గ్రామ స్థాయిలోనే వ్యవసాయ సూచనలు! | Sakshi
Sakshi News home page

గ్రామ స్థాయిలోనే వ్యవసాయ సూచనలు!

Published Tue, Sep 8 2020 7:51 AM

Sustainable Agriculture Center Explain Agriculture Methods - Sakshi

సాధారణంగా వ్యవసాయ/ఉద్యాన విశ్వవిద్యాలయాలు, ఏరువాక కేంద్రాల శాస్త్రవేత్తలు రాష్ట్ర, జిల్లా స్థాయిలో పంటల స్థితిగతులను పరిశీలించి నెలకు, వారానికి ఒకసారి రైతులను ఉద్దేశించి ప్రసార మాధ్యమాలు, పత్రికల ద్వారా వ్యవసాయ సూచనలను అందిస్తుండటం పరిపాటి. అయితే, వీటిని రైతులు తమ గ్రామంలో నెలకొన్న వాతావరణ, పంటల పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకొని అమలు చేసుకోవలసి ఉంటుంది. ఇది రైతులందరికీ సాధ్యం కాకపోవచ్చు. 

అయితే, గ్రామ స్థాయిలోనే పంటలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను నిరంతరం అధ్యయనం చేస్తూ.. ఆ గ్రామంలోని రైతులు పండిస్తున్న వివిధ పంటలకు తగిన విధంగా అన్వయించి.. ప్రతి మూడు రోజులకోసారి వ్యవసాయ సూచనలను వారి సొంత భాషలో మొబైల్స్‌ ద్వారా అందిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయా? సకాలంలో సరైన సూచనలు అందిస్తే పంట దిగుబడులు పెరగటంతోపాటు మంచి ధరను సైతం పొందగలుగుతారా? 

గ్రామస్థాయిలో ఇలా అందించే సమగ్ర వ్యవసాయ సూచనలు కచ్చితంగా రైతులకు ఉపకరిస్తాయని స్వచ్ఛంద సంస్థ సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్‌ఎ) ఆశిస్తోంది. గత 15 ఏళ్లుగా తెలుగునాట సేంద్రియ/ప్రకృతి/ఎన్‌పిఎం వ్యవసాయ పద్ధతులను ఈ సంస్థ ప్రచారం చేస్తున్నది. ఈ నేపథ్యంలో జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్‌) తోడ్పాటుతో సేంద్రియ / ప్రకృతి / ఎన్‌పిఎం పద్ధతుల్లో వివిధ పంటలు పండించే రైతులకు గ్రామస్థాయిలో  వ్యవసాయ సూచనలు అందించే పైలట్‌ ప్రాజెక్టుకు సిఎస్‌ఎ ఇటీవల శ్రీకారం చుట్టింది. 

విజయనగరం జిల్లా వేపాడ మండలం 15 గ్రామాల్లోని వెయ్యి మంది సేంద్రియ రైతులకు అందిస్తున్నారు. కిసాన్‌ మిత్ర కాల్‌ సెంటర్‌ ద్వారా సూచనలు సలహాలను ఫోన్‌ ద్వారా అందించే కార్యక్రమాన్ని నాబార్డ్‌ చైర్మన్‌ జి.వి.చింతల ఇటీవల హైద్రాబాద్‌ నుంచి జూమ్‌ ఆప్‌ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్‌ ఏపీ సిజిఎమ్‌ సుధీర్‌కుమార్‌ జనావర్, తెలంగాణ రాష్ట్ర సిజిఎమ్‌ వై.క్రిష్ణారావు, సుస్దిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా. జి.వి.రామాంజనేయులు తదితరులు పాల్గొ్గన్నారు. 

హరిత రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులైన 12 గ్రామాల రైతులను, వేపాడ గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులైన 3 గ్రామాల రైతులను ఎంపిక చేసి సూచనలు అందిస్తున్నారు. వారికి ప్రతి బుధ, శనివారాల్లో ఫోన్‌ ద్వారా తెలుగులో సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్‌)తో పాటు శ్రవణ సందేశం (వాయిస్‌ మెసేజ్‌) పంపుతున్నారు. స్థానిక వాతావరణ వివరాలను తెలుసుకునేందుకు వేపాడ మండలం ఎస్‌కెఎస్‌ఆర్‌ పురంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఏయే పంటల్లో చీడపీడల పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది పసిగట్టడానికి గ్రామస్థాయిలో ఏర్పాట్లు చేసుకొని ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి, రైతులను అప్రమత్తం చేస్తుండటం విశేషం.  

వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ అధికారులు అందించే సూచనలతోపాటు స్థానికంగా సేకరించిన వివరాల ఆధారంగా నిపుణులు తగిన సూచనలను కిసాన్‌ మిత్ర ద్వారా ఈ వెయ్యి మంది రైతులకు అందిస్తున్నారు. పంటల సాగు, సస్య రక్షణకే పరిమితం కాకుండా.. వారు పండించిన పంటలను అమ్ముకోవడానికి మార్కెట్‌ సదుపాయాలు ఎక్కడ ఉన్నాయి? ఏయే పంట ఉత్పత్తుల ధరలు దగ్గర్లోని మార్కెట్లలో ఎలా ఉన్నాయి? అనే సమచారాన్ని కూడా రైతులకు అందించేందుకు కిసాన్‌ మిత్ర సిబ్బంది కృషి చేస్తున్నారు.

మండలంలో రైతులు ప్రస్తుతం ప్రధానంగా వరి, కూరగాయలు, చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు. వీరికి విత్తనశుద్ధి, జీవామృతం, ద్రవజీవామృతం, ఘనజీవామృతం, కషాయాల తయారీ, వాడకం, వాటి ప్రయోజనాలపై సుస్దిర వ్యవసాయం కేంద్రం సిబ్బంది పొలంబడి నిర్వహిస్తూ సూచనలు సలహాలు అందిస్తున్నారు. ఎంపిక చేసిన ఈ వెయ్యి మంది రైతులుకు ఉచితంగా విత్తనాలు, సేంద్రియ ఎరువులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అందించేందుకు కిసాన్‌ మిత్ర సేవలు దోహదపడతాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సుస్దిర వ్యవసాయ కేంద్రం కోరుతోంది. 
– వరాహగిరి సత్యనారాయణ, సాక్షి, వేపాడ

ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రయత్నం
సుస్థిర వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తున్న రైతులకు ఎప్పటికప్పుడు రాబోయే ఐదు రోజుల వాతావరణ పరిస్తితులను వివరించటంతో పాటు పంటలను ఆశించేచీడపీడల నివారణకు, పండించిన పంటలకు మార్కెట్‌ ధరలు తెలుసుకోవటానికి కిసాన్‌ మిత్ర దోహాదపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రయత్నంగా విజయనగరం జిల్లా వేపాడ మండలంలో ఎంపికచేసిన రైతులకు ఈ అవకాశం కల్పించాం. ఈ సదుపాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తెలుగు స్థానిక యాసలోనే బుధ, శనివారల్లో సూ^è నలు, సలహాలు ఉదయం 7 గంటల నుండి సాయింత్రం 5 గంటల వరకు ఫోన్‌ ద్వారా వినియోగించుకోవచ్చు. 1800 120 3244 లేదా 08500 98 33 00 ద్వారా రైతులు కిసాన్‌ మిత్ర సేవలను పొందవచ్చు. – డా.జి.వి.రామాంజనేయులు,  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం

Advertisement
Advertisement