'అవతార్' సినిమాలో మీకు నచ్చిన విషయం ఏంటంటే చాలామంది చెప్పే మాట గ్రాఫిక్స్(వీఎఫ్ఎక్స్). నీలం రంగు మనుషులు, వాళ్లు ఉండే ప్రదేశం, వింత వింత ఆకారాలు.. ఇలా ఒకటేమిటి మూవీలోని ప్రతిదీ కూడా ఇంతకుముందు మనం ఎప్పుడూ చూడనదే. వీటన్నింటిని వందలాది మంది ఏళ్లకు ఏళ్లు కష్టపడి సృష్టించారు. అయితే పండోరా ప్రపంచాన్ని సృష్టించడంలో, వీఎఫ్ఎక్స్ విభాగాన్ని దగ్గరుండి నడిపించడంలో ఓ భారతీయ మహిళ కీలక పాత్ర పోషించిందని మీలో ఎంతమందికి తెలుసు?
ప్రపంచంలో ఏ రంగంలో చూసినా భారతీయుల ఆధిపత్యం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా మహిళలు కూడా పురుషులకు ఏ మాత్రం తీసిపోని విధంగా దూసుకెళ్తున్నారు. తాజాగా బయటపడిన ఓ సంగతి.. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. ప్రపంచ సినీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమాల్లో 'అవతార్' ఒకటి. ఇప్పటికే రెండు భాగాలు రిలీజ్ కాగా.. ఈ శుక్రవారం మూడో పార్ట్ థియేటర్లలోకి రానుంది.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తీసిన ఈ అద్భుతమైన సినిమాల్లో వీఎఫ్ఎక్స్ టాప్ నాచ్‌లో ఏ మాత్రం వంకపెట్టడానికి వీల్లేని విధంగా ఉంటాయని చెప్పొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వెటా ఎఫ్ఎక్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో తయారవుతున్నాయి. ఇందులో పావనీ రావు బొడ్డపాటి అనే భారతీయ మహిళ.. వీఎఫ్ఎక్స్ టీమ్‌ని లీడ్ చేస్తోంది. తాజాగా ఈమె.. తన గురించి, ఈ మూవీస్ కోసం తాము ఎంతలా కష్టపడ్డామనే విషయాన్ని చెప్పుకొచ్చింది.
ఢిల్లీలో పుట్టి పావని రావు.. తల్లిదండ్రులు, నానమ్మ-తాతయ్యతో కలిసి పెరిగింది. తన నానమ్మ స్వతహాగా ఆర్టిస్ట్ అని, కనిపించిన ప్రతి పేపర్‌పైన ఏదో ఒక బొమ్మ వేస్తూనే ఉండేవారని.. ఆమె ద్వారా ఇటువైపు ఆసక్తి పెరిగిందని.. అలా తొలిసారి 2009లో 'అవతార్' కోసం లైటింగ్ టీడీగా పనిచేశానని.. అప్పటినుంచి పండోరా ప్రపంచంలో ఓ భాగమైపోయానని ఈమె చెప్పింది.
పావని రావు విషయానికొస్తే.. ఢిల్లీలో పెరిగిన ఈమె.. ఇక్కడే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్కిటెక్చర్‌లో బీఆర్క్ పట్టా పొందింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని అకాడమీ ఆఫ్ ఆర్ట్ యూనివర్సిటీ నుంచి ఎంఎఫ్‌ఏ, యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ వెల్లింగ్టన్‌లో భర్తతో కలిసి నివసిస్తోంది. 2009లో తొలిసారి 'అవతార్' కోసం పనిచేసిన ఈమె.. ఇప్పుడు రాబోతున్న మూడో భాగానికి కూడా పనిచేసింది.
తొలి భాగంలో ఈమె పాత్ర తక్కువగా ఉన్నప్పటికీ.. 2022లో రిలీజైన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' కోసం దాదాపు 3000 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్, అవి కూడా ఎక్కువ భాగం నీటి అడుగున ఉన్నవి పావన్ టీమ్ సృష్టించారు. ఇప్పుడు అవతార్ 3( 'ఫైర్ అండ్ యాష్') కోసం అగ్ని, బూడిద తదితర వీఎఫ్ఎక్స్ షాట్స్ రూపొందించారు. మరి ఇవి ఎలా ఉండబోతున్నాయనేది మరికొన్నిరోజుల్లో తెలుస్తుంది. ఏదేమైనా 'అవతార్' లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో వీఎఫ్ఎక్స్ లాంటి కీలకమైన విభాగాన్ని భారతీయ మహిళ దగ్గరుండి నడిపించడం అంటే చాలా విశేషం.


