సేంద్రియ ఆహారంతో ఆరోగ్యానికి మేలేనా? | Organic food doubts clarification full details here Sagubadi | Sakshi
Sakshi News home page

సేంద్రియ ఆహారంతో.. ఆరోగ్యంపై సానుకూల ప్రభావం

Feb 6 2026 6:09 PM | Updated on Feb 6 2026 6:31 PM

Organic food doubts clarification full details here Sagubadi

ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో విస్తరించిన సేంద్రియ వ్యవసాయ సంస్థలతో కూడిన నెట్‌వర్క్‌ ఐఫోమ్‌– ఆర్గానిక్స్‌ ఇంటర్నేషనల్‌. జర్మనీలోని బాన్‌ కేంద్రంగా 1972 నుంచి పనిచేస్తోంది. 700 పైచిలుకు అనుబంధ సంస్థలకు సేంద్రియ సంబంధిత అంశాలపై చోదక శక్తిగా ఉంది. సేంద్రియ వ్యవసాయం, మార్కెటింగ్‌ తదితర అంశాలపై ఆర్గానిక్స్‌ ఇంటర్నేషనల్‌ నిపుణులు ఏమంటున్నారంటే..?

సేంద్రియ వ్యవసాయం ప్రయోజనాలేంటి? 
నేల సారాన్ని పెంపొందించడం, పరిశుభ్రమైన నీటిని అందుబాటులోకి తేవటం, జీవవైవిధ్యం కోసం పెట్టుబడి పెట్టడం, మట్టిలో సేంద్రియ పదార్థాన్ని స్థిరీకరించడం ద్వారా వాతావరణ మార్పును తగ్గించడం. నెదర్లాండ్స్‌లో డెలాయిట్‌ నిర్వహించిన ఇటీవలి అధ్యయనం ప్రకారం.. రైతులందరినీ 100% సేంద్రియ సాగుకు మళ్లిస్తే పన్ను చెల్లింపుదారులు సంవత్సరానికి 1000 కోట్ల యూరోలు ఆదా చేయవచ్చని లెక్కగట్టింది. మరొక అధ్యయనం ప్రకారం.. వ్యవసాయాన్ని సేంద్రియం వైపు మళ్లిస్తే సరఫరా గొలుసులను ప్రమాదం నుంచి రక్షించవచ్చు. ఆహార భద్రతకు దోహదపడుతుంది.

సేంద్రియం ప్రపంచాన్ని పోషించలేదనే విషయం నిజమేనా?
రసాయనిక వ్యవసాయంలో ఉత్పాదకత స్తబ్దుగా ఉండటంతో పాటు చాలా సవాళ్లు ఉన్నాయి. పంటల మార్పిడి పాటిస్తూ సేంద్రియ సాగు చేస్తే సాధారణ సాగుకు దీటుగా దిగుబడి వస్తుందని కెన్యాలోని చుకా, కందరాలలో జరిగిన దీర్ఘకాలిక అధ్యయనాలు నిరూపించాయి. బొలీవియాలోని అగ్రోఫారెస్ట్రీ కోకో పొలాల్లోనూ ఇది రుజువైంది.

సేంద్రియ ఆహారం పర్యావరణానికి మేలేనా?
సేంద్రియ సాగు (Organic Farming) పద్ధతుల వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాలు శాస్త్రీయ గణాంకాల ద్వారా ధృవీకరించబడ్డాయి. మల్చింగ్‌ వంటి సేంద్రియ పద్ధతులు భూమిని క్షీణింపజేయకుండా కాపాడుతాయి. మంచి దిగుబడిని ఇస్తాయని తేలింది. ఇంధన వినియోగం తగ్గి, నేల సారం పెరిగి పర్యావరణంపై సానుకూల ప్రభావం ఉంటుందని గణాంకాలు నిర్థారిస్తున్నాయి.

సేంద్రియ ఆహారం ఖరీదైనది. అందుబాటులో లేదన్నది నిజమేనా?
అమెరికా వాసుల (జనవరి 2025) అభిప్రాయం ప్రకారం సేంద్రియ ఉత్పత్తులు సాధారణ ఉత్పత్తుల కంటే సగటున 52% ఖరీదైనవి. ఒక ప్రాంతంలో రైతులందరినీ స్థానిక పంటలను, సీజన్‌కు అనువైన పంటలను సేంద్రియంగా పండించటాన్ని ప్రోత్సహిస్తే ప్రజలకు సేంద్రియ ఆహారం అందుబాటులోకి వస్తుంది. సరసమైన ధరకే అందించవచ్చు. స్థానికంగా పండించిన పంటలను స్థానికంగానే ప్రాసెసింగ్‌ చేసి అమ్మితే.. గ్రామీణ మార్కెట్లలో సేంద్రియ ఆహారం మరింత అందుబాటులోకి వస్తుంది. ఈ దిశగా ప్రయత్నం జరగాలి.  

సేంద్రీయ ఉత్పత్తుల ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుంది? 
ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుందనటానికి బలమైన ఆధారాలున్నాయి. సేంద్రియ ఆహార ఆరోగ్య ప్రయోజనాలను వినియోగదారులు, శాస్త్రవేత్తలు ఇద్దరూ గుర్తించారు. యూరోపియన్‌ ఫుడ్‌ సేఫ్టీ ఏజెన్సీ  అధ్యయనం ప్రకారం.. సాధారణ ఆపిల్‌ పండ్ల కంటే సేంద్రియ ఆపిల్‌లు 19% అదనంగా ఆరోగ్యకరమైనవని తేలింది. నేషనల్‌ పెస్టిసైడ్‌ అబ్జర్వర్‌ సమాచారం ప్రకారం సేంద్రియ ఆహారానికి మారటం వల్ల మూత్రంలో గడ్డి మందు గ్లైఫొసేట్‌ అవశేషాలు గణనీయంగా తగ్గుతాయి.

చ‌ద‌వండి: ఈ మొక్కే ఒక‌ ఎరువుల ఫ్యాక్ట‌రీ!

Advertisement
 
Advertisement
Advertisement