సీతావనం  | Actress Seetha organic farm SeethaVanam in Coimbatore | Sakshi
Sakshi News home page

సీతావనం 

Nov 2 2025 12:54 AM | Updated on Nov 2 2025 12:54 AM

Actress Seetha organic farm SeethaVanam in Coimbatore

‘ఎప్పటికీ ఇలానే ఉంటావా... పెరగవా?’... మొక్కని ముద్దుగా విసుక్కున్నారు సీత. ఆశ్చర్యం...  తర్వాత ఆ మొక్కలో పెరుగుదల కనిపించింది. ఆమె తాకితే గాలి లేకపోయినా మొక్క ఊగుతుంది. మొక్కల పట్ల సీత చూపించే మమకారం ఆ స్థాయిలో ఉంటుంది.  ‘ఏంటీ ఎవరైనా ఏమైనా అన్నారా... నాతో చెప్పు’... గిన్నె కోడిని దగ్గరకు తీసుకుని అడిగారు సీత.. ‘అవును’ అన్నట్లు మరో కోడి వైపు చూసింది గిన్నె కోడి. 

మూగ జీవాలతో సీత కమ్యూనికేట్‌ అయ్యే విధానం ఇలా ఉంటుంది. విచిత్రంగా ఉందా! సీత ఇన్‌స్టాగ్రామ్‌ చూడండి. ఆ ప్రేమ మనకూ అర్థమవుతుంది. సీత ఎంత గొప్పగా నటిస్తారో మనకు తెలుసు. తెరవెనక ఆమె మొక్కలను, చెట్లను, మూగజీవాలను ప్రేమిస్తారు. ‘సీతావనం నేచురల్‌ ఫామ్‌’లోకి వెళ్లిపోతే, ఆమెది పూర్తిగా వేరే ప్రపంచం. అదొక ప్రేమవనం. ఆ ప్రపంచం ఎలా ఉంటుందో ‘సాక్షి’తో సీత ప్రత్యేకంగా పంచుకున్నారు.

→ నా చిన్నప్పుడు హాలిడేస్‌కి మా అమ్మమ్మవాళ్లింటికి వెళ్లేదాన్ని. మా అమ్మ తోడబుట్టినవాళ్లు మొత్తం పదకొండు మంది. మా పొలంలో పండించిన బియ్యం, కూరగాయలు అవీ చూసినప్పుడు నాకు భలే అనిపించేది. వంకాయలు, బెండకాయలు కోస్తున్నప్పుడు బాగా అనిపించేది. ఎప్పటికైనా ఫామింగ్‌ చేయాలనే ఆలోచన నాకు అప్పుడే మొదలైంది. అయితే అనుకోకుండా సినిమా హీరోయిన్‌ని కావడం, బిజీ కావడం, పెళ్లి, పిల్లల వల్ల ఆ ఇష్టాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది.

 కెరీర్‌ నుంచి కొంచెం బ్రేక్‌ కూడా తీసుకున్నాను. మళ్లీ నటించడం మొదలుపెట్టాను. ఫైనల్లీ కాస్త టైమ్‌ దొరకడంతో ముందు ‘రూఫ్‌ టాప్‌’ గార్డెనింగ్‌ మొదలుపెట్టాను. మొక్కలు పెరుగుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇక నెక్ట్స్‌ ఏంటి? అనుకుని ఒక ‘ఫామ్‌’ ఏర్పాటు చేసుకోవాలనుకున్నాను. కాంచీపురంలో ఫామ్‌ హౌస్‌ని ప్లాన్‌ చేసుకున్నాను.

→ కాంచీపురంలోని నా ‘సీతావనం ఫామ్‌’లో రకరకాల పండ్లు, కూరగాయలు పెంచడంతో పాటు గేదెలు, మేకలు, గాడిదలు, కోళ్లు... ఇలా చాలా ఉన్నాయి. ఫామ్‌ అనేది నా కల మాత్రమే కాదు... మా అమ్మగారిది కూడా. ఈ మధ్యే అమ్మ దూరమయ్యారు. అయితే తన కల నెరవేర్చగలిగినందుకు ఆనందంగా ఉంది. షూటింగ్‌ లేనప్పుడు కాంచీపురం వెళ్లిపోతాను. ఫామ్‌లో చిన్న ఇల్లు కట్టుకున్నాను. మొక్కలు, చెట్లు, మూగజీవాల మధ్య ఉన్నప్పుడు నాకు ‘దేవలోకం’లో ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది.

→ ఇప్పుడు మనం తింటున్న ఆహారం దాదాపు కలుషితమే. అయితే నేచురల్‌ ఫామింగ్‌ అనేది చాలా కష్టం. నేను కొంచెమే పండిస్తాను కాబట్టి ఓకే. కానీ పంట లార్జ్‌ స్కేల్‌లో ఉన్నప్పుడు కొన్ని ‘ప్రిజర్వేటివ్స్‌’ వాడతారు. మరి... పండించినవి పాడవ్వకుండా ఉండాలంటే వాళ్లకు తప్పదు. నేను నా ఫ్యామిలీ వరకే పండించుకుంటాను కాబట్టి ప్రిజర్వేటివ్స్‌తో నాకు పని లేదు. ఏడాదికి 20 నుంచి 25 మూటల బియ్యం వస్తే... మాకు, మా బంధువులకే సరిపోతుంది. కూరగాయలు, పండ్లు కూడా మావాళ్లకు పంపించేస్తాను. మనం పండించుకున్నవాటికి, బయట కొనుకున్న వాటికి తాజాదనం, రుచిలో చాలా తేడా ఉంటుంది.

→ ఫామింగ్‌ని కమర్షియలైజ్‌ చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. కానీ అందరికీ నేచురల్‌ ఫుడ్‌ అందించాలనే లక్ష్యం ఉంది. లార్జ్‌ స్కేల్‌లో అందివ్వాలనుకున్నప్పుడు ఉచితంగా ఇవ్వలేం కదా. అయితే ఎలాంటి కలుషితాలు లేకుండా ఆర్గానిక్‌ ఫుడ్‌ అందించడమంటే ఇతరుల ఆరోగ్యానికి మేలు చేసినట్లే.

→ మంచి ఆహారం తీసుకున్నప్పుడు మన శారీరక ఆరోగ్యం బాగుంటుందనేది అందరికీ తెలిసిందే. ఫామింగ్‌ వల్ల ‘మెంటల్‌ హెల్త్‌’ కూడా బాగుంటుంది. నేను ఎప్పుడైతే ‘రూఫ్‌ టాప్‌ గార్డెనింగ్‌’ మొదలుపెట్టానో అప్పుడే మానసికంగా రిలాక్స్‌›్డగా ఉంటున్న విషయం నాకు అర్థమైంది. ఫామింగ్‌ మొదలుపెట్టాక మనుషులతో కమ్యూనికేట్‌ కావడం తగ్గిపోయింది. మొక్కలు, చెట్లతో కమ్యూనికేట్‌ అవుతున్నాను.

→ మొక్కలు, మూగజీవాలు మన ఫీలింగ్స్‌ని అర్థం చేసుకుంటాయి. మనం ఏడిస్తే అవీ ఏడుస్తాయి. ఈ మాటలు కొందరికి విచిత్రంగా అనిపించొచ్చు. కానీ స్వయంగా అనుభవించినవారికి అర్థం అవుతుంది. చెబితే పిచ్చి అనుకుంటారేమో కానీ నేను మాట్లాడినప్పుడు ఆ మూగజీవాలు కూడా నాతో కమ్యూనికేట్‌ అవుతాయి. అది నాకు మాత్రమే అర్థం అవుతుంది. అలాగే మన ‘టచ్‌’ కూడా వాటికి ముఖ్యం. నేను ఒక్కో చెట్టుని తాకుతూ వెళుతుంటాను. అప్పుడు గాలి లేకపోయినా అవి ఊగుతాయి. మన స్పర్శ వాటిని అంత ఆనందపరుస్తుంది. 

నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మూడు రీల్స్‌ పెట్టాను. అవి చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓ రెండు మూడు నెలలు ఫామ్‌కి వెళ్లడానికి కుదరక, ఆ తర్వాత వెళ్లినప్పుడు గేదె పక్కన కూర్చుని, ‘మునియన్‌ (వాచ్‌మేన్‌ పేరు) బాగా చూసుకుంటున్నాడా... సరిగ్గా తిండి పెడుతున్నాడా... మమ్మీ దగ్గర చెప్పు’ అని అడిగితే ‘ఇస్తున్నాడు’ అన్నట్లు వేగంగా తలూపింది. ఆ రీల్‌ పోస్ట్‌ చేశాను. ఇంకోటి ఏంటంటే... చిన్నది చాలా నాటీ. నన్ను చూడగానే ఎగురుతుంది. నేను దాంతో ‘ఏంటి ఇంత నాటీ’గా ఉంటావ్‌? అని అడిగితే, అమ్మకు తన బిడ్డను ఏదో అంటున్నానని అర్థం అయి, నా మీద మీదకు వచ్చింది (నవ్వుతూ). నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. మనకీ, వాటికీ ఉన్న ఒకే ఒక్క తేడా... మనం మాట్లాడగలం... అవి మాట్లాడలేవు... అంతే.

→ షూటింగ్‌ కోసం ఎక్కడికి వెళ్లినా నా మనసంతా నా ఫామ్‌లో ఉన్న నా పిల్లల పైనే ఉంటుంది. వాచ్‌మేన్‌ సరిగ్గా నీళ్లు పెట్టాడా? టైమ్‌కి ఆహారం పెట్టాడా? వంటివి  కెమెరాలో చెక్‌ చేసుకుంటాను. ఇక రాత్రి నేను నిద్రపోయే ముందు ఫామ్‌ని ఓసారి కెమెరాలో చూస్తాను. నాలుగు గేదెలు, ఆ తర్వాత ఒక గాడిద, ఆ తర్వాత మేకలు వరుసగా నిద్రపోతుంటాయి. అవి అలా ఒకేచోట హ్యాపీగా నిద్రపోతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. 

నేను పెట్టిన మొక్కకు పువ్వులు పూయలేదనుకోండి... అప్పుడు ఆ మొక్కతో ‘నీకేం తక్కువ చేశాను... బాగానే చూసుకుంటున్నా’ కదా అని మాట్లాడతాను. ఆ మాటలు దానికి అర్థం అవుతాయి. పువ్వులు పూయిస్తుంది. అలాగే చెట్టు పెరగనప్పుడు ‘ఎప్పుడూ ఇలానే ఉండిపోతావా... పెరగనే పెరగవా’ అని నా బాధనంతా వెళ్లగక్కుతాను. అది పెరుగుతుంది. వాటికి నీళ్లు మాత్రమే పోస్తే సరిపోదు... ప్రేమ కూడా ఇవ్వాలి. నేను ఫామ్‌హౌస్‌లో లేనప్పుడు వాచ్‌మేన్‌ నీళ్లు పోస్తాడు. కానీ ప్రేమను ఇవ్వలేడు కదా. అందుకే నేను వెళ్లినప్పుడల్లా ప్రేమను పంచుతాను. నేను అక్కడ ఉన్నప్పుడు రెండు పూటలా నేనే నీళ్లు పోస్తాను. వాటితో మాట్లాడుతూ, తాకుతూ ప్రేమను పంచుతాను.

→ నా ఫామ్‌లో గిన్ని కోళ్లు కూడా ఉన్నాయి. ఒకసారి నేను కూర్చుని ఉంటే... నా దగ్గరకు వచ్చి కాళ్లెత్తుతూ ఏదో చె΄్పాలని ప్రయత్నం చేసింది. నాకేం అర్థం కాలేదు. బాధగా కనిపించింది. ‘ఏంటమ్మా... ఎవరైనా గొడవపడ్డారా? ఏమైనా అన్నారా?’ అంటే, వెనక్కి తిరిగి చూసింది. దూరంగా ఇంకో కోడి అలిగినట్లు మునగదీసుకుని కూర్చుని ఉంది. వెంటనే దాన్ని తీసుకొచ్చి, ‘ఏంటీ తనతో ఎందుకు మాట్లాడటంలేదు. చూడు... ఎలా ఉందో’ అన్నాను. ‘అమ్మ దగ్గర చెబితే సాల్వ్‌ చేస్తుంది’ అని దాని నమ్మకం. ఈ రీల్‌ కూడా నా ఇన్‌స్టాలో ఉంది. ఇక ఇదే గిన్ని కోడి గురించి ఇంకోటి చెబుతాను. నాతో మాట్లాడటానికి ఎవరైనా కొత్తవాళ్లు వస్తే... వాళ్లని పొడవడానికి వెళ్లిపోతుంది. నేను చాలా రోజుల తర్వాత వెళితే, నా మీదకు ఎగురుతుంది. దానికి చాలా బలం ఎక్కువ. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని అలా ఎగురుతూ ఎక్స్‌ప్రెస్‌ చేస్తుంది. ఆ రోజు నా చేతిలో ఒక కర్ర ఉంటే, కోపంగా దాన్ని లాగి కిందపడేసింది. నాకైతే నవ్వాగలేదు. నేను ఫామ్‌హౌస్‌కి వెళిపోతే బయటకు రానే రాను.


మనం తింటున్న ఆహారాన్ని మనమే పండించుకోవాలనే ఆలోచన నాకు నా పెద్దవాళ్లని చూసి కలిగింది. సందర్భం, సమయం కుదిరినప్పుడు కచ్చితంగా చేయాలనే ధ్యేయంతో పెరిగాను. అనుకున్నట్లే చేయగలిగాను. సహజమైన పద్ధతిలో మన ఆహారాన్ని మనం పండించుకోవడంకన్నా మంచి బహుమతి ఇంకోటి ఉండదన్నది నా ఫీలింగ్‌. ‘ఐయామ్‌ రియల్లీ ఎంజాయింగ్‌’.   

– డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement