
20 ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ విత్తన ఒడండిక
భారత్ సహా 154 దేశాలు ఈ ఒడంబడికలో సభ్యులు
ఈ ఒడంబడిక పరిధిలోకి 64 రకాల దేశీ విత్తనాలు/ మొక్కలు/ వంగడాలు
వచ్చే నవంబర్‌లో విత్తన ఒడంబడికకు సవరణలకు అవకాశం
రైతుల హక్కులకు భంగం కలిగించే సవరణ యత్నాలపై ప్రపంచ రైతుల కూటమి ఆందోళన
విత్తనం.. ప్రకృతి మనుగడకు, ఆహార భద్రతకు, వ్యవసాయానికి, రైతుల సంప్రదాయ పారంపర్య హక్కులకు విత్తనం మూలాధారం. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాల్లో ఎన్నోన్నో ప్రత్యేక విత్తనాలు, విలక్షణ వంగడాలు ఉన్నాయి. సార్వభౌమత్వం గల ఒక దేశంలో అనాదిగా ఉన్న విత్తనాలు, మొక్కలు, వంగడాలు, వాటి జన్యువనరులు ఆ దేశం సొత్తు. ఇంకా చెప్పాలంటే గత పదివేల సంవత్సరాల నుంచి వీటిని నిరంతరాయంగా సాగు చేస్తూ, తమవైన పద్ధతుల్లో పరిరక్షించుకుంటూ, తమ పొలాల్లో వాడుకోవటంతోపాటు, తమ దేశవాసులతో పంచుకుంటూ జీవనయానం కొనసాగిస్తున్న వ్యవసాయ సమాజాల లేదా రైతుల అపురూపమైన వారసత్వ సొత్తు విత్తనం! ఒక దేశం వ్యవసాయక వారసత్వ సంపదైన విత్తనాన్ని లేదా జన్యు వనరులను ఇతర దేశాలకు ఇచ్చి పుచ్చుకోవటానికి ఎటువంటి నియమ నిబంధనలుపాటించాలో నిర్దేశించేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) అంతర్జాతీయ ఒడంబడికను కుదిర్చింది.
దాని పేరే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐటీపీజీఆర్‌ఎఫ్‌ఏ). దీన్ని అంతర్జాతీయ విత్తన ఒడంబడిక లేదా మొక్కల ఒడంబడిక (సీడ్ ట్రీటీ లేదా ప్లాంట్ ట్రీటీ) అని కూడా పిలుస్తారు. 154 దేశాలు దీనిపై సంతకాలు చేశాయి. ఇది 2004లో అమల్లోకి వచ్చింది. ఇది సభ్యదేశాలన్నీ విధిగాపాటించి తీరవలసిన ఒడంబడిక (లీగల్లీ బైండింగ్ ట్రీటీ) కావటంతో దీని ప్రభావం వారసత్వ మేధో హక్కులపై గణనీయంగా ఉంటుంది. 64 రకాల విత్తనాలు/ మొక్కలు/ వంగడాలు దీని పరిధిలోకి వస్తాయి.
ఈ పంటలకు సంబంధించిన 70 లక్షలకు పైగా విత్తనాల నమూనాలు అంతర్జాతీయ స్థాయి విత్తన నిధుల్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించుకొని సరికొత్త వంగడాల తయారీపై 28,000కు పైగా విత్తన సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇతర దేశపు విత్తనాలను పరిశోధనలకు వాడుకుంటే ఆ దేశానికి కంపెనీ కొంత మొత్తాన్ని చెల్లించాలన్నది ఒక నియమం. అయితే, 20 ఏళ్ల తర్వాత ఈ ఒడంబడికకు సవరణలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సవరణలు రైతుల హక్కులకు భంగం కలిగిస్తూ కంపెనీలకు లాభం చేకూర్చేలా ఉన్నాయని విమర్శలు రావటంతో వివాదం రాజుకుంది. ఆ విషయాలను కొంచెం వివరంగా తెలుసుకుందాం...
అంతర్జాతీయ విత్తన ఒడంబడిక (ఐటీపీజీఆర్‌ఎఫ్‌ఏ)కు సవరణ ప్రయత్నాల నేపథ్యంలో ఇటీవల వివాదం నెలకొంది. ప్రధానంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య విత్తన జన్యు వనరుల పంపిణీకి సంబంధించిన మేధో సంపత్తి హక్కులు, ప్రయోజన భాగస్వామ్యం (బెనిఫిట్ షేరింగ్), సింపుల్‌గా చెప్పాలంటే రాయల్టీ, చెల్లింపు విషయంలో కొనసాగుతున్న అసమానతల కారణంగా వివాదం నెలకొంది. ఈ వ్యవస్థ చిన్న తరహా రైతులు, జీవవైవిధ్యం అధికంగా ఉన్న భారత్ తదితర దేశాల ప్రయోజనాల కంటే బహుళజాతి విత్తన సంస్థలకు ఎక్కువ అనుకూలంగా ఉందని.. అంతేకాకుండా ప్రతిపాదిత సవరణలు ఈ సమస్యలను మరింతగా పెంచుతాయని విమర్శకులు వాదిస్తున్నారు.
నవంబర్‌లో లిమాలో కీలక సమావేశం
నవంబర్ 24 నుంచి 29 వరకు పెరూలోని లిమాలో జరగనున్న విత్తన ఒడంబడిక 11వపాలకమండలి సమావేశంలో సవరణలపై చర్చ జరగనుంది. వర్కింగ్ గ్రూప్ తయారుచేసిన చర్యల ముసాయిదాప్యాకేజీపై చర్చిస్తారు.
వివాదానికి దారితీసిన కీలక అంశాలు:
1. ప్రపంచంలోని పంటల జీవవైవిధ్యం (అంటే.. వైవిధ్యమైన వంగడాలు, పంటల జాతుల సంఖ్య) ఎక్కువ భాగం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఈ దేశాలు తమ జన్యు పదార్థాన్ని అభివృద్ధి చెందిన దేశాలకు అనాదిగా అందిస్తున్నాయి. అయితే, అందుకు తగిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు తిరిగి పొందలేక΄ోతున్నాయి.
2. జన్యు వనరుల వాణిజ్యీకరణతో కలిగే ప్రయోజనాలను బెనిఫిట్–షేరింగ్ ఫండ్ ద్వారా సేకరించి విత్తన హక్కులున్న దేశాలకు పునఃపంపిణీ చేయడానికి బహుళ పక్ష వ్యవస్థ (ఎంఎల్‌ఎస్) ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ వ్యవస్థ చాలా తక్కువ డబ్బును మాత్రమే రాబట్టగలుగుతోంది. ప్రయోజనాలు తరచుగా ద్రవ్యేతరమైనవి లేదా కేవలం ప్రతీకాత్మకమైనవిగా అరకొరగా మాత్రమేనని విమర్శకులు వాదిస్తున్నారు.
3. విత్తన ఒడంబడిక ఎజెండాలోనే తేడా ఉందన్న అభిప్రాయం ఉంది. రైతులు, స్వదేశీ వ్యవసాయ సమాజాల హక్కుల పరిరక్షణపై కంటే.. తమ వాణిజ్య ప్రయోజనాలకు ్రపాధాన్యత ఇచ్చే కార్పొరేట్ సంస్థలకే విత్తన ఒడంబడిక ఉపయోగపడుతోందని చాలామంది భావిస్తున్నారు.
ప్రపంచ రైతుల కూటమి హెచ్చరిక
ఐక్యరాజ్యసమితి విత్తన ఒప్పందంలో ప్రతిపాదించిన సంస్కరణలు రైతుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని రైతు సంఘాలు, పౌర సమాజ సంస్థలతో కూడిన ‘ప్రపంచ రైతుల కూటమి’ హెచ్చరిస్తోంది. ప్రతిపాదనలు రైతుల డిమాండ్లను పక్కన పెట్టి విత్తన కంపెనీలకు బహుళ పక్ష వ్యవస్థను మరింత ఆకర్షణీయంగా మార్చడంపై దృష్టి పెడుతున్నాయని కూటమి ఆరోపిస్తోంది. రైతుల హక్కులను దెబ్బతీసే విత్తన ఒప్పంద సంస్కరణలను ప్రపంచ రైతు కూటమి వ్యతిరేకిస్తోంది. బహుళ పక్ష వ్యవస్థ పరిధిలోకి ప్రస్తుతం ఉన్న 64 పంటలతోపాటు ఇతర మొక్కల జన్యు వనరులను చేర్చాలన్న ప్రతిపాదన ఉంది.
ఇది జాతీయ విత్తన హక్కుల దోపిడీకి దారితీస్తుందని కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మార్పులు రైతుల హక్కులను, విత్తనాలపై ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించింది. ఒప్పందం పరిధిని విస్తరించే లక్ష్యంతో ఉన్న సంస్కరణలు బహుళజాతి విత్తన సంస్థలకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇవి తగిన రక్షణలు లేకుండా సాంప్రదాయ విత్తన రకాలను దోపిడీ చేయడానికి వీలు కల్పిస్తాయని కూటమి తెలిపింది.
మన దేశంలోని రైతు సంఘాల జాతీయ కూటమి అయిన భారత్ బీజ్ స్వరాజ్ మంచ్, ప్రపంచవ్యాప్తంగా 280 కంటే ఎక్కువ సంస్థలు, 100 మంది వ్యక్తులతో కలిసి ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యు, విత్తన ఒడంబడిక కార్యదర్శి కెంట్ న్నాడోజీకి గత నెల 12న లేఖ రాశారు. చర్చల దశలో ఉన్న ప్రస్తుత చర్యల ముసాయిదాప్యాకేజీ రైతుల హక్కులను, విత్తనాలపై జాతీయ సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టు వంటిదని, అదే సమయంలో ఒప్పంద వ్యవస్థను బహుళజాతి విత్తన సంస్థలకు మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని ఆ లేఖ హెచ్చరించింది.
కొత్త ప్రతిపాదనలు ప్రపంచ కార్పొరేషన్లు తగిన రక్షణ చర్యలు లేకుండా భారతదేశ సాంప్రదాయ విత్తనాలను, వాటి జన్యు డేటాను దొరకబుచ్చుకోవటానికి వీలు కల్పించవచ్చని రైతులు ఆందోళనలు వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గత మే 21న ఈ సంస్కరణల ప్రమాదాలను పౌర సమాజం ఎత్తి చూపింది. జూలై 7న రైతు సంఘాలు, దేశీ విత్తన సంరక్షకులు, పర్యావరణ న్యాయవాదులు ఉమ్మడి లేఖలో ఇదే హెచ్చరిక చేశారు. జూలై 10న శాస్త్రవేత్తల బృందం కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖ రాసింది. ఒప్పందం భారతదేశ విత్తన సార్వభౌమత్వానికి గండి కొట్టేలా ఉందని హెచ్చరించింది.
ఈ విజ్ఞప్తిపై ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, యూరప్, ఓషియానియా నుంచి రైతు సంఘాలు, పౌర సమాజ సంస్థలు సంతకం చేశాయి. సంతకాలలో ఆఫ్రికన్ సెంటర్ ఫర్ బయోడైవర్సిటీ (దక్షిణాఫ్రికా), అసోసియాసియన్ నేషనల్ డి ్రపొడక్టోర్స్ ఎకోలోజికోస్ డెల్ పెరూ (పెరూ), అన్నదాన సాయిల్ – సీడ్ సేవర్స్ నెట్‌వర్క్ (ఇండియా), థర్డ్ వరల్డ్ నెట్‌వర్క్ (మలేషియా) వంటి ప్రసిద్ధ సమూహాలు సంతకాలు చేశాయి.
రైతులకు దక్కని ప్రయోజనాలు
బహుపాక్షిక వ్యవస్థలోపారదర్శకత లేక΄ోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 28,000 కంటే ఎక్కువ కార్పొరేట్ విత్తన సంస్థలు ఈ ఒప్పందం ప్రకారం 70 లక్షలకు పైగా విత్తన నమూనాలను ఉపయోగించుకున్నాయి. విత్తన కంపెనీలు ఈ వనరులతో అభివృద్ధి చేసిన కొత్త విత్తన రకాలపై మేధో సంపత్తి హక్కులను పొందాయి. అయితే, ఆ వనరులను అందించిన దేశాలకు లేదా రైతులకు ఎటువంటి ప్రయోజనాలు తిరిగి అందలేదని లేఖ ఎత్తి చూపింది.
రక్షణ చర్యలు లేకుండా బహుపాక్షిక వ్యవస్థను విస్తరిస్తున్నారని కూడా వారు విమర్శించారు. ప్రస్తుత 64 పంటలకు తోడు మిగతా అన్ని మొక్కల జన్యు వనరులను చేర్చడానికి ఈ వ్యవస్థను విస్తరించాలన్నది ప్రతిపాదన. ఇప్పటికే ఉన్న ప్రయోజన భాగస్వామ్య విధానాలు బలహీనంగా ఉన్నందున ఈ ప్రతిపాదన మరింత దోపిడీకి ఆస్కారం కలిగిస్తుందని అంటున్నారు.
రైతుల హక్కులకు రక్షణేదీ?
రైతుల హక్కులను గుర్తించాలని లేఖ పిలుపునిచ్చింది. విత్తనాలను పండించిన పంట నుంచి తీసి దాచుకోవటం, ఉపయోగించడం, ఇతరులకు ఇచ్చి పుచ్చుకుంటూ మార్పిడి చేయడం, విక్రయించడం వంటి రైతుల హక్కులను రక్షించడంలో నవంబర్‌లో జరిగే సమావేశానికి ముందు విడుదలైన ముసాయిదా విఫలమైందని ఎఫ్‌ఏవో డైరెక్టర్ జనరల్‌కు రాసిన లేఖపై సంతకాలు చేసినవారు ఆరోపించారు. బయోపైరసీ లేదా సాంప్రదాయ విత్తన రకాల పేటెంట్ మోసాలను అరికట్టే రక్షణలు ఇందులో లేవు. తమ విత్తనాలను స్వాధీనం చేసుకుని కార్పొరేట్ నియంత్రిత వంగడాలుగా మార్చే కంపెనీలు, వాటిని తిరిగి తమకే విక్రయిస్తారని రైతులు భయపడుతున్నారు.
ఎక్కువపారదర్శకత, జవాబుదారీతనం కావాలని రైతు సంఘాలు అడుగుతున్నాయి. అంతర్జాతీయ విత్తన ఒడంబడిక ఎవరు ఏ విత్తనాలను తీసుకుంటున్నారు? వాటిని ఎలా ఉపయోగిస్తున్నారు? అనే విషయాలను గుట్టుగా ఉంచకుండా, బహిరంగంగా వెల్లడించాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. విత్తన ఒడంబడికలో సంస్కరణలు చేసే ముందు ప్రపంచవ్యాప్తంగా రైతులతో సంప్రదింపులు జరపాలని పిలుపునిచ్చాయి.
జాతీయ సార్వభౌమత్వాన్ని లేదా కంపెనీలు కొత్త వంగడాల తయారీ ద్వారా పొందే ప్రయోజనాలలో అందుకు ఉపయోగపడినపాత విత్తనాల జన్యువనరులపై హక్కుదారులైన రైతులకు సముచిత భాగం పంచే వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఒక కొత్త ప్రక్రియను ప్రారంభించాలని రైతు సంఘాలు ప్రతిపాదించాయి. రైతుల జన్యు హక్కులకు బలమైన రక్షణలు కల్పించాలని, డిజిటల్ బయోపైరసీని నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నారు. – నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్