టాలీవుడ్‌లో సహాయనటిగా గుర్తింపు తెచ్చుకున్న వాహిని అలియాస్ పద్మక్క చావుబతుకుల మధ్య పోరాడుతోంది. ఆమె కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి మరింత క్షీణించడంతో ఐసీయూలో చేర్చి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కీమోథెరపీ, ఆపరేషన్, ఐసీయూలో ట్రీట్‌మెంట్ కోసం రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
కరాటే కల్యాణి ఎమోషనల్ పోస్ట్
ఆర్టిస్ట్ జీవితం ఎప్పుడు, ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. మద్రాస్ నడిగర సంఘం సభ్యత్వం ఉండి తెలుగు సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ వేసి.. అప్పుడప్పుడు సీరియల్స్‌లో మెరుస్తోంది పద్మక్క అలియాస్ వాహిని. ఆమె మా విజయనగంలో మా పెదనాన్న ఇంటి పక్కనే ఉండేవారు. చిన్నప్పుడు ఆమె సినిమాల్లోకి వెళ్లినప్పుడు నేను స్కూల్‌లో ఉన్నాను. ఈరోజు అక్కకి ఇలా క్యాన్సర్ సోకి ప్రాణాంతకంగా మారింది. మనల్ని అందరినీ అలరించిన ఈ నటి కష్టంలో ఉంది.. ఆమెను మనందరం ఆదుకుందాం..
దయచేసి కాపాడండి
కొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. దురదృష్టవశాత్తూ ఆమె ఆరోగ్యం విషమించింది. బహుళ అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్స మొత్తానికి రూ. 25 లక్షల నుంచి రూ.35 లక్షల మేర అవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఇంత ఖర్చు ఆమె కుటుంబం భరించలేదు. దయచేసి ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు పంపేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను జత చేసింది. ఇది చూసిన నెటిజన్లు వాహిని క్యాన్సర్‌ను జయించి త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
ఎవరీ వాహిని?
వాహిని.. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. జయవాహిని పేరుతో ఎక్కువ ఫేమస్ అయింది. చివరగా పోలీస్ వారి హెచ్చరిక సినిమాలో నటించింది.

చదవండి: భరణి అవుట్.. సెకండ్ ఫైనలిస్ట్‌గా తనూజ.. కానీ ఓ ట్విస్ట్


