బెంగళూరు: నటి చైత్ర, ప్రముఖ నిర్మాత హర్షవర్ధన్‌కు సంబంధించిన కుటుంబ వివాదం ఇప్పుడు పోలీస్ కేసుగా మారింది. సొంత భార్యను నిర్మాత కిడ్నాప్ చేశాడంటూ చైత్ర తల్లి బెంగళూరులోని బ్యాటరాయనపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
నటి చైత్ర, నిర్మాత హర్షవర్ధన్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. కుటుంబ కలహాల కారణంగా దంపతులు వేరుగా నివసిస్తున్నారు. చైత్ర తన కుమార్తెను వెంట తీసుకుని మైసూరులో ఉంటుండగా, హర్షవర్ధన్ బెంగళూరులో ఉన్నట్టు సమాచారం.
ఈ క్రమంలో తన కుమార్తెను చూడాలనే కారణంతో హర్షవర్ధన్ చైత్రను బలవంతంగా కిడ్నాప్ చేశాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై బ్యాటరాయనపుర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఇది కుటుంబ వివాదమా? లేక నేరుగా కిడ్నాప్ కేసా? అన్న కోణంలో పోలీసులు అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై చైత్ర, హర్షవర్ధన్ నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది.


