నమో డ్రోన్‌ దీదీ స్కీమ్ గురించి తెలుసా? | Namo Drone Didi Scheme Full Details Sagubadi | Sakshi
Sakshi News home page

నమో డ్రోన్‌ దీదీ స్కీమ్ గురించి తెలుసా?

Feb 20 2026 7:27 PM | Updated on Feb 20 2026 9:12 PM

Namo Drone Didi Scheme Full Details Sagubadi

మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ల పంపిణీతో సేద్యానికి టెక్నాలజీ దన్ను

వ్యవసాయ ఉత్పాదకత పెంపుదలకు, జీవనోపాధి మెరుగుదలకు దోహదం

గత రెండు దశాబ్దాల్లో డ్రోన్‌ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఒక శక్తిమంతమైన సాధనంగా ఎదిగింది. మన దేశం కూడా ఈ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తోంది. వ్యవసాయం, పాలన, అభివృద్ధి రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని వేగంగా విస్తరిస్తోంది. తొలుత ప్రయోగాత్మకంగా డ్రోన్ల వాడకం చిన్నగా ప్రారంభమైనా ఇప్పుడు ప్రభుత్వ సేవలు, మౌలిక సదుపాయాల నిర్వహణ, వ్యవసాయం, జాతీయ భద్రత వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే స్థాయికి చేరుకుంది. నమో డ్రోన్‌ దీదీ కార్యక్రమం కింద 1,094 డ్రోన్‌లను మహిళా స్వయం సహాయక సంఘాలకు అందించారు. ఇది వ్యవసాయ ఉత్పాదకతను, జీవనోపాధిని మెరుగుపరుస్తోంది. న్యూఢిల్లీలో ఏఐ సమ్మిట్‌ జరుగుతున్న సందర్భంగా డ్రోన్ల హవాపై ఫోకస్‌...

మన దేశంలో ప్రస్తుతం ఆధునిక వ్యవసాయంతో పాటు భూమి, ఆస్తి సర్వేలు, మౌలిక సదుపాయాల తనిఖీ, విపత్తు నిర్వహణ, రైల్వే, హైవేల పర్యవేక్షణ వంటి పనుల కోసం డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల తయారీదారులు, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు, శిక్షణ సంస్థలు, అంకుర సంస్థలు, పరిశోధన సంస్థలు, ధ్రువీకృత పైలట్‌ల కృషితో డ్రోన్ల వినియోగం ప్రభుత్వ నిబంధనలకు లోబడి నానాటికీ విస్తరిస్తోంది.

కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి 2026 నాటికి దేశంలో 38,500కు పైగా నమోదిత డ్రోన్‌లు(యూఐఎన్‌) వాడుకలో ఉన్నాయి. 39,890 డీజీసీఏ–ధ్రువీకృత పైలట్లు సేవలందిస్తున్నారు. 244 శిక్షణా సంస్థలు డ్రోన్‌ సంబంధిత నైపుణ్యాలను అందిస్తున్నాయి. స్వమిత్వ పథకం కింద డ్రోన్‌లను ఉపయోగించి 3.28 లక్షల గ్రామాలను సర్వే చేశారు. 31 రాష్ట్రాల్లోని 1.82 లక్షల గ్రామాలకు సంబంధించి 2.76 కోట్ల ఆస్తి కార్డులను రూపొందించారు.

సరళీకృత విధాన నిర్ణయాలు డ్రోన్‌ వ్యవస్థ విస్తరణకు దోహదపడుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల ఈ రంగం ఇంతగా అభివృద్ధి చెందింది. సరళీకృతమైన డ్రోన్‌ నియమాలు, ‘డిజిటల్‌ స్కై’ సింగిల్‌ విండో ప్లాట్‌ఫారమ్, తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, లక్షిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, డ్రోన్‌ వినియోగాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రభుత్వ పథకాల్లో డ్రోన్‌లను చేర్చడం వల్ల పనులు మరింత వేగంగా, పారదర్శకగా జరుగుతున్నాయి.

నమో డ్రోన్‌ దీదీ సేవలు
నవంబర్‌ 2023లో ప్రారంభించిన ‘నమో డ్రోన్‌ దీదీ’ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు మద్దతుగా మహిళా స్వయం సహాయక సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ) డ్రోన్లను అందించడం ఈ పథకం లక్ష్యం. వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పంట ఉత్పాదకతను పెంచడం, పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యాలు.

డ్రోన్‌ దీదీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ప్రముఖ ఎరువుల కంపెనీల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు 1,094 డ్రోన్లు పంపిణీ అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో నమో డ్రోన్‌ దీదీ పథకం కింద అందించినవి 500కు పైగా డ్రోన్లు ఉన్నాయి.

నమో డ్రోన్‌ దీదీ పథకం (Namo Drone Didi Scheme) శ్రమతో కూడిన పాత పిచికారీ పద్ధతులకు స్వస్తి చెప్పి.. కచ్చితమైన ఫలితాలు సాధించే కృషి దిశగా వ్యవసాయంలో గణనీయమైన మార్పునకు శ్రీకారం చుట్టింది.

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన ఒక డ్రోన్‌ దీదీ మాట్లాడుతూ డ్రోన్‌ శిక్షణ తనను శక్తివంతం చేసిందన్నారు. స్వయం సహాయక సంఘం తరఫున నానో ఎరువులు, పురుగు మందుల పిచికారీ సేవలను అందిస్తూ ఆదాయం పొందుతున్నానని వివరించారు.

డ్రోన్ల నిబంధనలు మీకు తెలుసా?
దేశంలో డ్రోన్ల వినియోగం వేగవంతంగా విస్తరిస్తోంది. డ్రోన్ల తయారీ, వినియోగాన్ని వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర విధానపరమైన, ఆర్థిక చట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, నిబంధనల అమలును సులభతరం చేయడానికి, స్వదేశీ డ్రోన్ల ఉత్పత్తిని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంది.

డ్రోన్‌ రూల్స్‌ 2021ను 2022, 2023లలో సవరించారు. ఈ సవరణలు మన దేశ డ్రోన్‌ వ్యవస్థను సరళీకరించాయి.

నియంత్రణ విధానాలు సులభతరమయ్యాయి. ఫారమ్‌ల సంఖ్యను 25 నుంచి 5కి తగ్గించారు. అనుమతుల అవసరాలను 72 నుంచి కేవలం 4కు తగ్గించారు.

ఫీజుల హేతుబద్ధీకరణ జరిగింది. డ్రోన్‌ పరిమాణంతో సంబంధం లేకుండా ఫీజుల నిర్ణయం జరిగింది.

పౌర డ్రోన్‌ కార్యకలాపాల్లో 500 కేజీల బరువు వరకు ఉన్న డ్రోన్ల వాడకానికి అనుమతి లభించటంతో వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం వినియోగం పెరిగింది.

 గగనతలంలో దాదాపు 90%ను గ్రీన్ జోన్‌గా ప్రకటించారు. 400 అడుగుల ఎత్తు వరకు డ్రోన్లను ప్రభుత్వం అనుమతిస్తున్నది.

‘సాంప్రదాయ పైలట్‌ లైసెన్స్‌కు బదులుగా డీజీసీఏ జారీ చేసే ‘రిమోట్‌ పైలట్‌ సర్టిఫికేట్‌’ను ప్రవేశపెట్టారు.
పాస్‌పోర్ట్‌ అవసరం లేదు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ, అడ్రస్‌ ప్రూఫ్‌ ఉంటే డ్రోన్లను నడపడానికి సరిపోతుంది.

మొత్తంగా ఈ సంస్కరణలు డ్రోన్‌ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి గల అడ్డంకులను గణనీయంగా తగ్గించాయి. డ్రోన్‌ సేవల అందుబాటును గ్రామాల్లో పెంచడానికి దోహదపడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

డ్రోన్లు, డ్రోన్‌ విడిభాగాల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించటానికి పీఎల్‌ఐ పథకానికి కేంద్రం రూ.120 కోట్లు కేటాయించింది. అంకుర సంస్థలు, ఎంఎస్‌ఎంఈలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, దేశీయ డ్రోన్‌ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ పథకం వీలు కల్పిస్తోంది.

సెప్టెంబర్‌ 2025లో డ్రోన్లపై జీఎస్టీని ఏకరీతిగా 5 శాతానికి తగ్గించారు. అంతకుముందు 18%, 28% పన్ను రేట్లు ఉండేవి.

డ్రోన్‌ రిజిస్ట్రేషన్, రిమోట్‌ పైలట్‌ సర్టిఫికేషన్, టైప్‌ సర్టిఫికేషన్, ఆర్టీపీఓ అధికారాల వంటి నియంత్రణ సేవలు డిజిటల్‌ స్కై ప్లాట్‌ఫారమ్‌ నుంచి ఈజీసీఏకి మార్చారు. విమాన ప్రణాళిక, ఎయిర్‌స్పేస్‌ మ్యాప్‌ వంటి కార్యాచరణ సేవలు డిజిటల్‌ స్కై ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానితమై కొనసాగుతున్నాయి.

చ‌ద‌వండి: సేంద్రియ ఆహారంతో ఆరోగ్యానికి మేలేనా?

మన దేశంలో డ్రోన్‌ వ్యవస్థ పైలట్ ప్రాజెక్టుల స్థాయి నుంచి ఆవిష్కరణ–ఆధారిత ప్రధాన స్రవంతి రంగంగా ఎదిగింది. మహిళా సాధికారత, గ్రామీణ సదుపాయాలు, దేశీయ తయారీకి మద్దతు ఇచ్చే కార్యక్రమాలతో ప్రభుత్వం సాంకేతిక ఆవిష్కరణలను, విస్తృత డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. డ్రోన్లు ఇప్పుడు వ్యవసాయం, భూమి, ఆస్తి సర్వేలు, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, విపత్తు అంచనా, పౌర సేవల పంపిణీ వంటి కీలక రంగాలలో భాగమయ్యాయి. 

పంట నష్టాల సేకరణ సులువు
దేశంలో అనేక రంగాల్లో డ్రోన్లు వివిధ రంగాలలో సామాజిక–ఆర్థిక అభివృద్ధి ఫలితాలను అందిస్తున్నాయి. వ్యవసాయంలో వీటి వినియోగం మహిళా రైతులకు సాధికారత కల్పించడమే కాకుండా పంట నష్టాల అంచనా పనులను మెరుగుపరిచింది. మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళికలో ఇవి చురుకైన పర్యవేక్షణ, మెరుగైన వనరుల నిర్వహణకు వీలు కల్పించాయి. 

భూ వివాదాల పరిష్కారానికి డ్రోన్లు
సర్వే ఆఫ్‌ విలేజెస్‌ అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రువైజ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌(స్వమిత్వ) పథకంలో డ్రోన్‌ సాంకేతికత ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ పథకాన్ని ఏప్రిల్‌ 2020లో ప్రారంభించారు. దీన్ని పంచాయతీ రాజ్‌ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, సర్వే ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. భూ వివాదాలను పరిష్కరించడానికి, బ్యాంకు రుణాలు పొందడాన్ని సులభతరం చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్‌ ఆధారిత మ్యాపింగ్‌ చేపట్టారు.

డిసెంబర్‌ 2025 నాటికి 3.28 లక్షల గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తయింది. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 1.82 లక్షల గ్రామాలకు సంబంధించి 2.76 కోట్ల ఆస్తి కార్డులు సిద్ధమయ్యాయి.నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ హెచ్‌ఏఐ) అన్ని హైవే ప్రాజెక్టుల కోసం ప్రతి నెలా డ్రోన్‌–వీడియో రికార్డింగ్‌లను తప్పనిసరి చేసింది.

విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు కూడా డ్రోన్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. రైల్వే ట్రాక్‌లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, నిర్వహణ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ యూఏవీలు/డ్రోన్లను ఉపయోగిస్తోంది. అదేవిధంగా, దేశ రక్షణలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

– నిర్వహణ: 
పంతంగి రాంబాబు
సాక్షి సాగుబడి డెస్క్‌ 

Advertisement
 
Advertisement
Advertisement