breaking news
Sustainable Agriculture Center
-
ఆరోగ్యకరమైన నేలే మనిషి ఆరోగ్యానికి మూలం
నీరు, గాలి, వాతావరణ నాణ్యత క్షీణించడానికి నిస్సారమైన మట్టి దారితీస్తుంది. నేల ఆరోగ్యం క్షీణించడం వల్ల మొక్కలు, జంతు వులు, మానవుల ఆరోగ్యం దెబ్బతింటుంది. నేల స్వయంగా ఒక జీవ వ్యవస్థ. అలాగే ఇతర జీవరాశులకు ఆధారభూతమైనది కూడా. నేల, మొక్కలు, జంతువులు, మానవులు, పర్యావరణ వ్యవస్థ, భూగ్రహం ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడివడి విడదీయలేని ‘ఏకైక ఆరోగ్యం’ (వన్ హెల్త్)గా ఉంటాయి.‘ఆరోగ్యమైన నేల– ఆరోగ్యమైన మొక్క– ఆరోగ్యమైన జంతువు– ఆరోగ్యమైన మనిషి’ అనే భావనే వన్ హెల్త్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనుషులు, జంతువులు, మొక్కలు, పర్యా వరణం పరస్పరం అనుసంధానమై ఉంటాయి. ఈ నాలుగు ఆరో గ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ‘ఏకైక ఆరోగ్యం’ భావనను, భారతదేశంలో జరిగిన జీ–20 సమావేశాలలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక టీ స్పూన్ ఆరోగ్యకరమైన నేలలో కోట్ల నుండి వందల కోట్ల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి.వీటిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగి), యాక్టినోమైసెట్స్, ప్రోటో జోవా, నులిపురుగులు (నీమటోడ్లు), వానపాములు వంటి జీవులు ప్రధానమైనవి. ఈ సూక్ష్మజీవులు, నేల జీవులు కలిసి సేంద్రియ పదార్థాలను కుళ్లించి మొక్కలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. నేలలో ఉండే ఖనిజాలు (జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్ వంటివి) మొక్కల వేర్ల ద్వారా గ్రహించబడి ధాన్యాలు, కూర గాయలు, పండ్లు ఇతర ఆహార పంటలలో నిల్వ అవుతాయి. ఈ పంటలను మనం ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆ ఖనిజాలు, పోషకాలు మన శరీరానికి అందుతాయి. ‘నేలలో పోష కాలు సమృద్ధిగా ఉంటేనే ఆహారం పోషకవంతంగా ఉంటుంది; ఆహారం పోషకవంతంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.’నేల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతులుసేంద్రియ పదార్థాల వినియోగం నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పశువుల ఎరువు, కంపోస్ట్, వర్మీకంపోస్ట్, గ్రీన్ మెన్యూర్, బయోచార్ వంటి సేంద్రియ పదార్థాలు నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచి, నేల సారాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వృద్ధిని ప్రోత్సహించి, మొక్కలకు అవసరమైన పోషకాలను క్రమంగా అందుబాటులోకి తీసుకు వస్తాయి. పంటల మార్పిడి మరో పద్ధతి. ఒకే భూమిలో ఒకే పంటను వరుసగా సాగు చేయకుండా, వివిధ రకాల పంటలను క్రమపద్ధతిలో సాగు చేయాలి. పప్పు ధాన్యాలైన శనగ, పెసర, మినుము, కంది, అలసంద వంటివాటి వేర్లపై ఉండే రైజోబియం అనే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి, మొక్కలు ఉపయోగించుకునే రూపంలో నేలలో స్థిరీకరిస్తాయి. మరీ ముఖ్యంగా పంట అవశే షాలను కాల్చకూడదు. కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కార్బన్, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పోష కాలు నష్టపోతాయి. పంట అవశేషాలను మల్చింగ్ చేయడం ద్వారా నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి, కలుపు మొక్కల పెరుగు దల తగ్గుతుంది. అవసరానికి మించి తరచుగా దుక్కి దున్నడం వల్ల నేల సహజ నిర్మాణం దెబ్బతింటుంది. నేలలో నిల్వ ఉన్న సేంద్రియ కార్బన్ వేగంగా విచ్ఛిన్నమైపోతుంది. అతి దుక్కిని నివారించాలి.‘ఏకైక ఆరోగ్యం’ భావన విజయవంతం కావడంలో రైతు పాత్ర కీలకం. రైతు అనుసరించే వ్యవసాయ పద్ధతులే నేల, మొక్కలు, పశువులు, పర్యావరణం, చివరకు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. నేల ఆరోగ్యాన్ని కాపాడటం అనేది రైతు పొలం దిగుబడికే కాదు, సమాజ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు భవిష్యత్ తరాలకు చేసే గొప్ప పెట్టుబడి.– డా. కె. తేజస్వరరావు, డా, ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, డా. బి. సహదేవ రెడ్డి, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు -
రైతన్నకు మూడు లాభాలు.. ఇదే అగ్రివోల్టాయిక్స్!
ఎండ తీవ్రత నానాటికీ పెరుగుతున్న వేళ.. వ్యవసాయ రంగానికి, ఎండనక వాననక పొలాల్లో చెమటోడ్చే రైతులు, రైతు కూలీలకు ఊరటనిచ్చే సరికొత్త మార్గం వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ భూముల్లో పంటల పైన సౌర ఫలకాలు (సోలార్ ప్యానెల్స్) అమర్చే ‘అగ్రివోల్టాయిక్స్’ విధానం ద్వారా కేవలం విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాకుండా, పంట దిగుబడులు కూడా రైతుకు అందుతాయి. అయితే, ఈ రెంటికీ మించి పర్యావరణపరమైన సౌలభ్యాలు కూడా అదనంగా లభిస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. సౌర ఫలకాల మధ్య పంటలు సాగు చేసే పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలకు తీవ్రమైన ఉష్ణతాపం నుంచి ఉపశమనం కూడా లభిస్తుందని అమెరికాకు చెందిన ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. ‘జర్నల్ ఆఫ్ అడ్వాన్సెస్ ఇన్ మోడలింగ్ ఎర్త్ సిస్టమ్స్’ పత్రికలో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి.నీటి ఆదా.. ఉష్ణోగ్రత నియంత్రణపరిశోధకులు కంప్యూటర్ సిమ్యులేషన్ నమూనా ద్వారా టొమాటో తోటలపై సోలార్ ప్యానెళ్ల ప్రభావాన్ని విశ్లేషించారు. ప్యానెళ్ల నీడలో పెరిగే టొమాటో ఆకుల ఉష్ణోగ్రత సాధారణ తోటలతో పోలిస్తే సగటున 1.84 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. ముఖ్యంగా మధ్యాహ్నపు మండుటెండల్లో ఏకంగా 7.56 డిగ్రీల వరకు చల్లదనం పెరిగింది. ఈ చల్లని మైక్రో–క్లైమేట్ (సూక్ష్మ వాతావరణం) వల్ల ఆకుల నుంచి నీటి ఆవిరి కావడం 22.4 శాతం తగ్గింది. అలాగే పంట, నేల నుంచి జరిగే మొత్తం తేమ నష్టం ఏకంగా 42.6 శాతం వరకు తగ్గింది. దీనివల్ల వేసవిలో సాగునీటి వినియోగాన్ని భారీగా ఆదా చేసుకోవచ్చని స్పష్టమైంది.రైతు కూలీలకు వడదెబ్బ నుంచి రక్షణసాధారణంగా తీవ్రమైన ఎండల వల్ల పొలాల్లో పనిచేసే కూలీలు వడదెబ్బకు గురికావడం, అలసటతో పనిచేసే శక్తి, సమయం తగ్గిపోతూ ఉంటుంది. ఆ మేరకు పని ఉత్పాదకత తగ్గుతుంది. అయితే, ఈ ప్యానెళ్ల నీడలో పనిచేసే శ్రామికులకు సగటున 4.46 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత తగ్గిన అనుభూతి కలుగుతుందని గుర్తించారు. తీవ్ర ఎండలో 39 డిగ్రీలుగా ఉండే తాపం, ప్యానెళ్ల కింద సుమారు 35 డిగ్రీలకు తగ్గిపోతుంది. ఇది శ్రామికుల ఆరోగ్యానికి, పనితీరు మెరుగుదలకు దోహదం చేస్తుంది.పంటలకు ప్యానెళ్లకూ ప్రయోజనంఅగ్రివోల్టాయిక్స్ పద్ధతిలో కేవలం పంటలకే కాక, సోలార్ ప్యానెళ్లకు కూడా లబ్ధి చేకూరుతుంది. పంటల నుంచి వెలువడే తేమ గాలిని చల్లబరచడం వల్ల సోలార్ ప్యానెళ్ల ఉష్ణోగ్రత 5.6 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. ఫలితంగా అధిక వేడిమి వల్ల ప్యానెళ్లలో జరిగే విద్యుత్ సామర్థ్య నష్టం 15 శాతం వరకు తగ్గి, అధిక విద్యుత్ ఉత్పత్తికి కారణమైంది. ప్యానెళ్ల వల్ల పంటకు సూర్యరశ్మి 47 శాతం తగ్గినా, కిరణజన్య సంయోగక్రియ కేవలం 31 శాతమే తగ్గిందని, చల్లటి వాతావరణం వల్ల పంట ఎదుగుదల బాగానే ఉంటుందని పరిశోధకులు వివరించారు. భూగర్భ జలాలు తరుగుతున్న ప్రస్తుత రోజుల్లో విద్యుత్, నీరు, దిగుబడి మూడింటినీ కాపాడుకోవడానికి ‘అగ్రివోల్టాయిక్స్’ ఒక మేలైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
పోషకాల దుర్వినియోగంతో ముప్పు! రైతులకు ఎఫ్ఏఓ హెచ్చరిక!
రైతుల పొలాల్లో పోషకాల అసమతుల్యత లేదా దుర్వినియోగం వల్ల నేల సారం క్రమంగా క్షీణిస్తోంది. అవసరం ఎంతో తెలుసుకోకుండా కొన్ని ఎరువులను ఎక్కువ ఎవయ్యటం, కొన్నిటిని తక్కువ వెయ్యటం సమస్య. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) రూపొందించిన ‘స్టేటస్ ఆఫ్ ది వరల్డ్స్ సాయిల్ రిసోర్సెస్’ తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నేల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రధాన సమస్యల్లో మొదటిది: ‘నీరు, గాలి వల్ల పైపొర మట్టి కొట్టుకుపోవటం’. రెండోది: ‘నేలలోని సహజ సేంద్రియ పదార్థం, సారం తగ్గిపోవటం’. ‘పోషకాల నిర్వహణ లోపం లేదా దుర్వినియోగం’ (న్యూట్రియంట్ మిస్మేనేజ్మెంట్) మూడో అతిపెద్ద ముప్పుగా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా 63 శాతం ప్రాంతాలు, ఉప్రపాంతాలు పోషకాల దుర్వినియోగాన్ని అరికట్టే స్థానికంగా అవసరమైన సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించటంలో దారుణంగా విఫలమవుతున్నాయని ఎఫ్ఏఓ నివేదిక ఎత్తిచూపింది. 50 శాతం ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడకపోగా క్షీణిస్తున్నాయని పేర్కొంది. ఉత్తర అమెరికాలో మాత్రమే మాత్రమే పోషకాల దుర్వినియోగాన్ని అరికట్టే పద్ధతుల అమలులో మెరుగ్గా ఉందని ఎఫ్ఏఓ తెలిపింది.రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలునేలలో పోషకాల అసమతుల్యతకు సంబంధించి ఎఫ్ఏఓ నివేదికలో మూడు ముఖ్య అంశాలను ప్రస్తావించింది:1. పోషకాల కొరత (న్యూట్రియెంట్ మైనింగ్): పంటల ద్వారా గ్రహించే లేదా నేల నుంచి ఆహారోత్పత్తుల ద్వారా మనం పొందే పోషకాల కంటే నేలకు తక్కువ మోతాదులోనే ఎరువులను అందించటం. దీనివల్ల కాలక్రమేణా నేలలోని సహజ పోషక నిల్వలు, సేంద్రియ పదార్థం పూర్తిగా తగ్గిపోతాయి.2. ఎరువుల అధిక వినియోగం (న్యూట్రియెంట్ ఎక్సెస్): పంటకు అవసరమైన దానికంటే ఎక్కువగా నత్రజని, భాస్వరం ఎరువులు వేయటం. మితిమీరిన ఈ రసాయనాలు కాలువలు, భూగర్భ జలాల్లో చేరి నీటిని కలుషితం చేస్తున్నాయి. నైట్రేట్లు మానవ ఆరోగ్యానికి ముప్పుగా మారుతుండగా, నత్రజని అధిక వాడకం వల్ల ప్రమాదకర వాయువులైన నైట్రస్ ఆక్సైడ్, అమ్మోనియా విడుదలై వాతావరణం దెబ్బతింటోంది.3. నేల ఆమ్లీకరణ (సాయిల్ అసిడిఫికేషన్): ఆమ్ల గుణం కలిగిన రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల నేలలో ఆమ్లతత్వం పెరిగి, నేలలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి నేల సారం నాశనమవుతోంది.భారత్, దక్షిణాసియా దేశాల్లో పరిస్థితిదక్షిణాసియా ప్రాంతంలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లో పంటలకు అవసరానికి మించి నత్రజని, భాస్వరం ఎరువులను వేస్తున్నట్లు ఎఫ్ఏఓ నివేదిక వెల్లడించింది. మరోవైపు, పంట కోతల అనంతరం మిగిలిన పంట వ్యర్థాలను (వరి గడ్డి, చొప్ప, పత్తి కట్టె, కంది కట్టె వంటివి ) పొలం మట్టిలో తిరిగి కలిసేలా చెయ్యకుండా పూర్తిగా తొలగించటం వల్ల నేలలో పొటాషియం వంటి పోషకాలు వేగంగా తరిగిపోతున్నాయి.భవిష్యత్తుపై ప్రభావం.. నివారణ మార్గాలుపోషకాల అసమతుల్యత వల్ల వ్యవసాయం అస్తవ్యస్తమవుతుంది. అంతేకాదు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన ‘ఆకలి నిర్మూలన’, ‘మంచి ఆరోగ్యం’, ‘స్వచ్ఛమైన నీరు’, ‘వాతావరణ పరిరక్షణ చర్యలు’, ‘భూమిపై జీవవైవిధ్యం’ దెబ్బతింటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 63 శాతం ప్రాంతాల్లో స్థిరమైన నేల నిర్వహణ పద్ధతుల అమలు చాలా నాసిరకంగా ఉంది.రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వేయటం ఆపాలి. పంట అవసరాన్ని బట్టి కచ్చితమైన మోతాదులో ఎరువులు అందించే ‘సైట్–స్పెసిఫిక్ న్యూట్రియెంట్ మేనేజ్మెంట్’ (ఎస్ఎస్ఎన్ఎం), భూసార పరీక్షలు, సేంద్రియ ఎరువుల వాడకం, పంట వ్యర్థాల పునర్వినియోగం వంటి చర్యలను సమర్థవంతంగా అమలు చెయ్యటం ద్వారానే నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నివేదిక స్పష్టం చేస్తోంది.మన దేశంలోనూ దుర్వినియోగమే!భారత వ్యవసాయ రంగంలో పోషకాల దుర్వినియోగం తీవ్రంగా ఉంది. భారతదేశం సహా దక్షిణాసియా ప్రాంతంలో ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టే సుస్థిర వ్యవసాయ పద్ధతుల అమలు సరిగ్గా లేకపోవటంతో నేల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక హెచ్చరించింది. ప్రధానంగా రెండు విరుద్ధ సమస్యలతో భారతీయ వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.భారతదేశంలో రైతులు పంటల అవసరానికి మించి నత్రజని, భాస్వరం ఎరువులను విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల ఎరువులు వృథా అవ్వడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితం కావటం, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు, అమ్మోనియా విడుదల కావటం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతోంది.పంట కోతల అనంతరం మిగిలిన పంట వ్యర్థాలను పొలం నుంచి పూర్తిగా తొలగించటం వల్ల నేలలో సహజంగా ఉండే పొటాషియం నిల్వలు వేగంగా క్షీణిస్తున్నాయి.- నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ఇవి కూడా చదవండి: అమెరికా ఉద్యోగాన్ని కాదని వ్యవసాయం..! ఏకంగా ఆరుసార్లు దివాళ అంచుకు.. -
Sagubadi: పంట వేర్లకు పోషకాలు అందించే అజ్ఞాత సైన్యం..
వ్యవసాయంలో పంట ఎదుగుదల, దిగుబడి కేవలం వేసే ఎరువులు, నీటిపైనే కాకుండా మట్టిలోని ‘అజ్ఞాత సూక్ష్మజీవుల ప్రపంచం’ పైనే ఆధారపడి ఉంటుంది. తాజా పరిశోధనా వివరాల ప్రకారం.. సారవంతమైన సాగు భూములు క్రమంగా ఎడారులుగా మారిపోవడాన్ని (ఎడారీకరణ) అంటాం. ఈ ముప్పును మట్టిలో సూక్ష్మజీవులు ముందే పసిగడతాయి. నీటి కరువుతో మొక్కలు చనిపోవటానికి ఎంతో ముందే నేలలోని సూక్ష్మజీవులు కనిపెట్టి హెచ్చరిస్తాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.సూక్ష్మజీవుల సామ్రాజ్యంమట్టిలో ఉండే ఒకే ఒక్క ఇసుక రేణువుపై కూడా వేల సంఖ్యలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగస్), వైరస్లు కలిసి ఒక మహానగరం లాంటి వ్యవస్థను (మైక్రోబయోమ్) నిర్మించుకుంటాయి. ఇవి సేంద్రియ పదార్థాలను కుళ్ళింపజేసి పంటలకు అవసరమైన నత్రజని, భాస్వరం వంటి పోషకాలను వాటి వేర్లకు అందిస్తాయి. అంతేకాకుండా, వాతావరణంలోని కర్బనాన్ని నేలలో నిల్వ ఉంచడంలో (కార్బన్ సైకిల్) కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం వైద్యరంగంలో వాడుతున్న 70%–80% యాంటీబయాటిక్ ఔషధాలు కూడా నేలలోని ‘స్ట్రెప్టోమైసిస్’ వంటి బ్యాక్టీరియా నుంచే ఉత్పత్తి అవుతుండటం గమనార్హం.‘‘మట్టిలో ఉండే ఒకే ఒక్క ఇసుక రేణువుపై కూడా వేల సంఖ్యలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగస్), వైరస్లు కలిసి ఒక మహానగరం లాంటి వ్యవస్థను (మైక్రోబయోమ్) నిర్మించుకుంటాయి. ఇవి సేంద్రియ పదార్థాలను కుళ్ళింపజేసి పంటలకు అవసరమైన నత్రజని, భాస్వరం వంటి పోషకాలను వాటి వేర్లకు అందిస్తాయి..’’మొక్కల కంటే వేగంగా స్పందనసాధారణంగా నేలలో తేమ తగ్గినా, ఉష్ణోగ్రత పెరిగినా లేదా పీహెచ్ (క్షార/ఆమ్ల స్వభావాన్ని తెలిపే ఉదజని సూచిక) మారినా ఆ ప్రభావం పంటపై వెంటనే పైకి కనిపించదు. మొక్కలు వాలిపోవడం లేదా ఎండిపోవడం ప్రారంభించే సమయానికే నేల స్వభావం చాలావరకు దెబ్బతింటుంది. అయితే, నేలలోని సూక్ష్మజీవులు ఈ మార్పులను మానవుల కంటికి కనిపించకముందే గుర్తిస్తాయి. వాతావరణ ప్రతికూలతలకు అత్యంత వేగంగా స్పందిస్తాయి. పరిస్థితికి అనుగుణంగా తమ సంఖ్యను, కార్యకలాపాలను మార్చుకుంటాయని పరిశోధకులు గుర్తించారు.ఎడారీకరణకు అడ్డుకట్టదక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా విశ్వవిద్యాలయానికి చెందిన సూక్ష్మజీవ పర్యావరణ శాస్త్రవేత్త మార్క్ వాన్ గోథెమ్ ఎడారీకరణకు అడ్డుకట్ట వేసే మార్గాలను తన పరిశోధనల ద్వారా అన్వేషిస్తున్నారు. ఆఫ్రికాలోని సహారా, నమీబ్, కలహరి, సాహెల్ ఎడారులలో మట్టి నమూనాలను సేకరించి ‘మెటాజెనోమిక్ సీక్వెన్సింగ్’ ద్వారా పరిశోధిస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే..మట్టిలో ఒక నిర్దిష్ట జాతి బ్యాక్టీరియా అంతరించిపోతే లేదా పంటలకు పోషకాలను అందించే జీవక్రియలు ఆగిపోతే, ఆ నేల క్షీణదశకు చేరుతోందని, భూసారం ఆందోళనకర స్థాయిలో అడుగంటుతున్నదని ముందే పసిగట్టవచ్చు.ఈ ముందస్తు సమాచారం ఆధారంగా భూములు పూర్తిగా ఎడారిగా మారకముందే రైతులు, శాస్త్రవేత్తలు దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం లభిస్తుంది.రైతులు ఏం చెయ్యాలి?పంట భూముల్లో సూక్ష్మజీవరాసి నశించి భూసారం కోల్పోకుండా ఉండాలంటే రైతులు వ్యవసాయ పద్ధతులను అనుసరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. రసాయన ఎరువులు, పురుగుమందుల అతి వినియోగం వల్ల నేలలోని సహజ సూక్ష్మజీవుల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. పంట పొలాలను రక్షించుకోవాలంటే ఈ పనులు చెయ్యాలి:1. పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రియ ఎరువులు, జీవామృతం వంటి దేశీ పద్ధతుల ద్వారా నేలలోని సూక్ష్మజీవులను వృద్ధి చేయాలి.2. పంట మార్పిడి పద్ధతులు పాటించి నేల సజీవంగా ఉండేలా చూసుకోవాలి. నేలలో సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉంటేనే వర్షాభావ పరిస్థితులను, వాతావరణ మార్పులను తట్టుకుని సాగు భూమి పచ్చగా నిలబడుతుందని ఈ పరిశోధన తేటతెల్లం చేస్తోంది.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
సంపూర్ణ సేంద్రియ గ్రామాలు!
ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ జిల్లాలో 110 గిరిజన గ్రామాలు పిజిఎస్ సేంద్రియ సర్టిఫికేషన్ పొందాయి. సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రాని(సిఎస్ఎ)కి చెందిన రీజినల్ కౌన్సెల్ ఈ సర్టిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల సిఎస్ఎకు ప్రతిష్టాత్మక ‘జైవిక్ ఇండియా’ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా సిఎస్ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీ వీ రామాంజనేయులుతో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల వాడకం పూర్తిగా మానుకొని ప్రకృతి /సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ఆరోగ్యదాయకంగా ఆహారోత్పత్తి చేసే రైతులకు ప్రత్యేక గుర్తింపునిచ్చేదే సేంద్రియ సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేషన్ ద్వారా మెరుగైన ధరకు పంట దిగుబడులను అమ్ముకునే అవకాశం కలుగుతుంది. రైతు వ్యక్తిగతంగా సర్టిఫికెట్ పొందొచ్చు. నలుగురితో కలసి సహకార సంఘంగా లేదా రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి సమష్టిగా సేంద్రియ సర్టిఫికేషన్ పొందవచ్చు. ఒంటరిగా సర్టిఫికేషన్ పొందే కంటే సంఘంగా పొందటం సులభం. ఇంకా చెప్పాలంటే, గ్రామంలో రైతులందరూ కలసి సేంద్రియ / ప్రకృతి వ్యవసాయం దిశగా నడిస్తే పరివర్తన దశలో ఎదురయ్యే సమస్యలను సులువుగా ఎదుర్కోవచ్చు. అంతేకాదు, మార్కెటింగ్‌కు అవసరమైన సేంద్రియ సర్టిఫికేషన్‌ను ఒక గ్రామంలో రైతులంతా కలసి ఊరుమ్మడిగా అయితే తొందరగానే పొందవచ్చు. విడిగా అయితే మూడేళ్ల ప్రక్రియ. ఊళ్లో రైతులంతా కలిస్తే ఆర్నెల్లు చాలు. దీన్నే ‘లార్జ్ ఏరియా సర్టిఫికేషన్’ అని పిలుస్తున్నారు. ఈ విషయంలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ జిల్లాలో గత ఐదేళ్లుగా రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం ఐదేళ్ల క్రితమే మానేసిన 110 గ్రామాలు సేంద్రియ సర్టిఫికేషన్ గుర్తింపు పొందాయి. ఈ గ్రామాల్లోని మొత్తం 10,264 మంది రైతులు 65,279 హెక్టార్లలో సేంద్రియ పంటలు పండిస్తున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ) రీజినల్ కౌన్సెల్ ఈ సర్టిఫికేషన్ ఇచ్చింది. చదవండి: Safer Internet Day 2025 భద్రత... బాధ్యత... గౌరవం!మరో 121 గ్రామాలకు సర్టిఫికేషన్ప్రాసెస్ వివిధ దశల్లో ఉందని సిఎస్ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. రామాంజనేయులు తెలిపారు. శిక్షణ, తనిఖీలకు హెక్టారుకు రూ. 700ల చొప్పున పిజిఎస్ సర్టిఫికేషన్‌కు ఖర్చవుతుందన్నారు. గ్రామం మొత్తం సేంద్రియ సర్టిఫికేషన్ పొందటం అంత సులువేమీ కాదు. దశలవారీ పరీక్షల్లో రసాయనిక అవశేషాలు లేవని తేలితేనే సర్టిఫికేషన్ ఇస్తారు. లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ రావాలంటే మొదట రైతులు గత ఐదేళ్లుగా పూర్తిగా సేంద్రియంగానే పంటలు పండిస్తున్నామని ప్రతిజ్ఞ చేయాలి. సర్పంచ్ కూడా బాధ్యత తీసుకొని డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ వూళ్లో రసాయనిక ఎరువులు, పురుగు/కలుపు మందులు అమ్మే దుకాణం లేదని జిల్లా వ్యవసాయ అధికారి సర్టిఫై చెయ్యాలి. ఇవన్నీ అయ్యాక రీజినల్ కౌన్సెల్ పరీక్షలు చేసి సర్టిఫై చేస్తుంది.ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా పురస్కారంసుస్థిర వ్యవసాయ కేంద్రాని(సిఎస్ఎ)కి ఇటీవల ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా రీజినల్ కౌన్సెల్ పురస్కారం లభించింది. ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (ఐసీసీఓఏ) గత ఐదేళ్లుగా ‘జైవిక్ ఇండియా’ పురస్కారాలను సేంద్రియ రైతులతో పాటు సర్టిఫికేషన్ సేవలందిస్తున్న రీజినల్ కౌన్సెళ్లకు కూడా ఏటేటా పురస్కారాలను ప్రదానం చేస్తోంది. బెంగళూరులో ఇటీవల జరిగిన అంతర్జాతీయ సేంద్రియ, చిరుధాన్యాల ప్రదర్శనలో జాతీయ స్థాయిలో ఉత్తమ రీజినల్ కౌన్సెల్‌గా సిఎస్ఎ ఎంపికైంది. సిఎస్ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు, సిఎస్ఎ ప్రోగ్రామ్ డైరెక్టర్ (సర్టిఫికేషన్) చంద్రకళ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.క్లైమెట్ ఛేంజ్ నేపథ్యంలో సుస్థిర సేద్యం అనివార్యంఛత్తీస్ఘడ్ దంతెవాడ జిల్లాలో ఐదేళ్లుగా రసాయనాల జోలికి పోని 110 గ్రామాల్లో రైతులందరికీ పిజిఎస్ సేంద్రియ సర్టిఫికేషన్ ఇచ్చాం. వారు ఎక్కువగా వరి ధాన్యమే పండిస్తున్నారు. ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యవసాయంలో రసాయనాల వాడకం విపరీతం కావటం.. భూసారం క్షీణిస్తుండటం, నీటి వనరుల లభ్యత తగ్గిపోవటం, పెచ్చుమీరిన పర్యావరణ సమస్యలు వ్యవసాయాన్ని మరింత జఠిలంగా మార్చాయి. క్లైమెట్ ఛేంజ్ నేపథ్యంలో సుస్థిర సేద్యం వైపు మారాల్సిన అనివార్యతను ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. అది ఏ పద్ధతిలో అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చంతా. ఆంధ్రప్రదేశ్‌లో డా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం(2007–08) నుంచే వ్యవసాయ రసాయనాల వాడకం తగ్గుతుండగా, గత పదేళ్లలో తెలంగాణలో 5 రెట్లు పెరిగింది. లక్ష ఎకరాల్లో సేంద్రియ సేద్యం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించాం. – డా. జీవీ రామాంజనేయులుఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్https://csa-india.org/ https://krishnasudhaacademy.org 20 ఏళ్ల క్రితం ఐఆర్ఎస్ వద్దనుకొని.. వ్యవసాయ శాస్త్రంలో పిహెచ్డి పూర్తిచేసిన డా. రామాంజనేయులు ఐసిఎఆర్లోని అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ (ఎఆర్ఎస్)లో 8 ఏళ్లు సీనియర్ శాస్త్రవేత్తగా పని చేశారు. ఆ తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)కు ఎంపికయ్యారు. శిక్షణా కాలంలోనే ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ వ్యాప్తి కోసం సుస్థిర వ్యవసాయ కేంద్రం అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ దిశగా గత 20 ఏళ్లుగా విశేష కృషి చేస్తున్నారు. సేంద్రియ పద్ధతులపై పరిశోధన చేస్తూ శిక్షణ ఇచ్చే కృష్ణసుధ అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ (కొండపర్వ)ని స్థాపించటంలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారు. ‘ఏపీ, తెలంగాణలో 66 సహకార సంఘాలు, ఎఫ్‌పిఓలకు చెందిన 50 వేల మంది రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లించే కృషి చేస్తున్నాం. ఇప్పటికే 30 వేల మందికి సేంద్రియ సర్టిఫికేషన్ ఇచ్చాం. వారి నుంచి సేకరించిన ఉత్పత్తులను టీటీడీకి అందిస్తున్నామ’ని డా.రామాంజనేయులు తెలిపారు. ఇదీ చదవండి: బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి! సేంద్రియ సర్టిఫికేషన్ ఎవరిస్తారు?సేంద్రియ / ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులకు, సహకార సంఘాలకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, గ్రామాలకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ గుర్తింపు పొందిన సంస్థలు సేంద్రియ సర్టిఫికేషన్ ఇస్తాయి. ఈ సంస్థలను రీజినల్ కౌన్సెళ్లు అంటారు. ఇలాంటి కౌన్సెళ్లు దేశంలో 76 ఉన్నాయి. రీజినల్ కౌన్సెల్ ఎన్ని రాష్ట్రాల్లో అయినా సర్టిఫికేషన్ సేవలు అందించవచ్చు. చురుగ్గా పనిచేస్తున్న రీజినల్ కౌన్సెళ్లలో సికింద్రాబాద్‌లోని సుస్థిర వ్యవసాయ కేంద్రం రీజినల్ కౌన్సెల్ ఒకటి. వ్యక్తిగతంగా ఒక రైతు గానీ, 10–15 మంది రైతుల బృందాలు / సహకార సంఘాలు / రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పిఓల)కు పిజిఎస్ సేంద్రియ సర్టిఫికేషన్ ఇస్తారు. అందరి రైతులూ పరస్పరం బాధ్యత తీసుకోవాలి. బృందంలో ఒక్క రైతు దారితప్పినా గ్రూప్ మొత్తానికీ గుర్తింపు రద్దవుతుంది. పూర్తిగా గ్రామంలో రైతులందరికీ కలిపి కూడా సర్టిఫికేషన్ ఇస్తారు. దీన్నే లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అంటారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు అనేక దఫాలు పరీక్షలు నిర్వహించిన తర్వాత సర్టిఫికేషన్ ఏ యేటికాయేడు ప్రదానం చేస్తారు.సర్టిఫికేషన్ రెండు రకాలుఆరోగ్యదాకమైన ఆహారోత్పత్తులను పండించే రైతులు / సంస్థలు తమ ఉత్పత్తులకు సేంద్రియ సర్టిఫికేషన్ పొందడానికి ప్రధానంగా రెండు సర్టిఫికేషన్లు ఉన్నాయి. మొదటిది.. పిజిఎస్, రెండోది.. ఎన్‌పిఓపి. ఎక్కడ అమ్మాలనుకునే దాన్ని బట్టి ఏ సర్టిఫికేషన్ అవసరమో చూసుకోవాలి. దేశంలోనే విక్రయించాలనుకుంటే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పిజిఎస్) ఇండియా సర్టిఫికేషన్ తీసుకుంటే సరిపోతుంది. కొందరు రైతులు బృందంగా ఏర్పడి, పరస్పర బాధ్యతతో తీసుకునే సర్టిఫికేషన్ ఇది. దీనికి అయ్యే ఖర్చు కొంచెం తక్కువ. విదేశాలకు ఎగుమతి చేయాలనుకుంటే నేషనల్ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్‌పిఓపి) థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. వీటిల్లో ఏ సర్టిఫికేషన్ అయినా పూర్తిగా సేంద్రియ సర్టిఫికెట్ పొందటానికి మూడేళ్ల కాలం పడుతుంది. పరివర్తన దశలో తొలి రెండేళ్లకు ‘గ్రీన్’ సర్టిఫికేట్ ఇస్తారు. మూడో ఏడాది అన్ని పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చిన తర్వాత ‘ఆర్గానిక్’ సర్టిఫికేట్ ఇస్తారు. నిపుణులు, అధికారుల సమన్వయంతో రీజినల్ కౌన్సెళ్లే ఈ సర్టిఫికేషన్ సేవలు అందిస్తున్నాయి.నేరుగా అమ్మితే సర్టిఫికేషన్ అక్కర్లేదు!రసాయన రహితంగా వ్యవసాయం చేస్తూ, తాము పండించే ఉత్పత్తులను, ఎటువంటి బ్రాండ్ పేరు పెట్టకుండా, నేరుగా వినియోగదారులకు అమ్ముకునే సేంద్రియ రైతులు ఎటువంటి సేంద్రియ సర్టిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే, వారి వ్యాపారం ఏడాదికి రూ. 12 లక్షలు లోపు ఉండాలి. ఆ పరిమితి దాటితే సర్టిఫికేషన్ తీసుకోవాలి. అదేవిధంగా.. రైతు బృందాలు, కోఆపరేటివ్లు, ఎఫ్పిఓలు, వారి వద్ద నుంచి సేంద్రియ ఆహారోత్పత్తులను సేకరించే ప్రైమరీ అగ్రిగేటర్లు, స్టార్టప్‌లు కూడా వార్షిక వ్యాపారం రూ. 50 లక్షలకు లోపు ఉంటే సేంద్రియ సర్టిఫికేషన్ పొందాల్సిన అవసరం లేదు. ఈ వ్యవహారాలను ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) అధికారులు పర్యవేక్షిస్తుంటారు. -
సుస్థిర వ్యవసాయంతోనే ఆహార భద్రత
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రానున్న సంవత్సరాల్లో భారత్‌లో ఆహార సంక్షోభం తలెత్తనుందా? దేశవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధ్యం కావడం లేదా? కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ సుస్థిర వ్యవసాయంలో ముందుకు వెళ్తున్నాయా? అలా వెళ్తున్న రాష్ట్రాలు ఆహార భద్రతకు భరోసా కల్పిస్తున్నాయా? సుస్థిర వ్యవసాయానికి మొత్తం 51 సూచికలను ప్రామాణికంగా తీసుకుని దేశవ్యాప్తంగా జరిపిన అధ్యయనం తర్వాత సుస్థిర వ్యవసాయం సాధించలేని పక్షంలో ఆహార భద్రత కష్టమేనని అఖిల భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐకార్) అభిప్రాయపడుతోంది. ‘కాంపోజిట్ ఇండెక్స్ ఆఫ్ అగ్రికల్చర్ సస్టైనబులిటీ’పేరిట దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని వ్యవసాయ విధానా లను ఐకార్ శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రేమ్‌చంద్, కిరణ్‌కుమార్‌లు పరిశీలించి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో ఐకార్ ఈ అభిప్రాయానికి వచ్చింది. వ్యవసాయ విధానాల్లో స్పష్టమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది. వ్యవసాయ సుస్థిరతకు సవాళ్లు ‘వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వినియోగం పెరగడం, తీవ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, భూసారం తగ్గిపోవడం వ్యవసాయ సుస్థిరతకు పెనుసవాలుగా మారుతోంది. 2030 నాటికి దేశ జనాభా 150 కోట్లకు చేరుకుంటుంది. ఆ జనాభాకు ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత సాగు రంగంపై ఉంది. కొన్ని రాష్ట్రాలు సామాజిక, ఆర్థిక రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నా.. వ్యవసాయ సుస్థిరత సూచీలకు వచ్చేస రికి వెనుకబడుతున్నాయి..’అని ఐసీఏఆర్ వెల్లడించింది. పంజాబ్, హరియాణ సామాజిక, ఆర్థిక రంగాల్లో ముందంజలో ఉన్నప్పటికీ.. వ్యవసాయ సుస్థిరత సూచీని పరిశీలించినప్పుడు వెనుకబడి ఉన్నట్లు తెలిపింది. భారత వ్యవసాయ రంగం సుస్థిరత కోణంలో ఉన్నత స్థానంలో లేదని ఓ మోస్తరు సుస్థిరతతోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వాలుసహకరించాలి.. ‘సుస్థిర వ్యవసాయానికి ప్రధాన సూచికలైన అతి తక్కువ నీరు,రసాయనాలు, ఎరువులు,విద్యుత్ వినియోగిస్తూ, భూసారం తగ్గకుండా పంటలు పండించే రైతాంగానికి ప్రభుత్వాలు సరైన సమయంలో సాయం అందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే భారత్‌లో ఆహార భద్రతకు ఇబ్బందులు రావు. ప్రస్తుతం మిజోరం, కేరళ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్,పశ్చిమ బెంగాల్ మాత్రమేసుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులుఎదుర్కొనే రాజస్తాన్ సుస్థిరవ్యవసాయంలో చివరలో ఉంది..’ అని ఐకార్ నివేదిక తెలిపింది. సుస్థిర వ్యవసాయానికి 51 సూచికలు సుస్థిర వ్యవసాయాభివృద్ధికి 51 సూచికలను ప్రామాణికంగా తీసుకున్నట్లు ఐకార్ వెల్లడించింది. సారవంతమైన నేలలు, నీటి వనరులు, జీవ వైవిధ్యం, సామాజిక, ఆర్థిక, పర్యావరణ సమతుల్యత తదితర సూచికలు ప్రధానమైనవిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, హరియాణాతోపాటు వరి పండించే జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్లు ఐకార్ వివరించింది. ఇక్కడ వ్యవసాయ విధానాల్లో మార్పులు అత్యావశ్యమని హెచ్చరించింది. పంటల మార్పిడి, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పంట రుణాలు, నీటి వనరుల కల్పన తదితరాలతో సుస్థిర వ్యవసాయం సాధ్యమంది. అధిక ఇన్పుట్ సబ్సిడీల నుంచి పద్ధతి ప్రకారం రైతులకు లబ్ధి చేకూరే విధానాలు రావాల్సి ఉందని తెలిపింది. భూములు సారవంతంగా లేని చోట రసాయన ఎరువుల వాడకం పెరుగుతోందని, దీనివల్ల భూమిలో ఆర్గానిక్ కార్బన్ తగ్గుదల చోటు చేసుకుంటోందని వివరించింది. దేశంలో ఓ మాదిరి సుస్థిరతే.. సుస్థిర వ్యవసాయంలో 0 నుంచి 1ని ప్రామాణికంగా తీసుకుంటే దేశంలో సరాసరిన 0.50 నమోదు అవుతోందని, ఇది ఓ మాదిరి సుస్థిరత మాత్రమేనని ఐసీఏఆర్ తేల్చింది. 0ను అధ్వానంగా పేర్కొంటే, 1ని అత్యుత్తమంగా పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళలు జాతీయ సగటును మించి ఉన్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో భూ గర్భ జలాల వినియోగం అధికంగా ఉందని, భూగర్భ జలాలు 40 సెంటీమీటర్ల మేరకు వేగంగా పడిపోయాయని ఐకార్ పేర్కొంది. ఇక పర్యావరణ సుస్థిరతలో కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరం, ఉత్తరాఖండ్‌లు మెరుగైన పనితీరును కనపరుస్తున్నట్లు తెలిపింది. ఇందులో అస్సాం, మణిపూర్, జార్ఖండ్, పంజాబ్, తెలంగాణ అధ్వానంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చాలా తక్కువ పరిమాణంలో ఉందని, గ్రీన్హౌస్ గ్యాసెస్ ఎక్కువగా వ్యవసాయ రంగం నుంచే వెలువడుతున్నట్లు పేర్కొంది. వాణిజ్య పంటలున్నా ఏపీ భేష్ సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధిస్తున్న ఐదారు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండటం అభినందనీయం. మిజోరం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉన్నా.. ఆ రాష్ట్రాల్లో వాణిజ్య పంటలు తక్కువగా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్య పంటలు అధికంగా సాగు చేస్తున్నా.. రసాయన ఎరువులు, నీరు తక్కువ వినియోగం, భూసారాన్ని పెంపొందించేలా చేయడం ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించింది. సుస్థిర వ్యవసాయం చేస్తున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది. ఈ రైతులను ఆదుకుంటే దేశ ఆహార భద్రతకు వచ్చే ముప్పేమీ ఉండదు. -
గ్రామ స్థాయిలోనే వ్యవసాయ సూచనలు!
సాధారణంగా వ్యవసాయ/ఉద్యాన విశ్వవిద్యాలయాలు, ఏరువాక కేంద్రాల శాస్త్రవేత్తలు రాష్ట్ర, జిల్లా స్థాయిలో పంటల స్థితిగతులను పరిశీలించి నెలకు, వారానికి ఒకసారి రైతులను ఉద్దేశించి ప్రసార మాధ్యమాలు, పత్రికల ద్వారా వ్యవసాయ సూచనలను అందిస్తుండటం పరిపాటి. అయితే, వీటిని రైతులు తమ గ్రామంలో నెలకొన్న వాతావరణ, పంటల పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకొని అమలు చేసుకోవలసి ఉంటుంది. ఇది రైతులందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే, గ్రామ స్థాయిలోనే పంటలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను నిరంతరం అధ్యయనం చేస్తూ.. ఆ గ్రామంలోని రైతులు పండిస్తున్న వివిధ పంటలకు తగిన విధంగా అన్వయించి.. ప్రతి మూడు రోజులకోసారి వ్యవసాయ సూచనలను వారి సొంత భాషలో మొబైల్స్ ద్వారా అందిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయా? సకాలంలో సరైన సూచనలు అందిస్తే పంట దిగుబడులు పెరగటంతోపాటు మంచి ధరను సైతం పొందగలుగుతారా? గ్రామస్థాయిలో ఇలా అందించే సమగ్ర వ్యవసాయ సూచనలు కచ్చితంగా రైతులకు ఉపకరిస్తాయని స్వచ్ఛంద సంస్థ సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ) ఆశిస్తోంది. గత 15 ఏళ్లుగా తెలుగునాట సేంద్రియ/ప్రకృతి/ఎన్‌పిఎం వ్యవసాయ పద్ధతులను ఈ సంస్థ ప్రచారం చేస్తున్నది. ఈ నేపథ్యంలో జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) తోడ్పాటుతో సేంద్రియ / ప్రకృతి / ఎన్‌పిఎం పద్ధతుల్లో వివిధ పంటలు పండించే రైతులకు గ్రామస్థాయిలో వ్యవసాయ సూచనలు అందించే పైలట్ ప్రాజెక్టుకు సిఎస్ఎ ఇటీవల శ్రీకారం చుట్టింది. విజయనగరం జిల్లా వేపాడ మండలం 15 గ్రామాల్లోని వెయ్యి మంది సేంద్రియ రైతులకు అందిస్తున్నారు. కిసాన్ మిత్ర కాల్ సెంటర్ ద్వారా సూచనలు సలహాలను ఫోన్ ద్వారా అందించే కార్యక్రమాన్ని నాబార్డ్ చైర్మన్ జి.వి.చింతల ఇటీవల హైద్రాబాద్ నుంచి జూమ్ ఆప్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ ఏపీ సిజిఎమ్ సుధీర్‌కుమార్ జనావర్, తెలంగాణ రాష్ట్ర సిజిఎమ్ వై.క్రిష్ణారావు, సుస్దిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జి.వి.రామాంజనేయులు తదితరులు పాల్గొ్గన్నారు. హరిత రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులైన 12 గ్రామాల రైతులను, వేపాడ గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులైన 3 గ్రామాల రైతులను ఎంపిక చేసి సూచనలు అందిస్తున్నారు. వారికి ప్రతి బుధ, శనివారాల్లో ఫోన్ ద్వారా తెలుగులో సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్)తో పాటు శ్రవణ సందేశం (వాయిస్ మెసేజ్) పంపుతున్నారు. స్థానిక వాతావరణ వివరాలను తెలుసుకునేందుకు వేపాడ మండలం ఎస్కెఎస్ఆర్ పురంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఏయే పంటల్లో చీడపీడల పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది పసిగట్టడానికి గ్రామస్థాయిలో ఏర్పాట్లు చేసుకొని ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి, రైతులను అప్రమత్తం చేస్తుండటం విశేషం. వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ అధికారులు అందించే సూచనలతోపాటు స్థానికంగా సేకరించిన వివరాల ఆధారంగా నిపుణులు తగిన సూచనలను కిసాన్ మిత్ర ద్వారా ఈ వెయ్యి మంది రైతులకు అందిస్తున్నారు. పంటల సాగు, సస్య రక్షణకే పరిమితం కాకుండా.. వారు పండించిన పంటలను అమ్ముకోవడానికి మార్కెట్ సదుపాయాలు ఎక్కడ ఉన్నాయి? ఏయే పంట ఉత్పత్తుల ధరలు దగ్గర్లోని మార్కెట్లలో ఎలా ఉన్నాయి? అనే సమచారాన్ని కూడా రైతులకు అందించేందుకు కిసాన్ మిత్ర సిబ్బంది కృషి చేస్తున్నారు. మండలంలో రైతులు ప్రస్తుతం ప్రధానంగా వరి, కూరగాయలు, చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు. వీరికి విత్తనశుద్ధి, జీవామృతం, ద్రవజీవామృతం, ఘనజీవామృతం, కషాయాల తయారీ, వాడకం, వాటి ప్రయోజనాలపై సుస్దిర వ్యవసాయం కేంద్రం సిబ్బంది పొలంబడి నిర్వహిస్తూ సూచనలు సలహాలు అందిస్తున్నారు. ఎంపిక చేసిన ఈ వెయ్యి మంది రైతులుకు ఉచితంగా విత్తనాలు, సేంద్రియ ఎరువులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అందించేందుకు కిసాన్ మిత్ర సేవలు దోహదపడతాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సుస్దిర వ్యవసాయ కేంద్రం కోరుతోంది. – వరాహగిరి సత్యనారాయణ, సాక్షి, వేపాడ ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రయత్నం సుస్థిర వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తున్న రైతులకు ఎప్పటికప్పుడు రాబోయే ఐదు రోజుల వాతావరణ పరిస్తితులను వివరించటంతో పాటు పంటలను ఆశించేచీడపీడల నివారణకు, పండించిన పంటలకు మార్కెట్ ధరలు తెలుసుకోవటానికి కిసాన్ మిత్ర దోహాదపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రయత్నంగా విజయనగరం జిల్లా వేపాడ మండలంలో ఎంపికచేసిన రైతులకు ఈ అవకాశం కల్పించాం. ఈ సదుపాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తెలుగు స్థానిక యాసలోనే బుధ, శనివారల్లో సూ^è నలు, సలహాలు ఉదయం 7 గంటల నుండి సాయింత్రం 5 గంటల వరకు ఫోన్ ద్వారా వినియోగించుకోవచ్చు. 1800 120 3244 లేదా 08500 98 33 00 ద్వారా రైతులు కిసాన్ మిత్ర సేవలను పొందవచ్చు. – డా.జి.వి.రామాంజనేయులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం -
గులాబీ క్షేత్ర దినోత్సవానికి ప్రవేశం ఉచితం!
8, 22 తేదీల్లో ప్రకృతి సేద్యంపై విజయరామ్ శిక్షణ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ (ఎస్.పి.ఎన్.ఎఫ్.) పద్ధతిపై సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్ (సేవ్) ‘సేవ్’ సంస్థ వ్యవస్థాపకులు, ప్రకృతి వ్యవసాయదారులు విజయరామ్ ఈ నెల 8న తిరుపతిలో, 22న రాజమహేంద్రవరంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారికి, భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకునే వారికి అవగాహన కల్పిస్తారు. తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం, అంతర పంటల ద్వారా అధికాదాయం పొందటం, పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అమ్ముకోవటం, వాన నీటి సంరక్షణ పద్ధతులు, వ్యవసాయంలో దేశవాళీ ఆవు, ఎద్దు ప్రాధాన్యం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రవేశ రుసుము రూ. వంద. శిక్షణ సమయం ఉ. 9 నుంచి సా. 5 గంటల వరకు. ఆసక్తి గల వారు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. మార్చి 8 (ఆదివారం)న తిరుపతిలో.. వేదిక: ఎస్వీ యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియం, తిరుపతి రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 88849 12344, 94495 96039, 86889 98047 మార్చి 22 (ఆదివారం)న రాజమహేంద్రవరంలో.. వేదిక : శ్రీ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం, జామ్‌పేట, రాజమహేంద్రవరం. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 94495 96039, 86889 98047, 99498 00201. 16న తమిళనాడులో గులాబీ క్షేత్ర దినోత్సవం బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐ.ఐ.హెచ్.ఆర్.) ఆధ్వర్యంలో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా దొడ్డమంచి గ్రామంలో గల తెలుగు రైతు మంజునాథ్ (79821 17354) కు చెందిన వన్య ఫార్మ్స్‌లో మార్చి 16, సోమవారం నాడు సేంద్రియ గులాబీ పూల సాగుపై క్షేత్ర దినోత్సవాన్ని (రోజ్ ఫీల్డ్ డే) నిర్వహించనుంది. సేంద్రియ పద్ధతుల్లో గులాబీలను సాగు చేస్తూ ఆయన మునగను అంతరపంటగా సాగు చేస్తున్నారు. కూరగాయలు, ఔషధ మొక్కలు కూడా సాగు చేయబోతున్నారు. రైతు క్షేత్రంలో గులాబీల సేంద్రియ సాగును ప్రత్యక్షంగా రైతులకు చూపించడం, సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం, ఐఐహెచ్ఆర్ సీనియర్ ఉద్యాన శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి అవకాశం కల్పించడం ఫీల్డ్ డే లక్ష్యం. ఉ. 9 గంటల నుంచి జరిగే ఈ క్షేత్ర దినోత్సవంలో రైతులకు ఉచిత ప్రవేశం ఉంటుంది. అయితే, 89192 71136 నంబరుకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. సుస్థిర లాభసాటి వ్యవసాయంపై 3 నెలల కోర్సు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల–ఆయకట్టు అభివృద్ధి శాఖ, నీరు–భూమి యాజమాన్య శిక్షణ, పరిశోధనా సంస్థ (వాలంతరి–రాజేంద్రనగర్) ఆధ్వర్యంలో ‘భూమి, నీటి యాజమాన్యంతో సుస్థిరమైన లాభసాటి వ్యవసాయం’పై 3 నెలల రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి ఈ నెల 5వ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 10 నుంచి జూన్ 9 వరకు కోర్సు కాలం ఉంటుంది. ఇంటర్/ఐటిఐ/డిప్లొమా చదివిన 18–30 ఏళ్ల వయసులో గ్రామీణ యువతీ యువకులు అర్హులు. కోర్సు రుసుము రూ. 5 వేలు. ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము రూ. 500. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఆదర్శ రైతుగా ఎదగవచ్చు లేదా వ్యవసాయ కన్సల్టెంట్‌గా స్థిరపడవచ్చు. దరఖాస్తు ఫాం, ఇతర వివరాలకు సంబంధిత వెబ్సైట్ చూడండి. 8న కొర్నెపాడులో సూపర్ నేపియర్ సాగుపై శిక్షణ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పశుగ్రాసాల సాగు, ప్రత్యేకంగా సూపర్ నేపియర్ గడ్డి సాగు, పశుపోషణపై మార్చి 8(ఆదివారం)న గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. సూపర్ నేపియర్ కణుపులను ఉచితంగా పంపిణీ చేస్తారు. గన్నవరం పశువైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ డా. సి.హెచ్. వెంకట శేషయ్య, పాడి రైతు విజయ్ (గుంటూరు) రైతులకు శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. -
పురుగులతో వేగేదెలా?
ఇంటి పంట ఎండ గత కొద్ది రోజులుగా చుర్రుమంటోంది. ఇంటిపంటలకు (70% ఎండను వడకట్టే) 30% గ్రీన్ షేడ్‌నెట్‌తో నీడను కల్పించడం, ఆకులతో నేలకు ఆచ్ఛాదన(మల్చింగ్), డ్రిప్ వంటి ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. కూరగాయ పంటలకు వేసవిలో కొన్ని ప్రత్యేక పురుగుల బెడద ఉంటుంది. నేల మీద లేదా కుండీల్లో ఎక్కడైనా వీటి బెడద ఉంటుంది. వీటికి సంబంధించి కొన్ని మెలకువలు పాటిస్తే నష్టం తక్కువగా చూసుకోవడానికి వీలుంది. పెంకు పురుగులు: ఇవి చల్లదనాన్ని ఇష్టపడే పురుగులు. మొక్కల దగ్గర మట్టిలో పిల్ల పురుగులు దాక్కొని ఉంటాయి. రాత్రి పూట బయటకు వచ్చి మొక్కల ఆకులను తిని, మళ్లీ మట్టిలోకి చేరుకుంటాయి. వేపపిండిని మట్టిలో కలిపితే సమస్య తీరుతుంది. కూరగాయ మొక్కలు నాటడం లేదా ఆకుకూరల గింజలు చల్లడానికి ముందే మట్టిలో కొంచెం వేప పిండి వేసుకుంటే వీటి సమస్య రాదు. నులిపురుగు: వంగ, బీన్స్, టమాటా తదితర కూరగాయ మొక్కల వేళ్లను నులిపురుగులు ఆశిస్తుంటాయి. నులిపురుగుల సమస్య ఉన్న మొక్కలకు పోషకాల లభ్యత తగ్గిపోతుంది. ఆకులు పసుపు పచ్చగా మారి.. మాడిపోతాయి. ఆకుల్లో తేడా తప్ప ఇతర లక్షణాలేవీ ఉండవు. మట్టిని పక్కకు తీసి వేళ్లను గమనిస్తే వేళ్లకు బుడిపెలు కనిపిస్తాయి. దీన్ని మొదటి దశలో అయితే ట్రైకోడెర్మావిరిడితో కొంతమేరకు నియంత్రించవచ్చు. అయితే, ట్రైకోడెర్మా విరిడిని మట్టిలో వేస్తే.. ఆ తదనంతరం వరుసగా అనేక పంటలను నులిపురుగుల బారి నుంచి, ఎండుతెగులు నుంచి కూడా కాపాడుకోవచ్చు. ట్రైకోడెర్మా విరిడి తయారీ విధానం: ట్రైకోడెర్మా విరిడి అనే జీవ శిలీంధ్రనాశినిని మాగిన పశువుల పేడలో కలిపి వృద్ధి చేసి.. మొక్కలకు వేసుకోవాలి. పెరటి తోటలు, మేడపై ఇంటిపంటల కోసం తక్కువ పరిమాణంలో ట్రైకోడెర్మా విరిడిని వృద్ధి చేసుకోవచ్చు. 10 కిలోల పశువుల ఎరువును నీడలో నేలపైన పరిచి, 250 గ్రాముల(ఎక్కువైనా ఫర్వాలేదు) ట్రైకోడెర్మా విరిడి పొడిని కలిపి, పల్చగా నీటిని చిలకరించాలి. దానిపై గోనెసంచిని కప్పాలి. తేమ ఆరిపోకుండా తగుమాత్రంగా నీరు చల్లుతుండాలి. వారం రోజుల్లో పశువుల ఎరువు పైన తెల్లని బూజు పెరుగుతుంది. అంటే.. ట్రైకోడెర్మా విరిడి వృద్ధి చెందిందన్న మాట. మట్టిని ఒక అంగుళం మందాన తీసి పక్కన పెట్టి.. ట్రైకోడెర్మా విరిడితో కూడిన పశువుల ఎరువును వేసి, మళ్లీ మట్టిని కప్పేయాలి. ఎర్రనల్లి: వంగ, బెండ తదితర పంటల్లో ఆకుల కింద చేరే ఎర్రనల్లి రసం పీల్చేస్తూ ఉంటుంది. ఆకులు క్రమంగా పత్రహరితాన్ని కోల్పోతాయి. మొక్క పెరగదు. దీని నివారణకు గుప్పెడు ఆవాలు, 2,3 వెల్లుల్లి రెబ్బలు నూరి, ఒక పల్చని గుడ్డలో మూటగట్టి, లీటరు నీటిలో 3 గంటలు నానబెట్టాలి. ఈ ద్రావణాన్ని ఆకుల అడుగున బాగా తడిసేలా పిచికారీ చేయాలి. వారం వ్యవధిలో 2,3 సార్లు పిచికారీ చేయాలి. లేదా దుకాణాల్లో లభించే నీటకరిగే గంధకం(వెట్టబుల్ సల్ఫర్)ను తగిన మోతాదులో వాడుకోవచ్చు. - డా. బి. రాజశేఖర్ (83329 45368), శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్


