడ్డుకట్ట
దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా విశ్వవిద్యాలయానికి చెందిన సూక్ష్మజీవ పర్యావరణ శాస్త్రవేత్త మార్క్ వాన్ గోథెమ్ ఎడారీకరణకు అడ్డుకట్ట వేసే మార్గాలను తన పరిశోధనల ద్వారా అన్వేషిస్తున్నారు. ఆఫ్రికాలోని సహారా, నమీబ్, కలహరి, సాహెల్ ఎడారులలో మట్టి నమూనాలను సేకరించి ‘మెటాజెనోమిక్ సీక్వెన్సింగ్’ ద్వారా పరిశోధిస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే..
మట్టిలో ఒక నిర్దిష్ట జాతి బ్యాక్టీరియా అంతరించిపోతే లేదా పంటలకు పోషకాలను అందించే జీవక్రియలు ఆగిపోతే, ఆ నేల క్షీణదశకు చేరుతోందని, భూసారం ఆందోళనకర స్థాయిలో అడుగంటుతున్నదని ముందే పసిగట్టవచ్చు.
ఈ ముందస్తు సమాచారం ఆధారంగా భూములు పూర్తిగా ఎడారిగా మారకముందే రైతులు, శాస్త్రవేత్తలు దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం లభిస్తుంది.
రైతులు ఏం చెయ్యాలి?
పంట భూముల్లో సూక్ష్మజీవరాసి నశించి భూసారం కోల్పోకుండా ఉండాలంటే రైతులు వ్యవసాయ పద్ధతులను అనుసరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. రసాయన ఎరువులు, పురుగుమందుల అతి వినియోగం వల్ల నేలలోని సహజ సూక్ష్మజీవుల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. పంట పొలాలను రక్షించుకోవాలంటే ఈ పనులు చెయ్యాలి:
1. పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రియ ఎరువులు, జీవామృతం వంటి దేశీ పద్ధతుల ద్వారా నేలలోని సూక్ష్మజీవులను వృద్ధి చేయాలి.
2. పంట మార్పిడి పద్ధతులు పాటించి నేల సజీవంగా ఉండేలా చూసుకోవాలి.
నేలలో సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉంటేనే వర్షాభావ పరిస్థితులను, వాతావరణ మార్పులను తట్టుకుని సాగు భూమి పచ్చగా నిలబడుతుందని ఈ పరిశోధన తేటతెల్లం చేస్తోంది.
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


